ఎవరికి భస్మాసుర  హస్తం అవుతుందో!?
x

ఎవరికి భస్మాసుర " హస్తం" అవుతుందో!?

అధికార, కూటమి అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ మేకులా మారింది. ఆ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల ఆశలు తలకిందులయ్యే అవకాశం లేకపోలేదు.


(ఎస్.ఎస్.వి భాస్కర్ రావ్)

తిరుపతి: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికలు విభిన్నంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల వల్ల అధికార, విపక్ష పార్టీ అభ్యర్థుల అంచనాలు తలకిందులయ్యే పరిస్థితి లేకపోలేదు అనే వాతావరణం కనిపిస్తోంది. అందులో ప్రధానంగా వైయస్సార్సీపి నుంచి టికెట్ దక్కక కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకపక్క. ముస్లిం మైనార్టీలు అధికంగా ఉన్నచోట మరో రకమైన పరిస్థితి ఏర్పడింది. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వల్ల పోలింగ్ తర్వాత ఎవరి పుట్టి మునుగుతుందో అనే ఆందోళన అయితే కనిపిస్తోంది.

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ, సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి దూరంగా ఉంటున్న ఆమె చెల్లెలు వైయస్ షర్మిల రెడ్డి.. కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఏఐసీసీ అధిష్టానం కూడా ఆమెకు ఏపీసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఈ నిర్ణయంతో పూర్తిగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేశారని విషయం చెప్పకనే చెబుతుంది.

ఏపీసిసి అధ్యక్ష బాధ్యత చేపట్టిన షర్మిల రెడ్డి కూడా... స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడంతో సహా సీనియర్లందరినీ ఒక తాటి పైకి తీసుకురావడంలో సఫలమయ్యారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి తరహాలోనే ఆమె కలుపుగోలుతనం ఉందనే భావన సర్వత్రా వ్యక్తం అయింది. అనుకున్న సమయం రానే వచ్చింది. ఎన్నికల నగారా మోగిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేయడంలో కూడా తీవ్రంగా కృషి చేసిన వైఎస్ షర్మిల రెడ్డి వామపక్షాలను కలుపుకొని వారి సలహాలు, సూచనలు మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఇదే సమయంలో..

కలిసి వచ్చిన సమీకరణలు

అభ్యర్థుల ఎంపికలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ముందంజలో ఉందని చెప్పక తప్పదు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనకున్న సమాచారంతోపాటు అభ్యర్థులను ఎంపిక చేయడంలో జిల్లా నాయకత్వాలు సూచించిన పేర్లను పరిగణలోకి తీసుకున్నారు. ఆ క్రమంలో రాయలసీమ జిల్లాల్లో ప్రధానంగా.. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో పనితీరు బాగాలేదంటూ కొన్నిచోట్ల మినహా, అభ్యర్థులను మార్చేశారు. ఈ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీకి అనుకోని విధంగా అందొచ్చింది. టికెట్ దక్కని అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిని అభ్యర్థులుగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డి అధిష్టానం అనుమతితో నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారం చాలా నియోజకవర్గాల్లో అధికార వైఎస్ఆర్సిపికి బాకులా గుచ్చుకుంటూ ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల వల్ల వైఎస్ఆర్‌సీపీకి నష్టం జరుగుతుందా? టీడీపీ, జనసేన అభ్యర్థులు బిజెపి వెంట ఉన్న నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయాల వల్ల ఎలాంటి ప్రభావం చూపబోతుందో అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. మచ్చుక్కు కొన్ని కీలక నియోజకవర్గాలను పరిశీలిద్దాం.

కడపలో గండి పడేది ఎవరికి?

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప. ఆయన, ఆయన సోదరి వైయస్ షర్మిల రెడ్డి ఉప్పూ నిప్పుల మారారు. కడప శాసనసభ స్థానం నుంచి వైఎస్ఆర్‌సీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పోటీ చేస్తున్నారు. ఈయనపై ఇప్పటికే అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవి కాస్త టిడిపి అభ్యర్థి ఆర్ మాధవి రెడ్డికి అనుకూలించే పరిస్థితిపై కూడికలు తీసివేతలు వేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం మైనార్టీలు, బలిజ, క్రిస్టియన్, రెడ్డి సామాజిక వర్గంతో పాటు దళితులు ఉన్నారు.

కేంద్ర ప్రభుత్వం.. ముస్లింలు వ్యతిరేకించే చట్టాలు తీసుకొస్తున్న నేపథ్యంలో.. ఈ వర్గాల ఓటర్లు తమకు అండగా నిలుస్తారని వైఎస్ఆర్సిపి భావిస్తూ వచ్చింది. అనూహ్యంగా రాష్ట్రంలో పీసీసీ పగ్గాలు చేపట్టిన వైఎస్ షర్మిల రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అఫ్జల్ ఖాన్‌ను బరిలోకి దించారు. కడప అసెంబ్లీ స్థానం పరిధిలో 2,65,154 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 90 వేల పైచిలుకు ఓటర్లు ముస్లిం మైనారిటీలే. వైయస్ఆర్సీపీ అభ్యర్థి పై అపవాదులు తనకు అనుకూలిస్తాయని భావిస్తున్న టిడిపి అభ్యర్థికి కూడా అంతర్గత పోరాటం ఉన్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో రెండు పార్టీల నుంచి విభేదించే మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిపితే ఎవరికి నష్టం జరుగుతుందనేది ప్రస్తుతం చర్చ సాగుతోంది. ఇదే నేపథ్యంలో...

రాయ " చోటు" ఎవరికి

కడప జిల్లాలోని మరో నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి సిట్టింగ్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు. టికెట్ దక్కక సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ రెడ్డి సైకిల్ దిగి వైఎస్ఆర్సిపిలో చేరడం అధికార పార్టీకి కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. పార్టీలో చేరడానికి ముందే హామీ తీసుకున్నారు కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు, ప్రస్తుతం టిడిపి అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు. రాయచోటి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీల తర్వాత బలిజ, బీసీలు వడ్డెరలు, దళితులు ఎక్కువగా ఉంటారు. ప్రధానంగా ఈ నియోజకవర్గం మొత్తం ఓటర్లలో లక్ష వరకు ముస్లిం మైనార్టీ ఓటర్లే ఉన్నారు.

వీరిద్దరికీ బల్లెంలా మారుస్తూ కాంగ్రెస్ పార్టీ రాయచోటిలో అల్లాబక్ష్‌ను బరిలోకి దింపింది. మైనారిటీలు ఎక్కువ ఉన్నచోట్ల ఆ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులని కాంగ్రెస్ పార్టీ ఏరి కోరి పోటీలకు దించడం వ్యూహాత్మక ఎత్తుగడగా భావిస్తున్నారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేస్తామంటున్న చట్టాల నేపథ్యంలో రాయలసీమ జిల్లాల్లోని అన్ని మసీదుల్లో ప్రార్థనల అనంతరం ప్రత్యేక సంభాషణలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముస్లింలు తీసుకునే నిర్ణయం ద్వారా కాంగ్రెస్ పార్టీ వైపు ఓటు బ్యాంకు మళ్లితే తమ పరిస్థితి ఏంటి అనేది కూడా అధికార వైఎస్ఆర్సిపి, టిడిపి ఆందోళన పెడుతున్నాయి. రాయచోటి చరిత్రలో ఒకేసారి 1972లో ఎస్. హబీబుల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత మొత్తం రెడ్డి సామాజికవర్గ పెత్తనమే సాగుతోంది.

ఇదిలా ఉండగా..

ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల దడ పట్టుకుంది. వైయస్ఆర్సీపీ నుంచి బిఎస్ మగుల్ బాషా పోటీ చేస్తుండగా, టిడిపి నుంచి కందికుంట వెంకటప్రసాద్ బరిలో ఉన్నారు. వైయస్ఆర్సీపీ టికెట్ ఆశించి బంగపడిన మాజీ ఎమ్మెల్యే చాంద్ బాషా టిడిపిలోకి వెళ్లారు. ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె ఎస్. షానవాజ్‌ను రంగంలోకి దించారు. కదిరి నియోజకవర్గంలో 2,39,687 ఓటర్లలో దాదాపు 60 వేల మంది ముస్లిం మైనార్టీ ఓటర్లు ఉన్నారు. వైఎస్ఆర్సిపి అభ్యర్థి ముస్లిం మైనారిటీ కావడం, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న షానవాజ్ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం వల్ల ఓట్ల చీలికకు ఆస్కారం లేకపోలేదనే భావన వ్యక్తం అవుతోంది.

పూతలపట్టులో

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వు నియోజకవర్గంలో ఇద్దరు డాక్టర్లు పోటీ పడుతున్నారు. వారిలో వైఎస్ఆర్సిపి నుంచి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పి సునీల్ కుమార్, సీనియర్ జర్నలిస్టు మురళీమోహన్ టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. వైయస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టికెట్ నిరాకరించారు. మొదట ఆయన తిరుగుబాటు చేసినా కొన్ని రోజుల తర్వాత శాంతించారు. అనుకోకుండా పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల రెడ్డిని కలవడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెస్ బాబు పూతలపట్టు నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారు.

ఈ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2024 లో జరుగుతున్న 4వ ఎన్నిక ఇది. 2,15,183 మంది ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గానిదే పెద్ద సంఖ్య. అది కూడా 50 నుంచి 55 శాతం దళిత ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్లో 30 నుంచి 35 శాతం అరవ, మాల సామాజిక వర్గానిదే పెద్ద సంఖ్య. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెస్ బాబు వైయస్సార్సీపి నుంచి 1,03, 265 ఓట్లు సాధించడం ద్వారా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తిరుగుబాటు ధోరణితో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన ఎమ్మెస్ బాబు ఆ పార్టీ మంచి పోటీలో ఉండడం అధికార విపక్ష పార్టీ అభ్యర్థులకు పోటు తప్పేలా లేదని భావిస్తున్నారు.

అన్నగారు అసెంబ్లీ స్థానం నుంచి హ్యాట్రిక్ కొట్టాలని మంత్రి ఆర్కే రోజా ఆశలపై అధికార వైఎస్ఆర్సిపి తిరుగుబాటు నాయకులు ఆమెకు కంటగింపుగా మారారు. ఇద్దరు ముగ్గురు ఇప్పటికే అధికారికంగా టిడిపిలో చేరిపోయారు. వారందరినీ టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ అక్కున చేర్చుకున్నారు. ఇదే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న పోచారెడ్డి రాకేష్ రెడ్డి కూడా నగరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తుండడం, అధికార పార్టీకి గండి పడేలా ఉందని భావిస్తున్నారు.

నందికొట్కూరు..

ఉమ్మడి కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ పరిధిలోని నందికొట్కూరు నియోజకవర్గంలో ఈసారి జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో త్రిముఖ పోటీ ఏర్పడింది. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గమైన ఈ స్థానంలో 2,16, 5589 ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 1, 06,125 మంది, 1,10,417 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళలు 4,292 మంది అధికంగా ఉన్నారు. ఎస్సీ రిజర్వుడుగా ప్రకటించిన తర్వాత 2009లో జరిగిన ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే లబ్బీ వెంకటస్వామి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి.. అభ్యర్థి టిడిపి అభ్యర్థి చిమ్మే బిచ్చన్న, ప్రజారాజ్యం అభ్యర్థి రేణుకమ్మపై 11,968 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే ఐజయ్య ప్రత్యర్థి టిడిపి అభ్యర్థి లంబి వెంకటస్వామిపై 21, 814 ఓటుతో విజయం సాధించారు.

2019లో వైసీపీ అభ్యర్థి విశ్రాంత ఐపీఎస్‌ అధికారి తోగూరు ఆర్థర్, టిడిపి అభ్యర్థి బండి జయరాజుపై 40,610 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎన్నికల్లో ఆయనకు టికెట్ లభించలేదు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా డాక్టర్ తారా సుధీర్, టిడిపి అభ్యర్థిగా గీత సూర్యతో ఆయన పోటీపడుతున్నారు. ద్విముఖ పోటీ జరగాల్సిన ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు అనివార్యమైంది. అంతేకాకుండా స్థానికత సమస్య కూడా తెరపైకి వచ్చింది టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధారా సుధీర్ కడప జిల్లాకు చెందిన వ్యక్తి. టిడిపి అభ్యర్థి గిత్త జై సూర్య, కాంగ్రెస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్థర్ స్థానికులు కావడం గమనార్హం.

నందికొట్కూరులో 40 వేల మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు. బిజెపితో టిడిపి పొత్తుకట్టుకున్న నేపథ్యంలో ఆ ఓట్లు తనకు లభిస్తాయి అని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆశిస్తున్నారు. ఆ ప్రభావం కాంగ్రెస్‌తో పాటు వైయస్ఆర్సీపీ కూడా ఆశావాహంగా ఉంది. క్షేత్రస్థాయిలో ఆ ప్రభావం ఉండకపోవచ్చని టిడిపి నేతలు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టాల నేపథ్యంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ అంతకుముందు హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ముస్లింలు తీవ్రంగా పరిగణిస్తే మాత్రం.. ఓటు బ్యాంకుకు గండి పడే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు.

మొత్తానికి విజయం తమదంటే తమదంటూ అధికార వైఎస్ఆర్సిపి, బిజెపి- జనసేన- టిడిపి అభ్యర్థులు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారు. ప్రచారంలో కూడా తలమునకలుగా ఉన్నారు. వీరికి పోటీగా తెరపైకి వచ్చిన కాంగ్రెస్ అభ్యర్థులతో తలపోటు తప్పేలా లేదు. ఎన్నికల సరళి పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ వల్ల ఎంతమంది ఊహల రెక్కలు తెగాయి అనేది స్పష్టమవుతుంది.

Read More
Next Story