
సీపీఎం సైకిల్ యాత్ర
స్థానిక సమస్యలను గుర్తించడం, వాటి పరిష్కారం కోసం పోరాటాలు చేయడం దీని ప్రధాన ఉద్దేశం.
నిత్యం ప్రజా సమస్యల మీద పోరాటం చేసే సీపీఎం పార్టీ మరో సారి సరి కొత్త కార్యక్రమానికి తెర తీసింది. మార్చి 8 నుంచి ప్రజా చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టింది. స్థానిక ప్రజా సమస్యల పరిష్కారం కోరుతూ సైకిల్ యాత్రను ప్రారంభించింది. ప్రజా చైతన్య సైకిల్ యాత్ర పేరుతో ఈ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్ సీపీఎం కార్యదర్శి వి శ్రీనివాసరావు కాకినాడలో దీనిని ప్రారంభించారు. కాకినాడ సుందరయ్య భవన్ నుంచి ప్రారంభించారు. సీపీఎం నేతలు హరిబాబు, కాకినాడ సీపీఎం కార్యదర్శి కరణం ప్రసాదరావు, ఎం రాజశేఖర్, క్రాంతి, వి రాజబాబు, రాజా తదితరులు ఈ యాత్రలో పాల్గొన్నారు. కాకినాడ రూరల్ తూరంగి మీదుగా తాళ్లరేవు మండలం చొల్లంగి, చొల్లంగిపేట, మట్లపాలెం ప్రాంతాల్లోని వెనుకబడిన తరగతులు, దళిత కాలనీల ప్రాంతాల్లో సీపీఎం నేతలు పర్యటించారు.
మార్చి 8 నుంచి మార్చి 17వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రజా చైతన్య యాత్రలు నిర్వహించనున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల హక్కుల కోసం ఈ యాత్రలు గళం విప్పనున్నాయి. ఈ యాత్రలో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం మార్చి 22 నుంచి మార్చి 28 వరకు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు చేపట్టనున్నారు. సమస్యల మీద అధికారులను కలిసి వినత పత్రాలను సమర్పించనున్నారు. అప్పటికీ స్థానిక సమస్యలు పరిష్కారం కాకపోతే ఏప్రిల్, మే నెలల్లో పోరాటాలకు రూపకల్పన చేయనున్నారు. ప్రజా చైతన్య యాత్రల్లో ప్రధానంగా కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై పోరాటం చేయనుంది. సూపర్ సిక్స్ పథకాల్లోని ఉచిత బస్సు పథకం, ఉగాది నాటికి యువతకు నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.1,500 అమలు చేసే విధంగా ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు.
Next Story

