
ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ కు మంత్రి మండలి ఆమోదం
ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలుకు సాంఘిక సంక్షేమ శాఖ రూపొందించిన ముసాయిదాను రాష్ట్ర మంత్రి మండలి మంగళవారం ఆమోదించింది. నేటి నుంచి ఆర్డినెన్స్ అమలు కానుంది.
సమాజంలో వివిధ ఉప కులాల మధ్య ఏకీకృత, సమానమైన పురోగతి కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల మధ్య ఉప-వర్గీకరణను అమలు చేయటానికి సాంఘిక సంక్షేమ శాఖ చేసిన ముసాయిదా ఆర్డినెన్స్ ప్రతిపాదనకు రాష్ట్ర మండలి ఆమోదించింది. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రంలోని 59 షెడ్యూల్డ్ కులాలను జనాభా, వెనుకబాటుతనం, సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించారు. ఈ మూడు కేటగిరీలకు రిజర్వేషన్ల శాతం ఈ విధంగా ఉంది.
గ్రూప్-I (12 కులాలు): 1శాతం రిజర్వేషన్
బవురి, చచాటి, చండాల, దండాసి, డొమ్, ఘాసి, గొడగలి, మెహతర్, పాకి, పామిడి, రెల్లి, సాప్రు కులాలు ఉన్నాయి.
గ్రూప్-II (18 కులాలు): 6.5 శాతం రిజర్వేషన్
అరుంధతీయ, బిందల, చమార్, చంభార్, దక్కల్, ధోర్, గొదారి, గోసంగి, జగ్గాలి, జంబువులు, కొలుపులవండ్లు, మాదిగ, మాదిగ దాసు, మాంగ్, మాంగ్ గరోడి, మాతంగి, సమగార, సింధోలు కులాలు ఉన్నాయి.
గ్రూప్-III (29 కులాలు): 7.5శాతం రిజర్వేషన్
ఆది ద్రావిడ, అనముక్, అరయ మాల, అర్వ మాల, బారికి, బ్యాగర, చలవాది, ఎల్లమలవార్, హోలేయ, హోలేయ దాసరి, మదాసి కురువ, మహర్, మాల, మాల దాసరి, మాల దాసు, మాల హన్నాయి, మాలజంగం, మాల మస్తి, మాల సాలె, మాల సన్యాసి, మన్నే, ముండల, సంబన్, యాతల, వల్లువన్, ఆది ఆంధ్ర, మస్తి, మిట్టా అయ్యలవార్, పంచమ కులాలు ఉన్నాయి.
ఈ ఉప వర్గీకరణ కోసం 200 పాయింట్ల రోస్టర్ వ్యవస్థను అనుసరించడం జరుగుతుంది. ఇది రెండు సైకిల్స్ లో(ఒక్కొక్కటి 1-100 వరకు) పనిచేస్తుంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని షెడ్యూల్డ్ కులాల వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో సమాన, న్యాయమైన ప్రవేశం లభిస్తుందని, దీని ద్వారా రాజ్యాంగ లక్ష్యాలను సాధించి సామూహిక అభివృద్ధిని నిర్ధారించగలమని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆర్డినెన్స్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లో నేటి నుంచి అమల్లోకి వస్తుంది.
క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జల వనరులు, సాంఘిక సంక్షేమం, హోం, పర్యాటక శాఖల మంత్రులు డాక్టర్ నిమ్మల రామానాయుడు, డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, కందుల దుర్గేశ్ లు వివరించారు.