అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో ఆందోళన
x
అమరావతి మ్యాప్

అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో ఆందోళన

అమరావతి రైతుల సమస్యలు తీరలేదు. ప్రభుత్వ కమిటీ రెండో సమావేశం నేడు నిర్వహిస్తోంది.


ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం 2014–15లో ల్యాండ్ పూలింగ్ లో 34 వేల ఎకరాలకు పైగా భూములు ఇచ్చిన 30 వేలకు పైచిలుకు రైతులు ఇప్పటికీ అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఏడు సంవత్సరాలుగా “ప్లాట్లు ఇస్తాం… పెన్షన్ ఇస్తాం… అభివృద్ధి చేస్తాం” అని హామీలు ఇచ్చినా, ఆచరణలో ఏమీ జరగలేదని రైతుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.


రాజధాని భూముల్లో శనివారం ఉదయం 8 గంటలకు పర్యటించిన మంత్రి నారాయణ

ప్రధాన సమస్యలు

అసైన్డ్ భూములు ఇచ్చిన వారికి ఇప్పటికీ రెగ్యులరైజేషన్ కాలేదు, అన్యుటీలు సక్రమంగా రావడం లేదు.

రోడ్ల లైన్‌లోకి వచ్చిన రిటర్నబుల్ ప్లాట్లకు ప్రత్యామ్నాయాలు ఇవ్వడం లేదు.

2,779 రిజిస్ట్రేషన్లు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. “గ్రామంలోనే ప్లాట్లు ఇస్తాం” అని సీఎం చంద్రబాబు స్వయంగా హామీ ఇచ్చినా అమలు శూన్యం.

పరిహార ప్యాకేజీలు ఆలస్యం, బ్యాంకు రుణాలు రాకపోవడం, కొందరు అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని బహిరంగ ఆరోపణలు.

రాజధాని ప్రాంతంలో విద్యుత్, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాలు లేవు.

ఈ నేపథ్యంలోనే అమరావతి క్యాపిటల్ ఫార్మర్స్ జేఏసీ నేతలు గత నెలలో సీఎంకు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అల్టిమేటం జారీ చేశారు. “ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ రోడ్డెక్కుతాం” అని ముందుగానే హెచ్చరించారు.

ఈ మేరకు సీఎం చంద్రబాబు అక్టోబర్‌లో ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ (కన్వీనర్), మంత్రి పి. నారాయణ, ఎమ్మెల్యే టి. శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అదనపు కమిషనర్ భార్గవ తేజలతో కూడిన ఈ కమిటీ నవంబర్ 10న మొదటి సమావేశం, ఈ రోజు (నవంబర్ 22న) రాయపూడిలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ భవనం 7వ అంతస్తులో రెండో సమావేశం జరగనుంది.

కానీ రైతులు మాత్రం ఈ కమిటీపై పెద్దగా నమ్మకం పెట్టడం లేదు. “మళ్లీ ఒక కమిటీ… మళ్లీ కొన్ని సమావేశాలు… చివరికి ఫలితం శూన్యం” అన్నది జేఏసీ నేతల స్పష్టమైన వాదన. “2014 తర్వాత ఇప్పటివరకూ ఎన్ని కమిటీలు పెట్టారు? ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు” అని వారు ప్రశ్నిస్తున్నారు.

అమరావతి ల్యాండ్ పూలింగ్ జేఏసీ రైతుల స్పందన

మాదాల శ్రీనివాస్, JAC అధ్యక్షుడు.

"ప్రభుత్వం 16 నెలలు అధికారంలో ఉన్నా, రైతుల సమస్యలు పరిష్కరించలేదు. అసైన్డ్ భూములు, ప్లాట్ కేటాయింపు ఆలస్యాలు, CRDAలో అవినీతి పెరిగింది. 10 రోజుల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణలతో సమావేశం జరగకపోతే, మేము మరో కార్యాచరణ ప్రకటిస్తాం." అని అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతుల జేఏసీ అధ్యక్షులు శ్రీనివాస్ అన్నారు.

ఈ వ్యాఖ్యలు అక్టోబర్ 12, 2025న గుంటూరులో జరిగిన JAC సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ చేశారు.

జమ్ముల శ్యాం కిషోర్, JAC సభ్యుడు.

"అగస్టు 5న మంత్రి నారాయణలతో సమావేశమైనా సమస్యలు పరిష్కరించ లేదు. రైతుల సమస్యలు, ప్లాట్ రిజిస్ట్రేషన్లు, లీజ్ మొత్తాలు, మౌలిక సదుపాయాలు పూర్తిగా విస్మరించారు. మంచి పరిష్కారాలు రాకపోతే, నెలాఖరులో మరో సమావేశం పెట్టి కార్యాచరణ నిర్ణయిస్తాం." అని జేఏసీ సభ్యుడు జమ్ముల శ్యామ్ కిశోర్ హెచ్చరించారు.

ఈ వ్యాఖ్యలు రైతుల సమస్యలైన ప్లాట్ కేటాయింపు, పరిహారాలు, అవినీతి పై ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని, కమిటీ రైతుల సమస్యలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవాలనే అంశాన్నిహైలైట్ చేస్తున్నాయి. రైతులు మరోసారి ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.

ప్రభుత్వ వర్గాలు మాత్రం “ఈసారి నిజంగానే సమస్యలు పరిష్కరిస్తాం, టైమ్‌లైన్ ఖరారు చేస్తాం” అని హామీ ఇస్తున్నాయి. కానీ గత అనుభవాలు, ఆలస్యమైన రిజిస్ట్రేషన్లు, ఖాళీగా ఉన్న రాజధాని ప్రాంతం చూస్తే… రైతుల అసంతృప్తి సహజమే.

ఈ రోజు సమావేశం తర్వాత కమిటీ ఏం నిర్ణయాలు తీసుకుంటుంది? రైతులకు కనక్ట్ టైమ్‌లైన్ ఇస్తుందా? లేక మరోసారి “మళ్లీ సమావేశం పెడతాం” అని చెప్పి సరిపెట్టేస్తుందా? అన్నది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశ్న.

Read More
Next Story