బీఆర్ఎస్ ఎత్తుకు రేవంత్ పై ఎత్తులు.. గెలుపెవరిది ?
x

బీఆర్ఎస్ ఎత్తుకు రేవంత్ పై ఎత్తులు.. గెలుపెవరిది ?

రెండు పార్టీల్లో ఏ పార్టీ గెలిచింది ? గెలుపోటములను పక్కన పెట్టేస్తే జరిగింది ఏమిటంటే విలువైన సమయంతో పాటు ప్రజాధనం వృధా అయ్యిందనే చెప్పాలి.


శుక్రవారంతో ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక విషయం స్పష్టంగా బయటపడింది. అదేమిటంటే సభ జరిగినన్ని రోజులు కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య ఆధిపత్యంకోసం చాలా ప్రయత్నాలు జరిగాయి. కాంగ్రెస్ ను ఎలాగైనా ఇరుకునపెట్టాలని బీఆర్ఎస్ శతవిధాలుగా ప్రయత్నించింది. ఇదే సమయంలో పదేళ్ళ పాలనపై ఆరోపణలు, విమర్శలు చేయటంతో పాటు పదేపదే కేసీఆర్ ను టార్గెట్ చేయటం ద్వారా బీఆర్ఎస్ సభ్యుల నోళ్ళు మూయించాలని కాంగ్రెస్ గట్టిగానే ప్రయత్నించింది. దాంతో అధికారపార్టీని ఇబ్బంది పెట్టాలని బీఆర్ఎస్ వేసిన ఎత్తులకు కాంగ్రెస్ ఎదురు పై ఎత్తులు వేసింది. రెండు పార్టీల్లో ఏ పార్టీ గెలిచింది ? గెలుపోటములను పక్కన పెట్టేస్తే జరిగింది ఏమిటంటే విలువైన సమయంతో పాటు ప్రజాధనం వృధా అయ్యిందనే చెప్పాలి.



సాంకేతికంగా తీసుకుంటే బీఆర్ఎస్ పై కాంగ్రెస్ విజయం సాధించిందనే చెప్పాలి. సభలో నుండి తమపై సస్పెన్షన్ వేటు వేయించుకుని బయటకు వెళ్ళి నానా గోలచేయాలని బీఆర్ఎస్ సభ్యులు చాలా చాలా ప్రయత్నాలు చేశారు. దీన్ని గ్రహించిన రేవంత్ రెడ్డి అందుకు పై ఎత్తులు వేశారు. సభ సజావుగా సాగకుండా బీఆర్ఎస్ సభ్యులు ఎంత గోలచేసినా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాత్రం కారుపార్టీ ఎంఎల్ఏలపై ఒక్కసారి కూడా సస్పెన్షన్ వేటు వేయలేదు. రేవంత్ ఉద్దేశ్యం ఏమిటంటే బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయకుండా వారందరినీ సభలోనే ఉంచాలని. ఎందుకంటే పదేళ్ళ కేసీఆర్ పాలనపై దుమ్మెత్తిపోస్తుంటే బీఆర్ఎస్ సభ్యులు వినాలని. పదేళ్ళ కేసీఆర్ పాలనలో అవినీతి, అవకతవకలు, అరాచకాలు జరిగాయని రేవంత్ అండ్ కో పదేపదే ఆరోపిస్తున్నారు.



అందుకనే చత్తీస్ ఘడ్ తో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ వేసి విచారణ జరిపిస్తోంది. ఇంతకుముందు వేసిన జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కమిషన్ వేసింది. ఆ కమిషన్ విచారణను కూడా పూర్తి చేసేసింది. కమిషన్ ఏర్పాటుతో పాటు నరసింహారెడ్డి ఛైర్మన్ గా ఉండకూడదని కేసీఆర్ సుప్రింకోర్టులో కేసు వేశారు. దాంతో ఛైర్మన్ తప్పించమని సుప్రింకోర్టు ఆదేశించింది. అందుకనే జస్టిస్ మదన్ బీ లోకూర్ కమిషన్ ఏర్పడింది. అలాగే కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వేసింది. ఆ కమిషన్ విచారణ జరుపుతోంది. ఎంత వీలుంటే అంతగా కేసీఆర్ పాలనను రేవంత్ బాగా ఎండగడుతున్నారు.



రేవంత్ ప్రయత్నాలను అడ్డుకుంటున్న బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాల్లో కూడా అదే పద్దతిలో వ్యతిరేకించాలని ప్రయత్నించింది. అందుకనే రేవంత్ వ్యూహాత్మకంగా కారుపార్టీ ఎంఎల్ఏలు ఎవరినీ సస్పెండ్ చేయకుండా వాళ్ళందరినీ సభలోనే ఉండేట్లు చేశారు. ఒకవైపు కేసీఆర్ ను అధికారపార్టీ టార్గెట్ చేయటం దాన్ని వ్యతిరేకిస్తు బీఆర్ఎస్ సభ్యులు సభలోనే గోలచేయటం మామూలైపోయింది. ఇదివరకు ప్రతిపక్షంలో ఉన్నపుడు కాంగ్రెస్ సభ్యులు గోలచేయగానే సస్పెండ్ చేసి అసెంబ్లీ నుండి బయటకు పంపేసేవారు. రేవంత్ ను సభ నుండి నెలరోజులు సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ సభ్యత్వాలను ఏకంగా రద్దే చేయించేశారు. కేసీఆర్ వైఖరితో పోల్చుకుంటే రేవంత్ ప్లానింగ్ డిఫరెంటుగా ఉంది. తమను సస్పెండ్ చేయకుండా సభలోనే ఉంచేయటాన్ని బీఆర్ఎస్ సభ్యులు కూడా తట్టుకోలేకపోతున్నారు.



అందుకనే ఇక లాభంలేదనుకుని కేటీఆర్ నాయకత్వంలో ఎంఎల్ఏలంతా సభ నుండి వాకౌట్ చేసి స్పీకర్ ఛాంబర్ దగ్గర, అసెంబ్లీ బయట, గన్ పార్క్ దగ్గర నానా రచ్చేచేశారు. హోలు మొత్తంమీద చూసుకుంటే అసెంబ్లీ నిర్వహణలో బీఆర్ఎస్ ఎత్తుకు రేవంత్ పై ఎత్తులు వేసినట్లు అర్ధమవుతోంది. మరి రెండు పార్టీల్లో గెలుపోటములు ఎవరిదంటే ఏమిచెబుతారు ?

Read More
Next Story