‘వివేకాను చంపింది ఎవరో అందరికీ తెలుసు’.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు
x

‘వివేకాను చంపింది ఎవరో అందరికీ తెలుసు’.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

పులివెందులలో నామినేషన్ దాఖలు చేయడానికి సీఎం జగన్ భారీ ర్యాలీగా బయలు దేరారు. అంతకుముందే పులివెందులలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.


‘అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు’’అంటూ షర్మిల, సునీత వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. వివేకానంద రెడ్డిని ఎవరు చంపారు అన్న విషయం ప్రజలందరికీ తెలుసని అన్నారు. నామినేషన్ దాఖలు చేయనున్న సందర్భంగా పులివెందులలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం వైస్‌ఎస్ జగన్ ప్రసంగించారు. ఈ సభకు ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చారు. ‘జై జగన్’ అంటూ ప్రజలకు చేసిన నినాదాలతో పులివెందుల అంతా దద్దరిల్లింది. రిటర్నింగ్ అధికారి దగ్గరకు ఆయన భారీ ర్యాలీగా బయలుదేరారు. అయితే ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

వీళ్లా వైఎస్ఆర్ వారసులు

‘‘వివేకానందరెడ్డిని ఎవరు హతమార్చారు అన్నది ప్రజలందరికీ తెలుసు. వివేకాను నేను చంపానని అంటున్న వారు బయట దర్జాగా తిరుగుతున్నారు. ఇప్పుడు పసుపు చీర కట్టుకుని వీళ్లు(షర్మిల, సునీత) కూడా వాళ్ల కుట్రలో భాగమయ్యారు. వీళ్లా మహానేత అయిన వైఎస్ఆర్ వారసులు?’’అని ప్రశ్నించారు. వీళ్లంతా కలిసి అధికారం, పదవులు అందుకోవాలని వివేకాను చంపిన వారి సరసన చేరారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అనంతరం అవినాష్ రెడ్డి లేవనెత్తి ప్రశ్నల్లో అబద్దం ఏముందని, వివేకాకు రెండో పెళ్లి అయింది నిజం కాదా? అని జగన్ కూడా ప్రశ్నించారు.

అవినాష్‌కు అందుకే టికెట్

అవినాష్‌ను తాను ఏమీ కాపడటం లేదని జగన్ స్పష్టం చేశారు. ‘‘అవినాష్ ఏ తప్పూ చేయలేదని నేను నమ్ముతున్నాను. అందుకే అతడికే కడప ఎంపీ టికెట్ ఇచ్చాను. వీళ్లు వీళ్ల అబద్దపు ఆరోపణలతో అవినాష్ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. తమ స్వార్థం కోసం ఒకరి జీవితాన్ని నాశనం చేయడం దుర్మార్గం కాదా’’ అని ప్రశ్నించారు.

వైఎస్ఆర్ వారసులెవరో ప్రజలే చెప్పాలి

‘‘కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు ఈనాడు కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. పులివెందుల సంస్కృతి, కడప కల్చర్, రాయలసీమ సంప్రదాయం అంటూ మనపై అందరూ చూస్తున్నారు. ఈ అభివృద్దికి వైఎస్ఆర్ కారణం. రాయలసీమ అభివృద్ధికి వైఎస్ఆర్ ఎంత కృషి చేశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు కొత్తగా వైఎస్ఆర్ రాజకీయ వారసులమని కొందరు ప్రజల మధ్యకు వస్తున్నారు. అదంతా వారి కుట్ర. వైఎస్ఆర్ లెగసీని కనుమరుగు చేయాలని చూసింది ఎవరు? ఆయన పేరును సీబీఐ ఛార్జ్ షీట్ చేర్చింది ఎవరు? వైఎస్‌ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు? నాన్నగారిపై కక్షతో కేసులు పెట్టింది ఎవరు? అలాంటి కుట్రలు చేసిన వారి పంచన చేసిన వారు వైఎస్ఆర్ వారసులా? ఆ మహానేత వారుసులు ఎవరు అన్న ప్రశ్నను ప్రజలే సమాధానం చెప్పాలి’’అని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలన్న వైఎస్ఆర్ ఆశయ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది తమ ప్రభుత్వం అని, వైసీపీ ప్రభుత్వం మరోసారి వైఎస్ఆర్‌ పాలనను తలపించిందని అన్నారు.

నా స్టార్ క్యాంపెయినర్లు వారే

అన్ని పార్టీల మాదిరిగా వైసీపీ ప్రత్యేక స్టార్ క్యాంపెయినర్లు ఉండరని సీఎం జగన్ వెల్లడించారు. ‘‘వైసీపీకి స్టార్ క్యాంపెయినర్లు ప్రజలే. నా సొంత గడ్డ పులివెందుల అంటే నా ప్రాణం. నేను ఎదుర్కొన్న ప్రతి కష్టంలో పులివెందుల నాకు అండగా నాతోనే నడిచింది. పులివెందుల అంటే అభివృద్ధి, నమ్మకం, విజయానికి మారుపేరు. పులివెందుల చరిత్ర ఒక విజయగాథ. ఎవరికైనా మంచి చేయడం, ఇచ్చిన మాట తప్పకపోవడం పులివెందుల డీఎన్‌ఏలోనే ఉంది. వైసీపీ పార్టీకి స్టార్ క్యాంపెయినర్లంటూ ఎవరో ప్రత్యేకంగా ఉండరు. ప్రజలంతా మా స్టార్ క్యాంపెయినర్లే’’అని జగన్ పునరుద్దరించారు.

వైఎస్ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసింది ఎవరు !

‘‘సీఎం జగన్ అనే నేను.. పులివెందుల బిడ్డను. మీ బిడ్డను ఎదుర్కోలేక అంతా ఒక్కటై మూకుమ్మడిగా వస్తున్నారు. కానీ వైసీపీ, మీ బిడ్డ జగన్ వెనకడుగు వేయరు. ఎందుకంటే ప్రజలు మా వైపు ఉన్నారు కాబట్టి. ప్రజలు ఈ కుట్రలు పన్నే వారికి మీ ఓటుతో బుద్ధి చెప్పండి. జగన్ అంటే బ్రాండ్.. వైఎస్ఆర్ అంటే బ్రాండ్.. కడప అంటే బ్రాండ్..వీటిని దెబ్బకొట్టాలని చూస్తున్న వారిని మీరు మీ ఓటుతో కొట్టండి. వారికి సరైన గుణపాఠం నేర్పండి. నన్ను, అవినాష్‌నో మరోసారి ఆశీర్వదించి గెలిపించండి’’అని సీఎం జగన్.. ప్రజలను కోరారు.

Read More
Next Story