ఆంధ్రాలో మళ్లీ కరోనా కలకలం
x

ఆంధ్రాలో మళ్లీ కరోనా కలకలం

విశాఖలో తొలి పాజిటివ్ కేసు నమోదు. ఈ సారి కోవిడ్ వైరస్ ముద్దు పేరు COVID-19 JN.1


ఆంధ్రప్రదేశ్ లో మళ్లీ కరోనా కలకలం బయలు దేరింది. విశాఖపట్నం, కడపలో గురువారం కోవిడ్ పాజిటివ్ కేసులు (Covid positive case) నమోదు అయ్యాయి. కాకినాడ జిల్లాలో కూడా కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయని ప్రైవేటు ఆస్పత్రి వర్గాలు తెలిపినా అధికారికంగా ధృవీకరించలేదు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. కరోనా నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

విశాఖపట్నం మద్దిలపాలెం, యూపీహెచ్‌సీ పిఠాపురం కాలనీకి చెందిన ఓ వివాహితకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. 28 సంవత్సరాల వయసున్న ఆమె జ్వరం, ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరింది. మొదట ఆమెకు సోకింది మలేరియా డెంగ్యూ అని భావించారు. వైద్య పరీక్షలు చేశాక అది కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసులు కేరళ, తమిళనాడులలో కనిపించాయి. అది ఇపుడు ఆంధ్రలో కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. ఇపుడు కోవిడ్ కలిగిస్తున్న వైరస్ ను JN.1 అని పిలుస్తున్నారు.

ఇపుడు ఆమె ఆరోగ్యం మెరుగుపడడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే హోం క్వారాంటైన్‌లో ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. అనంతర నాలుగు వైద్య ఆరోగ్య శాఖ బృందాలు పిఠాపురం కాలనీ పరిసర ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ఆమె భర్త ఇద్దరు పిల్లలకు అనుమానంతో ఆర్టీపీసీఆర్ (RTPCR) పరీక్షలు చేశారు. ఆమహిళకు తప్ప ఇంకెవరికి అటువంటి లక్షణాలు లేకపోవడంతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

కోవిడ్ పరిస్థితి

దేశంలో మే 12 నుంచి 19 మధ్య 164 కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసు లోడ్ కేవలం 257 మాత్రమే. ఇంతవరకు నమోదయిన కేసులలో ఎక్కువ భాగం కేరళ నుంచయి వచ్చాయి. గతం వారంలో అక్కడ 69 కేసులే వుండేవి. నేటికి అవి 95 కు పెరిగాయి. ఇక తమిళనాడు నుంచి 66 కేసులు, మ హారాష్ట్ర నుంచి 56 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో ఈ వారంలోనే 44 కేసులు నమోదయ్యాయి. అయితే, ఈ కేసులు పెరుగుతున్నా ఇందులో ఆందోళనే చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.

JN.1 వైరస్ ఎక్కడ నుంచి వచ్చింది

కోవిడ్-19 కొత్త వేవ్ ఆసియా అంతటా మెల్లిగా వ్యాపిస్తోంది, సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్‌లలో ఈ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి. భారతదేశంలో కూడా 257 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు గత కొన్ని వారాలుగా యాక్టివ్ కేసులు పెరుగడాన్ని గుర్తించారు.

ఈ వేవ్ కోవిడ్-19 కేసుల పెరుగుదలకు JN.1 వేరియంట్ తో పాటు దాని వారసులు, LF.7, NB.1.8 కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇవన్నీ ఓమిక్రాన్ (Omicron) వంశానికి చెందినవే. "ప్రస్తుతం, ఓమిక్రాన్ ఉప రూపమైన JN.1 వల్ల కేసుల పెరుగుదల కనిపిస్తున్నది. జ్వరం, జలుబు, దగ్గు ఉంటుంది. వాసన లేదా రుచి కోల్పోవడం వంటి లక్షణాలు తీవ్రంగా ఉండకపోయినా ఉన్నప్పటికీ, ఇది చాలా అంటువ్యాధే" అని మాక్స్ హెల్త్‌కేర్‌లోని పల్మనాలజీ, పీడియాట్రిక్ పల్మనాలజీ డైరెక్టర్ & HOD డాక్టర్ శరద్ జోషి ఎన్డీటివితో అన్నారు.

అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) అందిస్తున్న సమాచారం ప్రకారం, JN.1 వేరియంట్ మొదటిసారిగా USలో సెప్టెంబర్ 2023లో కనిపించింది. ఇది BA.2.86 వేరియంట్ ( ఇది కూడా ఓమిక్రాన్ సబ్‌వేరియంటే)నుంచే వచ్చింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) JN.1 జాతిని "ఆసక్తికరమైన వేరియంట్" (Variant of Interest) గా వర్గీకరించింది కానీ ఇంకా "ఆందోళనకరమైన వేరియంట్" అని అనలేదు. అయితే, గుట్టుచప్పుడు కాకుండా చాలా వేగంగా వ్యాపించే స్వభావం దీనికి ఉంది. అందుకే స్టెల్త్ వేరియాంట్ ( stealth variant) అని కూడా పిలుస్తారు.

JN.1 జాతి లక్షణాలు ఏమిటి?

జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం, తలనొప్పి ,కండరాల బలహీనత ఈ వేరియంట్ కొన్ని సాధారణ లక్షణాలు. అయితే, అదనంగా JN.1 జీర్ణశయాంతర సమస్యలను కూడా కలిగిస్తుంది. విరేచనాలు, ఆకలి లేకపోవడం, నిరంతర వికారం మరియు తీవ్ర అలసట JN.1 కలిగించే మరి కొన్ని ప్రత్యేక లక్షణాలు. ప్రార్థన సమావేశాలు, సామాజిక సమావేశాలు, పార్టీలు, ఇతర కార్యక్రమాలు వాయిదా వేసుకోవాలని వైద్య శాఖ సూచించింది. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల్లో కోవిడ్ నిబంధనలు పాటించాలని, ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా వాడాలని, జ్వరం లేదా చలి, దగ్గు, అలసట, గొంతునొప్పి, రుచి లేదా వాసన కోల్పోవడం, తలనొప్పి, కండరాలు లేదా శరీర నొప్పులు, ముక్కు కావడం లేదా ముక్కుదిబ్బడ, వికారం, వాంతులు, విరోచనాలు ఉంటే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని సలహా ఇచ్చింది.

- ఆరోగ్యశాఖకు చెందిన 24 గంటలు పని చేసే ల్యాబ్‌ల్లో మాస్కులు, పీపీఈ కిట్ త్రిబుల్ లేయర్ మాస్కులను తగిన పరిణామంలో ఉంచుకోవాలి.


Read More
Next Story