
మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు-సీఎం సీరియస్
మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు కమిటీకి చెప్పిన బాధిత విద్యార్థినిలు
కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాలలో విద్యార్థినులపై కొందరు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న అంశం కలకలం సృష్టించింది. బీఎస్సీ, డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులు చదువుతున్న విద్యార్థినులపై ల్యాబ్ సహాయకుడు, మరో ఉద్యోగి లైంగికంగా వేధిస్తున్నారని బాధిత విద్యార్థినులు గతంలో ఫ్యాకల్టీ కి చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో ప్రిన్సిపాల్ విష్ణువర్ధన్ కు ఫిర్యాదు చేశారు. ఆయన తీవ్రంగా పరిగణించి అంతర్గత కమిటీ ద్వారా విచారణ చేయించారు. దాంతో కమిటీ ముందు 50 మంది బాధిత విద్యార్థినిలు ,మైక్రో బయాలజీ, పాథాలజీ, బయో కెమిస్ట్రీ విభాగాల్లో కొందరు సిబ్బంది తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు.తమను ఎవరూ ఏమీ చేయలేరని కూడా సిబ్బందిలో ఒకరిద్దరు తమను బెదిరించారని కూడా బాధితులు కమిటీ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు.కొందరు ల్యాబ్ అసిస్టెంట్లు విధులకు మద్యం తాగి వస్తున్నారని ఫిర్యాదు చేశారు. మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ల్యాబ్ అటెండెంట్‌గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తితో పాటు మరో ముగ్గురు కూడా వైద్య విద్యార్థినులను వేధించినట్లు విచారణలో వెల్లడైంది.