అగ్గిపెట్టెలో పట్టిన చీరను సింధుకు బహూకరించిన సీఎం
x

అగ్గిపెట్టెలో పట్టిన చీరను సింధుకు బహూకరించిన సీఎం

బీ ఇండియన్‌ బై ఇండియన్‌ అన్న నినాదం దేశమంతా రావాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


చేనేత కళాకారులు నేసిన అగ్గిపెట్టె లో పట్టిన చీరను సీఎం చంద్రబాబు ప్రముఖ షటిల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధుకు బహూకరించారు. విజయవాడ ఎస్‌ఎస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ లో గురువారం ఏర్పాటు చేసిన ఖాదీ సంత కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా వేదిక వద్ద ఏర్పాటు చేసిన జాతిపిత మహాత్మా గాంధీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులు అర్పించారు. స్వదేశీ ఉద్యమంలో భాగంగా ఏర్పాటు చేసిన ఖాదీ సంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సీఎం పరిశీలించారు. దేశీయంగా చేతివృత్తుల కళాకారులు ఉత్పత్తి చేసిన వివిధ ఉత్పత్తులను, ఆర్గానిక్‌ ఉత్పత్తులను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఖాదీ ఉద్యమంలో...స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్న వారి ఫొటో ఎగ్జిబిషన్‌ ను ముఖ్యమంత్రి చంద్రబాబు తిలకించారు. అలాగే ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్‌ ను సీఎం సందర్శించారు. ఖాదీసంత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాట్నంపై చంద్రబాబు నూలు వడికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. దసరా రోజు సంకల్పించిన ప్రతీ పని విజయవంతం అవుతుంది. స్వదేశీ పేరిట ఏర్పాటు చేసిన ఈ ఖాదీ సంత కార్యక్రమం కూడా విజయం సాధిస్తుంది. ఖాదీసంత, స్వదేశీ భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్‌ సంతగా తయారవుతుందని ఆశిస్తున్నాను. ఆ దిశగానే భారత్‌ ముందడుగులు వేస్తోంది. ఇప్పటి వరకూ విదేశీ వస్తువులు, విదేశీ టెక్నాలజీనే వాడుతూ వచ్చాం. ఇప్పుడు ప్రధాని మోదీ టెక్నాలజీ రంగంలోనూ స్వదేశీకి పిలుపునిచ్చారు. అందుకే బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇటీవలే స్వదేశీ 4 స్టాక్‌ ను దేశ ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. కోవిడ్‌ సమయంలో భారత్‌ ఉత్పత్తి చేసిన వ్యాక్సిన్లే వివిధ దేశాల ప్రజల ప్రాణాలు కాపాడాయి అని సీఎం అన్నారు.

ఆర్ధికంగా అగ్రస్థానానికి చేరటమే భరత మాతకు నిజమైన నివాళి
గతంలో ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి నుంచి భారత్‌ ఇప్పుడు పటిష్టమైన స్థానానికి ఎదిగింది. 2038కి ఆర్ధికంగా రెండో స్థానానికి భారత్‌ చేరుతుంది. 2047 నాటికి అగ్రస్థానంలోకి వస్తాం. ఇదే భారత మాతకు నిజమైన నివాళి అవుతుంది. గతంలో శాటిలైట్‌ లను ఇతర దేశాల నుంచి ప్రయోగించే పరిస్థితి నుంచి ప్రైవేటు వ్యక్తులు కూడా ఉపగ్రహాలను తయారు చేసి లాంచ్‌ చేసే పరిస్థితికి వచ్చేశాం. ప్రధాని మోదీ భారత దేశ మూలాలను ఎప్పుడూ గుర్తు తెస్తూనే ఉంటారు. ఆ మూలాలను వదిలిపెట్టకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. స్వాతంత్య్రానికి పూర్వం 60 శాతం మేర వివిధ ఉత్పత్తుల ఎగుమతులు భారత్‌ నుంచి జరిగేవి. బ్రిటిషర్లు వచ్చాక పరిస్థితులు మారి విదేశీ వస్తువులు మనం వాడే స్థితికి చేరుకున్నాం. ఈ పరిస్థితి మారాలి. బీ ఇండియన్‌ బై ఇండియన్‌ అన్న నినాదం దేశమంతా రావాలి. దేశంలో ఉండే జనాభా మనకు అతిపెద్ద ఆస్తి, సంపద, అతిపెద్ద మార్కెట్‌. మన ఉత్పత్తులు మనమే వినియోగించుకుంటే డిమాండ్‌ పెరిగి ఆర్ధిక లావాదేవీలు పెరుగుతాయి. స్వదేశీ ఉత్పత్తుల కోసం విదేశీ వస్త్రాలను తగులబెట్టమని గాంధీజీ పిలుపునిచ్చారు. గాంధీజీ ఆ పిలుపే స్వాతంత్య్ర పోరాటానికి ఊపిరైంది. గాంధీజీ నూలు వడికిన రాట్నమే స్వాతంత్య్రపోరాటానికి స్పూర్తిని ఇచ్చింది. ఆ మహనీయుడు సత్యం, అహింస, గ్రామ స్వరాజ్యం నినాదాలతో పాటు...స్వదేశీ నినాదం కూడా ఇచ్చారు. జైజవాన్, జై కిసాన్‌ అని లాల్‌ బహదూర్‌ శాస్త్రి నినాదం ఇచ్చి స్పూర్తిని నింపారు. ఇప్పుడు వాళ్ళిద్దరి స్పూర్తితో మళ్లీ స్వదేశీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున చేపట్టాలి. దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడాలి. అందరికీ మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే జీఎస్టీ 2.0 సంస్కరణలు వచ్చాయి. ఈ సంస్కరణల కారణంగా దేశ ప్రజల కొనుగోలు శక్తి పెరిగింది. ఎక్కడా ప్రభుత్వ ఆదాయం తగ్గడం లేదు. సంస్కరణలు ధనికులకు మాత్రమే కాదు.. పౌరులందరికీ సమానంగా ఆ ఫలాలు అందటం కోసమే సంస్కరణలు అని ముఖ్యమంత్రి అన్నారు.
మన ఉత్పత్తులను మనమే ప్రమోట్‌ చేసుకుందాం
స్వదేశీ వస్తువుల తయారీతో పాటు వాటి వినియోగమూ దేశంలో పెద్ద ఎత్తున పెరగాలి. రాష్ట్రంలోని చాలా ఉత్పత్తులు ఉన్నాయి.. వాటికి బ్రాండింగ్‌ వచ్చేలా చేయాలి. కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మలు, కొబ్బరి ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు ఇలా వేర్వేరు నాణ్యమైన ఉత్పత్తులు తయారు అవుతున్నాయి. వీటిని మనమే ప్రమోట్‌ చేసుకోవాలి. వీటి వినియోగం పెరిగితే.. మన సంççస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవటంతోపాటు.. మన ఆర్థిక వృద్ధికి తోడ్పాటు ఇచ్చినట్టు అవుతుంది. దీనికి ప్రతీ పౌరుడూ ముందుకు రావాలి. అప్పుడే నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు అవుతుంది. ఏటికొప్పాక, కొండపల్లి తదితర కళల్ని, చేనేత పరిశ్రమను ప్రభుత్వం ఆదుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మన స్వదేశీ ఉత్పత్తి అరకు కాఫీని ప్రమోట్‌ చేశాం. ఇప్పుడు అంతర్జాతీయంగా మంచి బ్రాండ్‌ గా అరకు కాఫీ మారుతోంది. గతంలో ఓ చిన్న ప్రభుత్వ విధానంతో ప్రపంచ వ్యాప్తంగా ఐటీ నిపుణుల్ని తయారు చేయగలిగాం. ఇప్పుడు ఏపీలో వన్‌ ఫ్యామిలీ, వన్‌ ఎంట్రప్రెన్యూర్‌ అనే విధానం తీసుకువచ్చాం. సంస్కరణలను అందిపుచ్చుకోవాలి అని ముఖ్యమంత్రి అన్నారు.
Read More
Next Story