కలెక్టర్ల నిబద్ధతే కూటమి ప్రభుత్వ బలం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
x

కలెక్టర్ల నిబద్ధతే కూటమి ప్రభుత్వ బలం: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

మారుమూల గిరిజన పల్లెలకు ‘అడవి తల్లి బాట’ ద్వారా రహదారులు, పల్లె పండుగ 1.0తో 4 వేల కిలోమీటర్ల సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టినట్లు పవన్ కల్యాణ్ వెల్లడించారు.


జిల్లా కలెక్టర్లు పూర్తి నిబద్ధతతో పనిచేస్తూ కూటమి ప్రభుత్వ లక్ష్యాలను సాకారం చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 5వ కలెక్టర్ల సదస్సులో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడారు. గ్రామీణ వికాసం, గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఆయన స్పష్టం చేశారు.

అడవి తల్లి బాట

గిరిజన ప్రాంతాలకు మహర్దశ వచ్చిందని, మారుమూల గిరిజన గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన ప్రాధాన్యత అని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ‘అడవి తల్లి బాట’ ప్రాజెక్టు ద్వారా చేపట్టిన పనుల్లో అటవీ అనుమతుల విషయంలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్లు చూపిన చొరవను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 100 శాతం అనుమతులు సాధించడం హర్షణీయమన్నారు.

పల్లె పండుగతో మౌలిక వసతుల కల్పన చేస్తున్నామని, కలెక్టర్ల చొరవతో 'పల్లె పండుగ 1.0'ను నిర్దేశిత గడువులోగా విజయవంతంగా పూర్తి చేశామని పవన్ కళ్యాణ్ తెలిపారు. నరేగా నిధులతో గ్రామాల్లో 4 వేల కిలోమీటర్ల మేర సిమెంటు రోడ్లను నిర్మించినట్లు చెప్పారు. వీటితో పాటు రైతులకు మేలు చేసేలా 22,500 మినీ గోకులాలు, 1.2 లక్షల ఫామ్ పాండ్స్ నిర్మించి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చామన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 41.12 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించి, సుమారు రూ. 4,330 కోట్ల వేతనాలను నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరవేశామని వివరించారు.

జాతీయ స్థాయిలో రాష్ట్రానికి గుర్తింపు వచ్చిందని, రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (RGSA) శిక్షణ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందని ఆయన ప్రకటించారు. ఇది పంచాయతీరాజ్ సిబ్బంది సామర్థ్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని అభిప్రాయపడ్డారు. అలాగే జూన్ నెలలో ప్రారంభించిన ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమం నేడు 25 యూనిట్లకు పెరిగి అద్భుత ఫలితాలను ఇస్తోందని చెప్పారు.

కలెక్టర్లకు దిశానిర్దేశం

గ్రామ పంచాయతీల స్వయం ఆదాయ వనరులను పెంచడంపై దృష్టి సారించాలి. పన్నుల వసూళ్లు, డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి. ప్రభుత్వ ఫలాలను ప్రజలకు చేరవేసే క్రమంలో మరింత ఉత్సాహంగా, సేవా దృక్పథంతో పనిచేయాలి అని సూచించారు.

Read More
Next Story