
‘లేడీ డాన్‌లకు తోక కట్ చేస్తా’ సీఎం మాస్ వార్నింగ్
బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే వాళ్లకు చిన్న విషయమైనప్పుడు, ఇక పరకామణి చోరీ కేసు పెద్దదవుతుందా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
రాష్ట్రంలో కొందరు 'లేడీ డాన్లు' తయారయ్యారని, వారి ఆగడాలకు హద్దు లేకుండా పోతోందని సీఎం చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. లేడీ డాన్లుగా ప్రవర్తిస్తున్న వారు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకునేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే లేడీ డాన్లకు తోకలు కట్ చేస్తానని తనదైన శైలిలో మాస్ వార్నింగ్ ఇచ్చారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అనంతరం, అక్కడే విలేకరులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఆయన రాష్ట్రంలోని పలు కీలక అంశాలపై మాట్లాడారు. అమరావతి నిర్మాణ పురోగతి గతి గురించి ప్రస్తావించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతమయ్యాయని, భూసేకరణ రెండో దశ కూడా సజావుగా సాగుతోందని ముఖ్యమంత్రి తెలిపారు. రాజధాని పురోగతిపై ప్రభుత్వం, రైతులు, ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తిరుమల పరకామణి చోరీ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసేందుకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రయత్నించారని చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
జగన్ వ్యాఖ్యలు కోట్లాదిమంది భక్తుల మనోభావాలను దెబ్బతీశాయని ఆయన మండిపడ్డారు. బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసే వాళ్లకు చిన్న విషయమైనప్పుడు, ఇక పరకామణి చోరీ కేసు పెద్దదవుతుందా? అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పరకామణి సెటిల్‌మెంట్ పై ఆరోపణలు చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన దోపిడీకి పరకామణి కేసు, దానిపై జగన్ స్పందించిన తీరే నిదర్శనమని, పరకామణి దొంగతనాన్ని లోక్ అదాలత్‌లో సెటిల్ చేయడానికి జగన్ ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. గతంలో వివేకా హత్య కేసును కూడా సెటిల్ చేయాలని చూశారని విమర్శించారు. ఈ చిట్‌చాట్‌లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.

