
బండ్లపల్లి వేదికగా 2006 ఫిబ్రవరి 2న ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిన నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నాటి సీఎం వై.ఎస్. రాజశేఖర రెడ్డి
బండ్లపల్లి నుంచే కాంగ్రెస్ ‘ఉపాధి’ పోరు
జాతీయ ఉపాధి హామీ పథకం పై మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ జనవరి 5 నుంచి దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ సమరశంఖం పూరించింది. 2026 జనవరి 5 నుంచి దేశవ్యాప్తంగా నిర్వహించనున్న నిరసన కార్యక్రమాలను, ఈ పథకానికి పురుడుపోసిన ఉమ్మడి అనంతపురం జిల్లా బండ్లపల్లి నుంచే ప్రారంభించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది.
చారిత్రక నేపథ్యం
2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డిలు అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి వేదికగానే ఈ చారిత్రాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలోని కోట్లాది మంది గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పిస్తూ, ఆకలి కేకలను అరికట్టడంలో ఈ పథకం కీలక పాత్ర పోషించింది.
ఆందోళనకు ప్రధాన కారణాలు
పథకం రద్దుపై వ్యతిరేకత: కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోందని, నిధుల కేటాయింపులో కోత విధిస్తూ పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
పేరు మార్పుపై అభ్యంతరం: ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ పథకం పేరును మార్చడాన్ని కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తోంది. ఇది గాంధీజీ స్ఫూర్తిని, పథకం యొక్క అసలు ఉద్దేశాన్ని దెబ్బతీయడమేనని నేతలు వాదిస్తున్నారు.
కొత్త చట్టం - VB-G RAM G Act, 2025: కేంద్ర ప్రభుత్వం MGNREGA స్థానంలో ’వికసిత్ భారత్ – గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్) చట్టం-2025'ను తీసుకువచ్చింది. ఈ బిల్లుకు డిసెంబరు 2025లో రాష్ట్రపతి ఆమోదం లభించింది.
పేరు మార్పు వివాదం: ఈ కొత్త చట్టం ద్వారా పథకం పేరు నుంచి 'మహాత్మా గాంధీ' పేరును తొలగించడంపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తొలుత 'పూజ్య బాపు గ్రామీణ రోజ్‌గార్ యోజన'గా మారుస్తారని వార్తలు వచ్చినా, చివరకు VB-G RAM G అనే పేరును ఖరారు చేశారు.
నిధుల కేటాయింపులో మార్పు: గతంలో ఈ పథకం నిధుల్లో కేంద్రం వాటా అత్యధికంగా (సుమారు 90:10 నిష్పత్తిలో) ఉండేది. ఇప్పుడు కేంద్ర, రాష్ట్రాల నిధుల వాటాను 60:40 నిష్పత్తికి మార్చారు. దీనివల్ల రాష్ట్రాలపై అదనపు ఆర్థిక భారం పడుతుందని విమర్శలు వస్తున్నాయి.
సమరశంఖం - బండ్లపల్లి నుంచే
"ఉపాధి హామీ పథకం పేదల ప్రాణవాయువు వంటిది. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. ఎక్కడైతే ఈ పథకం మొదలైందో, అక్కడి నుంచే మోదీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం మొదలుపెడతాం" అని కాంగ్రెస్ ముఖ్య నేతలు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు ఢిల్లీలో మాట్లాడుతూ జాతీయ ఉపాధి హామీ పథకానికి, ఉమ్మడి అనంపురం జిల్లా బండ్లపల్లికి అనుబంధం ఉందని, ఈ పథకాన్ని బండ్లపల్లి నుంచే నాడు ప్రారంభించారని పేర్కొన్నారు. అందువల్ల బండ్లపల్లి నుంచే ఈ ఉద్యమాన్ని ప్రారంభించాలని తాము భావిస్తున్నట్లు వెల్లడించారు. ఆ మేరకు కాంగ్రెస్ అగ్ర నాయకులు మల్లికార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతో పాటు ఇతర కాంగ్రెస్ ప్రముఖులను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకులు రఘువీరారెడ్డి, గిడుకు రుద్రరాజులు ఆహ్వానించారు. జనవరి 5న బండ్లపల్లిలో భారీ బహిరంగ సభ లేదా నిరసన ప్రదర్శన ద్వారా దేశవ్యాప్త ఉద్యమానికి పునాది వేయాలని పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ పోరాటంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉపాధి కూలీలను, గ్రామీణ ప్రజలను భాగస్వాములను చేయాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది.
Next Story

