కుప్పంలో రూ.1292 కోట్ల విలువైన పనులు ప్రాంభించిన సీఎం
x

కుప్పంలో రూ.1292 కోట్ల విలువైన పనులు ప్రాంభించిన సీఎం

సీఎం చంద్రబాబు నాయుడు బెంగళూరు నుంచి కుప్పం చేరుకున్నారు.


రెండు రోజుల పర్యటన కోసం సీఎం చంద్రబాబు తన సొంత నియోజక వర్గమైన కుప్పంకు చేరుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, అధికారులకు ఆయనకు ఘన స్వాగతం పలికారు. శాంతిపురం మండలం తుంశి వద్ద ఏపీ మోడల్‌ స్కూల్‌ వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొన్న ఆయన స్వర్ణకుప్పం ప్రాజెక్టులో భాగంగా పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు.మొత్తం రూ.1292.74 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి, సంక్షేమ, ప్రత్యేక పథకాలను ఆయన ప్రారంభించారు. సీఎం ప్రారంభించిన వాటిల్లో ఇప్పటికే రూ.125.13 కోట్ల విలువైన అభివృద్ధి పనులు, రూ.47 కోట్లతో 30 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ లైనింగ్‌ పనులు, రూ. 42.5 కోట్ల వ్యయంతో 46 కిలోమీటర్ల మేర సీసీ రహదారులు, 65 కిలోమీటర్ల బీటీ రోడ్లు, తాగునీటి సరఫరా నిమిత్తం రూ.8.97 కోట్లతో పనులు పూర్తి చేశారు. రూ. 7.63 కోట్లతో గోకులం షెడ్లు, రూ.3.7 కోట్లతో వీధిదీపాలు, రూ.1.64 కోట్లతో పాఠశాల కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణాలను పూర్తి చేశారు. 1000 మంది మహిళా లబ్దిదారులకు కొత్తగా గ్యాస్‌ కనెక్షన్లు అందజేసిన సీఎం మరో 3041 మంది లబ్దిదారులకు కొత్తగా పెన్షన్లు అందించారు. 7,488 ఎస్సీ ఎస్టీ గృహాలకు రూ. 21.80 కోట్ల వ్యయంతో పీఎం సూర్యఘర్‌ యోజన కింద సోలార్‌ రూఫ్‌ టాప్‌ ప్యానళ్లు ఏర్పాటును వచ్చే ఏడాది జనవరి నాటికల్లా సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కుప్పం నియోజకవర్గంలో చెత్త సేకరణకు 130 ఎలక్ట్రిక్‌ ఆటోలను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. దీంతో ఇంటింటి చెత్త సేకరణకు ఎలక్ట్రిక్‌ ఆటోలను వినియోగిస్తున్న తొలి నియోజకవర్గంగా కుప్పం అవతరించనుంది. కామన్‌ ట్రీట్‌ మెంట్‌ సెంటర్‌ లో చెత్తను రీసైకిల్‌ చేయటం ద్వారా జీరో ల్యాండ్‌ ఫిల్‌ పాలసీ అమలు చేస్తున్న నియోజకవర్గంగా కుప్పం నిలవనుంది. పేటీఎం సంస్థ సీఎస్‌ఆర్‌ నిధులతో అడ్వాన్సు లైఫ్‌ సపోర్టు అంబులెన్సులను కూడా సీఎం ప్రారంభించారు. 400 అంగన్‌వాడీ కేంద్రాల్లో కేర్‌ అండ్‌ గ్రో కార్యక్రమాన్ని ప్రారంభించారు. పీఎం కుసుమ్‌ పథకం కింద రూ.564 కోట్లతో వ్యవసాయ ఫీడర్లకు సౌర విద్యుత్‌ అందేలా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. దీని ద్వారా 32,106 వ్యవసాయ పంపుసెట్లకు సౌర విద్యుత్‌ అందనుంది. కుప్పంలో టూరిజం అభివృద్ధికి తోడ్పడే కంఫర్ట్‌ 3 స్టార్‌ రిసార్టును ప్రారంభించిన సీఎం 1387 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందించారు. 400 మంది డ్వాక్రా మహిళలకు ఇ– సైకిళ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీ దగ్గుమల్ల ప్రసాద్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, అధికారులు పాల్గొన్నారు.
Read More
Next Story