విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి
x

విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి

పునః సమీక్ష జరపాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు


అధికార పార్టీలు గత దశాబ్ద కాలంగా ఆదానీ, షిర్డీ సాయి లాంటి ప్రైవేట్ కంపెనీలతో చేస్తున్న విద్యుత్ ఒప్పందాలపై పునః సమీక్ష జరిపి, అవినీతికి పాల్పడిన సంస్థలపై, అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపు నిచ్చారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీ గుంటూరులోని జనచైతన్య వేదిక హాలులో విద్యుత్ కుంభకోణాలు - వినియోగదారుల పై భారాలు అనే అంశంపై జరిగిన చర్చా గోష్టికి ప్రధాన వక్తగా హాజరై సిహెచ్ బాబురావు ప్రసంగించారు. చర్చా గోష్టికి జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి అధ్యక్షత వహించారు.

సిహెచ్ బాబురావు ప్రసంగిస్తూ ఆదానీ చేసుకున్న సేకీ ఒప్పందం రాబోయే 25 సంవత్సరాలలో రాష్ట్ర ప్రజలపై లక్ష 20 వేల కోట్ల పెను భారం మోపుతుందని, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ చేపట్టిన ఒప్పందాల ద్వారా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయ్యిందని, నేడు ఈ అవకతవకల పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించక పోవడం దురదృష్టకరమన్నారు. పౌర సమాజం స్పందించి, పెద్ద ఎత్తున ఉద్యమించి, లోప భూయిష్టమైన విద్యుత్ ఒప్పందాలను ఉప సంహరించుకునేటట్లు కృషి జరగాలన్నారు. సౌర విద్యుత్ పేరుతో ఇండోసోల్ కంపెనీకి దాదాపు 8500 ఎకరాల పంట భూములను ప్రత్యేకంగా అత్యున్నతమైన మామిడి పండ్లు కాచే కరేడు, ఉలవపాడు ప్రాంతాల నుండి భూమిని సేకరించడం ప్రమాదకరమన్నారు.

రైతులు సంఘటితమై భూ సేకరణను తిరస్కరించాలన్నారు. రైతుల పోరాట ఫలితంగా వ్యవసాయ రంగంలో మోటార్లకు స్మార్ట్ మీటర్ల బిగింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసుకుందని, నేడు ప్రతి ఇంటికి ఆదానీ మనుషులు స్మార్ట్ మీటర్లు బిగించాలని ప్రయత్నిస్తున్నారని, దీనిని ప్రతిఘటించాలని కోరారు. ఆదానీ, మోడీ, జగన్ మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఏకమై విద్యుత్ రంగంలో దోపిడీని కొనసాగిస్తున్నారని, ఈ ఒక్క సంవత్సరం దాదాపు 16 వేల కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ వినియోగ దారులపై మోపినారన్నారు. విద్యుత్ భారం భరించలేక ఒక్క గుంటూరు జిల్లాలోనే సగం స్పిన్నింగ్ మిల్లులు మూతబడ్డాయన్నారు. విద్యుత్ రంగం మొత్తాన్ని ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేస్తూ అత్యధిక లాభాలను గడిస్తున్నారని, విద్యుత్ వినియోగదారులపై భారాన్ని మోపుతున్నారని తెలిపారు.

నాడు పంపు సెట్లకు బిగించ తలపెట్టిన స్మార్ట్ మీటర్లను పగల గొట్టాలని పిలుపునిచ్చిన తెలుగుదేశం నేతలు నేడు గృహాలకు స్మార్ట్ మీటర్లు బిగించాలని పూనుకోవడం మోసపూరితమన్నారు. నాడు షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ జగన్మోహన్ రెడ్డి బినామీ సంస్థ అంటూ ప్రచారం చేసి హైకోర్టు లో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేసిన తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు నేడు ఆ సంస్థతోనే విద్యుత్ ఒప్పందాలు చేసుకోవడం వారి ద్వంద్వ నీతిని బహిరంగ పరుస్తుందన్నారు. ఇప్పటికే వాణిజ్య, వ్యాపార సముదాయాల్లో బిగించిన లక్షలాది స్మార్ట్ మీటర్లు అధిక బిల్లులతో వ్యాపారస్తుల నడ్డి విరుస్తున్నాయని పేర్కొంటూ రాష్ట్రవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను ఏ ఇంటికి బిగించకుండా తిరస్కరించే విధంగా పౌర సమాజం ఉద్యమించాలని కోరారు. జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రసంగిస్తూ అవినీతిని నిర్మూలిస్తానని నిరంతరం పేర్కొంటున్న నారా చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడుతున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లాంటి విద్యుత్ సంస్థ లను ప్రోత్సహించడం తగదన్నారు.

తెలుగుదేశం పార్టీ నేతలు హైకోర్టులో వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం ను ముందుకు తీసుకువెళ్లి న్యాయపోరాటం చేయాలన్నారు. దీనిపై కేసు దాఖలు చేసిన పయ్యావుల కేశవ్, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మౌనం వీడి కోట్లాది వినియోగదారులకు సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక విశ్లేషకులు టి. ధనుంజయ రెడ్డి, రేట్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఓరుగంటి నారాయణరెడ్డి, విశ్రాంత అడిషనల్ ఎస్పీ చలపతిరావు, దళిత బహుజన ఫ్రంట్ వ్యవస్థాపకులు కొరివి వినయ్ కుమార్, సిపిఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, చావా శివాజీ తదితరులు పాల్గొని ప్రసంగించారు.

Read More
Next Story