
వైఎస్ అవినాష్‌రెడ్డి మీద అనంతపురం పోలీసులకు ఫిర్యాదు
ఓ కుటుంబ వ్యవహారంలో తల దూర్చి, భర్తను ఇబ్బందులకు గురి చేశారని, అవినాష్‌రెడ్డితో పాటు అతని తండ్రి భాస్కరరెడ్డి మీద ఫిర్యాదు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరుడు, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మీద అనంతపురం జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను మానసికంగాను, శారీరకంగాను వేధిస్తున్నారంటూ అవినాష్‌రెడ్డి మీద ఆకుతోటపల్లి శేషానందరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. శేషానందరెడ్డి తన ఫిర్యాదును నేరుగా అనంతపురం ఎస్పీ జగదీష్‌కు అందజేశారు. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తన కుటుంబం వ్యవహారాల్లో జోక్యం చేసుకొని తనను లేని పోని ఇబ్బందులకు గురి చేస్తున్నారని, తన భార్యను కాపురానికి రానీకుండా అడ్డుకుంటూ, తన కుటుంబంలో అనవసరంగా చిచ్చు పెట్టి గొడవలు సృష్టిస్తున్నారని శేషానందరెడ్డి ఎస్పీ జగదీష్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
శేషానందరెడ్డికి పులివెందుల మండలం సింహాద్రిపల్లికి చంఎదిన శ్వేతతో 2016లో వివాహమైంది. కొద్ది కాలం తమ సంసారం మూడేళ్ల పాటు సజావుగానే సాగింది. తర్వాత ఇద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో శేషానందరెడ్డి మీద అలిగి 2019లో శ్వేత తన పుట్టిల్లు అయిన పులివెందుల మండలం సింహాద్రిపల్లికి వెళ్లిపోయింది. ఈ పరిస్థితుల్లో తన భార్య శ్వేత తన సోదరితో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తన మీద తప్పుడు కేసు నమోదు చేయించారు. అంతేకాకుండా ఎంపీ అవినాష్‌రెడ్డి ప్రోద్బలంతో నాటి పులివెందుల సిఐ బాలమద్దిలేటితో తనను బాగా కొట్టించారు. దీనిలో ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి ప్రమేయం కూడా ఉంది. తన కుటుంబ గొడవల్లో అనవసరంగా తలదూర్చడమే కాకుండా, సిఐతో కొట్టించడంతో మానసికంగా, శారీరంగా ఇబ్బందులకు గురయ్యాను.
తండ్రీ, కొడుకుల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంద. దీంతో ఎంపీ అవినాష్‌రెడ్డితో పాటు అతని తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిల మీద కేసు నమోదు చేసి, తనకు న్యాయం చేయాలని, లేకుండా తనకు ఆత్మహత్యే శరణ్యమని శేషానందరెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్‌కు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిల బారి నుంచి తనను రక్షించి ఈ సమస్య నుంచి తనను గట్టెక్కించాలని శేషానిందరెడ్డి ఎస్పీ జగదీష్‌ను కోరారు. దీంతో ఫిర్యాదును స్వీకరించిన ఎస్పీ జగదీష్ బాధితుడు శేషానందరెడ్డికి న్యాయం చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిల మీద కేసు నమోదు కావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలు ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Next Story