ఆస్ట్రేలియాలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, పరిశ్రమ-అకడమిక్ సహకార వ్యవస్థలో TAFE NSW కీలకపాత్ర పోషిస్తోందని గైల్స్ తెలిపారు. ఈ క్యాంపస్ సెంట్రల్ స్టేషన్, యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ సిడ్నీ (UTS), సిడ్నీ యూనివర్సిటీ, ABC, చైనాటౌన్, సీబీడీ వంటి ప్రముఖ ప్రదేశాలతో అనుసంధానమై ఉంది. ఈ క్యాంపస్ గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, ప్రత్యేక స్టూడియోలు, విద్యార్థుల విశ్రాంతి కేంద్రాలు వంటి ఆధునిక సౌకర్యాలను కలిగి ఉండి, ప్రాక్టికల్ వృత్తి శిక్షణను అందిస్తుంది. TAFE NSW ప్రపంచవ్యాప్త భాగస్వామ్యాలను చురుకుగా కొనసాగిస్తూ, పరిశ్రమకు సంబంధించిన నైపుణ్యాలను అందించడంలో, అలాగే ప్రత్యేక ప్రోగ్రామ్‌ల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో వృత్తి నైపుణ్యాలను ప్రోత్సహించడంలో ముందంజలో ఉందని ఆండ్రూ గైల్స్ తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ లోని ప్రాధాన్యతా రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను స్థాపించేందుకు APEDB/APSSDC లతో కలిసి పనిచేసే అంశాన్ని పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక కారిడార్లలో TAFE NSW స్కిల్ హబ్ లేదా ఇంటర్నేషనల్ క్యాంపస్ స్థాపన అవకాశాలను పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐటీఐలు, నైపుణ్య శిక్షణ సంస్థల కోసం పాఠ్యప్రణాళిక రూపకల్పన, ఉపాధ్యాయ శిక్షణ కోసం ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయండి. ఆంధ్రప్రదేశ్ విద్యాసంస్థలు, TAFE NSW మధ్య స్టూడెంట్ ఎక్స్చేంజి, క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ మార్గాలను అన్వేషించండి. విశాఖలో ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న పార్టనర్ షిప్ సమ్మిట్ - 2025 (Partnership Summit 2025)కు హాజరుకండి. DFAT ప్రత్యేక సందర్శకుల కార్యక్రమం (Special Visitors Program)లో ఆంధ్రప్రదేశ్ స్కిల్ లీడర్స్ ను చేర్చాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా ఐటీ, హాస్పిటాలిటీ, హెల్త్‌కేర్, నిర్మాణ రంగాల వంటి అధిక డిమాండ్‌ ఉన్న విభాగాల్లో వృత్తి ప్రాధాన్య శిక్షణా కార్యక్రమాలను రూపొందించి అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, స్థానిక సంస్థలతో భాగస్వామ్యం వహించండి. బోధన పద్ధతులను మెరుగుపరచడం, వృత్తి విద్యను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానించేందుకు స్థానిక ఉపాధ్యాయుల కోసం వర్క్‌షాప్‌లు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించండి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు స్థానికంగా TAFE NSW అర్హతలను సంపాదించడానికి, తద్వారా ఆస్ట్రేలియాలో మరింత ఉన్నత విద్య లేదా ఉపాధి అవకాశాలను పొందగల మార్గాలను చూపించండి. హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌లో TAFE NSW నైపుణ్యాన్ని ఉపయోగించి, ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక, హాస్పిటాలిటీ రంగాల్లో విద్యార్థులు, నిపుణులకు శిక్షణ ఇవ్వండి. విద్యార్థుల కోసం శిక్షణ, ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించేందుకు TAFE NSW, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రైవేట్ రంగ పరిశ్రమల మధ్య భాగస్వామ్యాల ఏర్పాటుకు చొరవ చూపండి. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యాపార రంగాలపై దృష్టి సారిస్తూ, మహిళల కోసం ప్రత్యేక నైపుణ్యాభివృద్ధి, లింగ సమానత్వం, ఆర్థిక సాధికారతను ప్రోత్సహించే కార్యక్రమాలను రూపొందించాలని మంత్రి లోకేష్ కోరారు.