నామినేటెడ్ పదవులపై వివాదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారిపై వివాదం ముదురుతోంది. తాము రాజీనామాలు చేచేసి లేదని, అవసరమైతే కోర్టుకు వెళతామని అంటున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ద్వారా నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన వారిపై ప్రభుత్వం కొరఢా ఝుళిపించింది. ఇప్పటి వరకు ఇంకా ఎవరైతే నామినేటెడ్ పోస్టుల్లో ఉండి రాజీనామా చేయకుండా కొనసాగుతున్నారో అటువంటి వారందరినీ రాజీనామాలు చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్ శుక్రవారం అన్ని శాఖల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో ఇప్పటికే చాలా మంది వైఎస్సార్‌సీపీ హయాంలో నియమితులైన వారు ఉన్నారు. ప్రధానంగా ప్రతి శాఖలోనూ సలహాదారులుగా నియమితులైన వారు సుమారు 40 మంది వరకు ఉన్నట్లు సమాచారం.
బీసీల కోసం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్‌లలో ఒక్కో కార్పొరేషన్‌కు చైర్మన్‌తో పాటు 14 మంది సభ్యులు ఉన్నారు. వీరు సుమారు 784 మంది ఉన్నారు. సలహా దారుల్లో కొందరు రాజీనామా చేయగా మరికొందరు ఉన్నారు. అలాగే బీసీ ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లలో ఉన్న వారు ఇంకా రాజీనామాలు చేయలేదు. ఎపిఐఐసీ చైర్మన్‌గా ఉన్న జంకె వెంకటరెడ్డి కూడా రాజీనామా చేసినట్లు సమాచారం.
మేమెందుకు రాజీనామా చేయాలి
మాకు మూడు సంవత్సరాల కాలానికి కార్పొరేషన్‌లలో చైర్మన్‌లు, సభ్యుల నియామకాలు జరిగాయి. మాకు ఇచ్చిన సమయం వరకు మేము నామినేటెడ్ పోస్టుల్లోనే ఉంటామని అధికారులకు వివిధ కార్పొరేషన్ చైర్మన్‌లు, సభ్యులు సమాధానం ఇచ్చినట్లు సమాచారం. నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వారందరినీ వెంటనే రాజీనామాలు చేయించాలని కార్యదర్శులకు ఆదేశాలు ఇచ్చి నాలుగు రోజులైంది. అయినా ఎవరిలోనూ ఎటువంటి కదలిక లేదు. నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన వారందరూ కోర్టును ఆశ్రయించాలనే నిర్ణయానికి వచ్చారు. ఎస్సీల్లో కూడా మూడు కార్పొరేషన్‌లు ఏర్పాటు చేశారు. ముగ్గురు చైర్మన్‌లు, ఒక్కో కార్పొరేషన్‌కు 14 మంది సభ్యులు ఉన్నారు. మాదిగ, మాల, రెల్లి కార్పొరేషన్‌లు ఈ కార్పొరేషన్‌లలో 45 మంది నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారు. ఇక బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్‌లు ఉన్నాయి. ఇందులో 30 మంది వరకు నామినేటెడ్ సభ్యులు ఉన్నారు. కేవలం బిసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌లో మొత్తం 843 మంది నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారు.
Next Story