పవన్‌ కల్యాణ్‌ వల్ల జేఈఈ మెయిన్స్‌ రాయలేక పోయారు
x

పవన్‌ కల్యాణ్‌ వల్ల జేఈఈ మెయిన్స్‌ రాయలేక పోయారు

ఓ చిన్న కారణం వల్ల విద్యార్థులు పరీక్షలు రాయలేక పోయారు. యంత్రాంగం స్పందించి ఉంటే సమస్య తలెత్తేదే కాదు.


ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గిరిజన ప్రాంతాల పర్యటన జేఈఈ పరీక్షలు రాసే విద్యార్థులకు శాపంగా మారింది. పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ అడ్డుగా రావడంతో కొంత మంది విద్యార్థులు సోమవారం జేఈఈ మెయిన్స్‌ పరీక్షలు రాయలేక పోయారు. ప్రభుత్వ యంత్రాంగం చేసిన ఓ చిన్న తప్పు వల్ల విద్యార్థులు జేఈఈ పరీక్షలకు దూరం కావలసి వచ్చింది. దీంతో ఏడాదిగా జేఈఈ మెయిన్స్‌ పరీక్షల కోసం సిద్ధపడిన విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారింది. వారి తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిల్చింది. విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో సోమవారం చోటు చేసుకుంది.

పెందుర్తిలోని అయాన్‌ డిజిటల్‌ కేంద్రంలో జేఈఈ మెయిన్స్‌ పరీక్ష సోమవారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. ఎక్కడెక్కడ నుంచో ఈ పరీక్షను రాసేందుకు తరలి వచ్చారు. అయితే పవన్‌ కల్యాణ్‌ గిరిజన ప్రాంతాల పర్యటన సందర్భంగా ఇదే ప్రాంతంలో రోడ్డు మార్గం గుండా వెళ్లాని నిర్ణయించుకున్నారు. ముందుస్తుగా నిర్ణయమైన మేరకు ఇదే రోడ్డులో సరిగ్గా పరీక్ష ప్రారంభం అయ్యే సమయానికి పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ వెళ్లేందుకు మార్గం సరాళం చేశారు. భారీ బందోబస్తు చేపట్టారు. కట్టుదిట్టమైన పోలీసుల భద్రత మధ్యలో ఇదే రోడ్డు గుండా పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ ప్రయాణించింది. దీంతో కొద్ది సేపు పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపి వేశారు.
దీని వల్ల పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులకు ఆటంకం ఏర్పడింది. 8:30 గంటలకు వెళ్లాల్సిన విద్యార్థులు రెండు ఆలస్యంగా 8:32 నిముషాలకు పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. ఉప ముఖ్యమంత్రి వస్తున్నారనే కారణంతో పోలీసులు ట్రాఫిక్‌ను నిలిపి వేశారని, దీంతో పరీక్షా కేంద్రానికి రావడం రెండు నిముషాలు ఆలస్యమైందని, లేకుంటే సకాలంలోనే పరీక్షా కేంద్రానికి చేరుకునే వాళ్లమని, దయచేసి పరీక్ష రాసేందుకు అనుమతించాలని కోరినా అధికారులు ఆ విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించలేదు. ఇలా 30 మంది విద్యార్థులు పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ రావడం వల్ల జేఈఈ పరీక్షలను రాయలేక పోయారు. తమ తప్పు ఏమీ లేక పోయినా.. పవన్‌ కల్యాణ్‌ కాన్వాయ్‌ అటువైపుగా ప్రయాణించడంతో నిలిచిపోయిన ట్రాఫిక్‌ వల్ల తాము జేఈఈ పరీక్షలను రాయలేక పోయామని, అవకాశం కోల్పోయిన 30 మంది విద్యార్థుల కోసం మెయిన్స్‌ పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
జేఈఈ పరీక్షల్లో తమ పిల్లలు ఉత్తీర్ణత సాధిస్తారని, మంచి భవిష్యత్తు ఉంటుందని నెలల తరబడి కలలు కన్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర నిరాశే ఎదురైంది. ఈ సమస్యకు పరిష్కారం కనుచూపు మేరలో కూడా లేక పోవడంతో కన్నీరు దిగమింగుకుని తీవ్ర ఆవేదనతో కుంగిపోయారు. ఈ ప్రాంతంలో జేఈఈ పరీక్షలు జరుగుతున్నాయి. దీని కోసం ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ముందుగా ఏమాత్రం ఆలోచనలు చేసి ఉన్నా కూడా ఈ 30 మంది విద్యార్థులు జేఈఈ పరీక్షలను ప్రశాంతంగా రాసుకుని ఉండే వారు. కానీ ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ 30 మంది జేఈఈ మెయిన్స్‌ రాసే అవకాశాన్ని కోల్పోయారని అక్కడికి వచ్చిన వాళ్లు చర్చించుకోవడం గమనార్హం.
Read More
Next Story