
బనకచర్లపై ఢిల్లీలో అసలు చర్చించారా.. లేదా?
ఈ గందరగోళంపై ప్రజలకు స్పష్టత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రిపై ఉన్నదంటున్న ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక
గోదావరి జలాల వినియోగంపై ఢిల్లీలో నిన్న జరిగిన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో బనకచర్ల ఏర్పడిన గందరగోళంపై ఏపీ ప్రభుత్వం స్పష్టత నివ్వాలని ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక డిమాండ్ చేసింది.ఈ మేరకు అధ్యయన వేదిక తరుపున టి. లక్ష్మీనారాయణ ప్రకటన విడుదల చేశారు.
గందరగోళానికి తెరదించండి..అధ్యయన వేదిక ప్రకటన ఇదే..
కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశం ఢిల్లీలో జరగడం మంచిదే. ఆ సమావేశం తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారు , జలవనరుల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిగారు మీడియాతో మాట్లాడుతూ పోలవరం - బనకచెర్ల పథకంపై సమావేశంలో ప్రస్తావన రాలేదని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడుగారు కృష్ణా, గోదావరి నదీ జలాలు, బనకచెర్లపై కమిటీ ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ గందరగోళంపై ప్రజలకు స్పష్టత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రిగారిపై ఉన్నది.
కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి జలాశయాల నుండి నీటి వినియోగంపై టెలిమెట్రీ విధానాన్ని పతిష్టంగా అమలు చేయాలన్న నిర్ణయం మరియు తీవ్ర ఆందోళన కలిగిస్తున శ్రీశైలం జలాశయం ప్లంజ్ పూల్ మరమ్మత్తు పనులను తక్షణం చేపట్టడానికి నిర్ణయం తీసుకోవడం, సముచితమైన నిర్ణయాలు.
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థికరణ చట్టం-2014 మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డును ఆంధ్రప్రదేశ్ లో నెలకొల్పాల్సి ఉంది. పదకొండేళ్లు గడచినా బోర్డు కార్యాలయం హైదరాబాదులోనే కొనసాగుతున్నది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కె.ఆర్.యం.బి. కార్యాలయానికి కృష్ణా నది పరివాహక ప్రాంతానికి ఏ మాత్రం సంబంధంలేని విశాఖపట్నంకు తరలించమని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం వ్రాస్తే తీవ్రంగా వ్యతిరేకించాం. విజయవాడలో అఖిల పక్ష రైతు సంఘాల సమావేశం ఏర్పాటు చేసి కె.ఆర్.యం.బి. కార్యాలయాన్ని కృష్ణా నదిపై ఆధారపడి ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహణ మరియు నియంత్రణ చేయడానికి కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసి, నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. కృష్ణా నది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలుసార్లు విజ్ఞప్తి చేశాం. బోర్డు కార్యాలయాన్ని అమరావతిలో ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు ప్రకటించడం తీవ్ర గర్హనీయం. ప్రజాభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోని ఏ ప్రభుత్వం కూడా ప్రజల మన్ననలు పొందలేదు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి.
టి. లక్ష్మీనారాయణ
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక
Next Story