ఋషికొండ కట్టడాలను రాష్ట్ర మ్యూజియంగా మార్చండి
x

ఋషికొండ కట్టడాలను రాష్ట్ర మ్యూజియంగా మార్చండి

ఋషికొండపై నిర్మించిన భవనాలను రాష్ట్ర మ్యూజియంగా మార్చాలని ప్రొఫెసర్‌ కెఎస్‌ చలం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును సోమవారం లేఖ ద్వారా కోరారు.


గౌరవనీయ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి గారికి...

అమరావతిలో మీరు ఒక ప్రభుత్వ కార్య క్రమంలో దక్షిణాది రాష్ట్రాల జనాభా గూర్చి మాట్లాడుతూ ఆంధ్రులు తమ జనాభా సంఖ్యను పెంచుకోవాలని చెప్పటం ఒక దార్శినికునికి వున్న ముందు చూపును సూచిస్తుంది. ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా, ఒక పరిశోధకునిగా ఈ విషయమై ఎప్పుడో నేను లేఖ రాశాను. కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఫైనాన్స్‌ కమిషన్‌ కేటాయింపుల్లో మనం జనాభా ప్రాతిపాదికన నష్ట పోతామని మీరు గ్రహించి చర్యలు తీసుకోవటం తమకు ఆనందం కలుగ జేసింది.
ఇదే సందర్భంలో మన తెలుగు జాతి చరిత్ర సంస్కృతిపై కూడా దృష్టి పెట్టగలరని భావిస్తూ మీ అవగాహన కొరకు ఈ విషయం మీ దృష్టికి తీసుకొస్తున్నాను. తెలుగు జాతి చరిత్రలో విశాఖపట్నంకు, ముఖ్యంగా నాటి త్రికలింగలో భాగ మయిన మద్రాసు రాష్ట్రంలోని విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలు (గంజాం) తెలుగు వారికి గొప్ప ఆభరణాలు. ఈ ప్రాంత చరిత్రలో కీపూ బౌద్ధ, జైన మతాలు అమరావతి కంటే ముందు నుంచి వున్నాయి. ముఖ్యంగా విశాఖలోని బావికొండ, తోట్ల కొండ, పావురాళ్ళ కొండతో పాటు పవిత్ర మయిన ఋషి కొండ వుంది. ఋషి కొండను ఉత్తరాంధ్ర ప్రజలు ముఖ్యంగా విశాఖ వాసులు చాలా భక్తి గౌరవాలతో చూస్తారు.
బహుశా అక్కడ బౌద్ధ, జైన ఋషులకు అది ఆలవాలమై ఉంటుంది. అందుకే మాకు అదంటే సెంటిమెంట్‌. దానిని మీరు గౌరవిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో అక్కడ టూరిజమ్‌ వారి బిల్డింగ్‌లను మార్చి నూతన కట్టడాలు వచ్చాయి. వాటిని ప్రజల పరం చేసి తెలుగు జాతి గొప్పతనాన్ని ఇనుమడించే లాగా, కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు గుర్తించే విధంగా చేయాలని విన్నవిస్తున్నాను. అందుకు గాను ఆ కట్టడాలను మన రాష్ట్ర మ్యూజియంగా వినియోగించాలి. విశాఖలో వున్న ప్రస్తుత చిన్న మ్యూజియం నేవీకి చెందినది, మనకు రాష్ట్ర మ్యూజియం లేదు, రాష్ట్రం విడిపోయిన తరువాత ఏపీకి రావలసిన శిల్ప కళా ఖండాలు, విశాఖలో దొరికిన బుద్ధుని అవశేషాలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వాటిని ఇక్కడకు తీసుకు రావలసి ఉంది. ఈ వివరాలతో ఒక పరిశోధకుని వ్యాసం కూడా జత చేస్తున్నాను.
ఇది అంతర్జాతీయంగా జపాన్, వియత్నాం, చైనా థాయిలాండ్‌ , శ్రీలంక వంటి దేశాలకు దర్శనీయ స్థలం అవుతుంది. ఇప్పుడు పాట్నాలో వున్న బుద్ధుని అవశేషాలు దర్శించటానికి వెళుతున్న పర్యాటకులు విశాఖ వస్తారు. మ్యూజియంకు సరిపడా గదులు అక్కడ వున్నాయి. నిజానికి ఇది ఈస్ట్‌ కోస్ట్‌ లేక తూర్పు తీర మ్యూజియంగా కూడా ప్రకటించి కేంద్ర ప్రభుత్వం దీనికి నిధులు ఇచ్చేలా చేయాలి. మన తెలుగు ప్రజలే గతంలో తూర్పు తీరం అంతా వుండే వారు. ఇప్పుడు కూడా పూరీ నుంచి రామేశ్వరం వరకు మత్స్య కారులు తెలుగు మాట్లాడతారు. ఆ విధంగా తెలుగుదేశం ప్రభుత్వం తెలుగు జాతికి ఒక మ్యూజియం ఏర్పాటు చేసి నట్లు అవుతుంది. మిగతా గదులు వుంటే అంతర్జాతీయ సెమినార్లు, పరిశోధకులకు కావలసిన సౌకర్యాలు కల్పించి దానిని ప్రభుత్వ – ప్రజల ఉన్నత స్తాయి సంస్థ గా రూపొందించాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

ప్రొఫెసర్ కెఎస్ చలం

గౌరవాధ్యక్షులు,

ఉత్తరాంధ్ర అధ్యయన వేదిక,

4-53-1, LB Colony

Email: chalamks@hotmail.com

Mob: 7702200026

విశాఖపట్నం. ఎపి.


Read More
Next Story