విజయవాడ పీవీపీ సినిమా హాల్లో కాఫీ కప్ ఎంతో తెలిస్తే అదిరి పోతారు!
x

విజయవాడ పీవీపీ సినిమా హాల్లో కాఫీ కప్ ఎంతో తెలిస్తే అదిరి పోతారు!

మాల్స్, మల్టీప్లెక్స్ ల్లో సినీ ప్రేక్షకులను బెదర గొడుతున్న స్నాక్స్. పట్టించుకోని అధికారులు.


విజయవాడ నగరంలో దాదాపు 50 సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. బేకరీ ఐటమ్‌లు, సాఫ్ట్ డ్రింక్‌లు, స్వీట్ కార్న్ వంటి ఆహార పదార్థాల ధరలు బయటి ధరల కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి. థియేటర్ మేనేజ్‌మెంట్ ప్రేక్షకులు ఆహారాన్ని, నీటిని కూడా లోపలికి తీసుకెళ్లకుండా నిరాకరిస్తోంది, ఇది భద్రతా సమస్య అని చెప్పి కస్టమర్ల జేబులకు రంధ్రం పడేస్తోంది.

నిపుణులు చెబుతున్నట్లుగా థియేటర్లలో 40 శాతం కంటే ఎక్కువ వ్యాపారం ఫుడ్ స్టాల్స్ ద్వారానే జరుగుతోంది. 300 ఎమ్‌ఎల్ సాఫ్ట్ డ్రింక్ బయట రూ.15 లకు అమ్ముతున్నారు. కానీ థియేటర్లలో రూ.25 నుంచి రూ.75 వరకు అమ్ముతున్నారు. రోడ్‌సైడ్‌లో స్వీట్ కార్న్ కప్ రూ.20, థియేటర్లలో రూ.40లు. మల్టీప్లెక్స్‌లలో రూ.150లు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ థియేటర్లలో పాప్‌కార్న్ అందమైన మినిమం రెగ్యులర్ సైజ్ కప్ లో రూ.350 లు తీసుకుంటున్నారు. అదనంగా సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, సర్వీస్ చార్జ్ మొదలైనవి సెలెక్ట్ చానల్ పేరుతో వసూలు చేస్తున్నారు.

సినిమాకు వెళితే సినిమా టిక్కెట్ కంటే మూడింతలు స్నాక్స్ కు అవుతున్నాయని చెబుతున్నారు. అధికారులు ధియేటర్ల వైపు చూడటం లేదనేది ప్రేక్షకుల ఆరోపణ. థియేటర్ మేనేజ్‌మెంట్ బహిరంగ దోపిడీ చేస్తున్నా అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అధిక ధరలు ప్రజలను థియేటర్ల నుంచి దూరం చేశాయి.

పీవీపీ స్క్వేర్ మాల్ లో దినేష్ తిర్లుక అనే వ్యక్తి లిటిల్ హార్ట్స్ సినిమాకు శనివారం వెళ్లి విశ్రాంతి సమయంలో కాఫీ తాగారు. ఆ కాఫీ పేరు కాపుచినో (Capuccino) 150 ఎంఎల్ కాఫీ కప్ ధర జీఎస్టీతో కలిపి రూ. 240లు. ఇదే కాఫీ బయట తాగితే రూ. 120లు. అలాగే స్క్వెప్పర్ (Schwepper) వాటర్ బాటిల్ 500 ఎంఎల్ రూ. 70లు. ఇందులోనే సీజీఎస్టీ రూ. 1.67లు, ఎస్జీఎస్టీ రూ. 1.67లు కలిపి ఉంది. 



అధిక ధరల వెనుక కారణాలు ఏమిటి?

మల్టీప్లెక్స్‌లు టికెట్ ధరలపై లాభాలు తక్కువగా ఉండటంతో, స్నాక్స్ ను 'సెకండరీ ప్రొడక్ట్స్'గా పరిగణించి అధిక ధరలు వసూలు చేస్తున్నాయి. అదనంగా సీజీఎస్‌టీ, ఎస్‌జీఎస్‌టీ, సర్వీస్ చార్జీల పేరుతో మరిన్ని వసూళ్లు చేస్తున్నాయి. 2018లో ఆంధ్రప్రదేశ్‌లో మల్టీప్లెక్స్‌లు బయటి ఆహారాన్ని అనుమతించాలని కన్స్యూమర్ ఫోరమ్ ఆదేశించినప్పటికీ, అమలు లోపభూయిష్టంగా ఉంది. 2025 మేలో అధికారులు థియేటర్లను తనిఖీ చేసి అధిక ధరలు గుర్తించారు. కానీ చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కనిపిస్తోంది.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏమన్నారు?

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మే 28, 2025న థియేటర్లలో పాప్‌కార్న్, సాఫ్ట్ డ్రింక్‌లు, బాటిల్డ్ వాటర్ వంటి తినుబండారాల అధిక ధరలపై ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "కుటుంబాలు ఖరీదైన రిఫ్రెష్‌మెంట్ల కారణంగా థియేటర్లకు దూరం కాకూడదు" అని ఆయన చెప్పారు. ఈ అధిక ధరలు మోనోపొలీ పద్ధతుల వల్లే వచ్చాయని, ఇవి సినిమా ప్రేక్షకులకు భారం అవుతున్నాయని విమర్శించారు.

థియేటర్ టికెట్‌లు, ఆహారం, పానీయాల ధరలను నియంత్రించాలని, ధరలు, నాణ్యతను పరిశీలించాలని, అవసరమైతే విచారణలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. న్యాయమైన ధరలు అమలు అయితే ప్రేక్షకుల సంఖ్య పెరిగి, పన్ను ఆదాయం పెరుగుతుందని ఆయన సూచించారు. అలాగే థియేటర్లలో క్లీన్ డ్రింకింగ్ వాటర్, శుభ్రతను నిర్ధారించాలని, ఇది థియేటర్ యజమానుల ప్రాథమిక బాధ్యత అని హైలైట్ చేశారు.

Read More
Next Story