
ఈ పోలీసు ఎందరికో ఆదర్శం..
కానిస్టేబుల్ శ్రమదానం.. రోడ్డుపై తప్పిన గుంతల పయనం
మనం వెళుతున్న రోడ్డు గుంతలు, గుంతలుగా ఉండి నడవడానికో, బండి నడపడానికో చికాకు పెడుతుంటే ఏం చేస్తాం.. గుంతల్ని తప్పించి పక్కకు పోతాం లేదంటే ప్రభుత్వాన్నో, స్థానిక మంత్రో, ఎమ్మెల్యేనో తిట్టుకుంటూ ముందుకు సాగుతాం.. ఇంకా బాగా ఆలోచిస్తే.. ఇక్కడ గుంత ఉందని ఓ రాయోరప్పో పెడతాం, ఆ వైపు పోవద్దంటూ ఓ చెట్టుకొమ్మను అక్కడ పెట్టి పోతాం. కానీ ఈ కానిస్టేబుల్ ఏం చేశాడో చూడండి.. ఏమాత్రం భేషజానికి పోకుండా పలుగు పారా తెచ్చి మట్టి తొవ్వి తట్టతో మట్టి పోసి గుంతలు పూడ్చి పదుగురికి ఆదర్శంగా నిలిచారు.
ఆయన పేరే రవి కిరణ్. ఎన్టీఆర్ జిల్లాలోని ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్. హైవే మొబైల్ వెహికల్ కానిస్టేబుల్. ఆయన ఈ మధ్య పెట్రోలింగ్ లో ఉన్నప్పుడు విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై నందిగామ వై జంక్షన్ వద్ద వాహనాలు నెమ్మదిగా పోవడం గమనించాడు. విషయమేమిట్రో అని స్వయంగా పరిశీలించారు. ఇటీవలి వర్షాలకు రోడ్డుపై గుంతలు పడడంతో వాహనాలు నెమ్మదిగా పోతూ ట్రాఫిక్ కి అంతరాయం కలుగుతుందని గమనించారు.
ఇక అంతే.. తన వాహనాన్ని పక్కన ఆపి పలుగు, పారా చేపట్టాడు ఒక్కడే. స్వయంగా మట్టితవ్వి గుంతల్లో వేసి పూడ్చారు. పూర్తిగా కాకపోయినా తాత్కాలిక ఉపశమనం కలిగింది. రోడ్డు గుంతలు పూడాయి. వాహనాలు రాకపోకలకు కొంత ఇబ్బంది తప్పింది. కానిస్టేబుల్ చొరవను వాహనదారులు, ప్రయాణికులు అభినందించారు.
ఇప్పుడా వీడియో వైరల్ కావడంతో పోలీసు బాసులు ఆయన్ను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పోలీసులంటే బెదిరింపులు, అవినీతి, లంచాలు మాత్రమే గుర్తుకువచ్చే మనకు రవి కిరణ్ లాంటి ఆదర్శప్రాయులు కూడా ఉంటారని తెలుస్తుంది.
Next Story