ఏఐ సిటీగా అమరావతి.. అధికారులకు సీఎం డెడ్‌లైన్
x

ఏఐ సిటీగా అమరావతి.. అధికారులకు సీఎం డెడ్‌లైన్

సీఎం నారా చంద్రబాబు.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. త్వరితగతిన రాజధానిలో పనులను పునఃప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


సీఎం నారా చంద్రబాబు.. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని అమరావతి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. త్వరితగతిన రాజధానిలో పనులను పునఃప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. గురువారం రోజున సీఆర్డీఏ అధికారులతో సచివాలయంలో సమీక్షించారు. రాజధానిలో జరుగుతున్న పనులపై ఆరా తీశారు. అమరావతి తగ్గర చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేయాలని, అక్కడ పనులను తిరిగి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఒక్కసారి పనులు మొదలైతే ఆగకుండా సాగేలా అన్ని ఏర్పాట్లు జరగాలని హెచ్చరించారు. ముందుగా అమరావతిలో సీఆర్‌డీఏ కార్యాలయ నిర్మాణాన్ని 90 రోజుల్లో పూర్తి చేయాలని డెడ్‌లైన్ కూడా పెట్టారు.

అమరావతికి ఏఐ లోగో..

ఈ సమావేశంలో భాగంగానే అమరావతిని ఏఐ సిటీగా తీర్చిదిద్దాలని కూడా సూచించారు. అమరావతిని తలచుకుంటే ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్(ఏఐ) స్పురణకు వచ్చేలా ఆంగ్లంలో ఓ లోగోను సిద్ధం చేయాలని చెప్పారు. తొలి అక్షరం A, ఆఖరి అక్షరం I కలిసి వచ్చేలా కృత్రిమ మేధా(ఏఐ) సహాయంలో లోగోను రూపొందించాలని చెప్పారు. ఎటు చూసినా సాంకేతిక సౌలభ్యత ఉట్టిపడేలా అమరావతి నిర్మాణం సాగాలని సూచించారు. అమరావతి విషయంలో గత ప్రభుత్వం దుర్మార్గంగా ప్రవర్తించి రాజధాని నిర్మాణాన్ని భ్రష్టుపట్టించందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలోని ప్రభుత్వ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి ఎంత సమయం పడుగుతుంది, పనులు చేపట్టడానికి కొత్త టెండర్లను పిలవడం వంటి అంశాలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

ఎక్కడేసిన గొంగళి అక్కడే

‘‘జీ+7 విధానంతో టీడీపీ హయాంలో సీఆర్డీయే కార్యాలయ భవన నిర్మాణాన్ని తలపెట్టాం. అది జరుగుతున్న క్రమంలో ప్రభుత్వం మారింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఐదేళ్ల పాలన ముగించుకుని.. ప్రజల చేత మొట్టికాయలు వేయించుకుని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా తప్పుకంది. తీరా ఇప్పుడు వచ్చి చూస్తే ఈ ఐదేళ్ల కాలంలో సీఆర్డీఏ కార్యాలయ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు అంగుళం కూడా కదలలేదు. ఈ భవనాన్ని ఇప్పుడు పూర్తి చేయనున్నామని అధికారులు చెప్తున్నారు. ఇంత బాధ్యతారాహిత్యంగా ఒక ప్రభుత్వం ఎలా ఉంటుంది’’ అని మండిపడ్డారు. అనంతరం ఈ కార్యాలయాన్ని 90 రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని, ఈ భవన నిర్మాణ నాణ్యతలో రాజీ పడొద్దని సూచించారు.

గంటలో పూర్తి..

అనంతరం చంద్రబాబు హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్‌పై సమీక్షించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో నివాసం ఉండాలని భావించే వారి కోసం ఈ ప్రాజెక్ట్‌ను 14 ఎకరాల్లో రూపొందించామని, కానీ 2019లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టిందని చురకలంటించారు. ఈ ప్రాజెక్ట్ ప్రారంభించిన సమయంలో హ్యాపీనెస్ట్ ప్లాట్లన్నీ కూడా గంటల సమయంలో పూర్తిగా అమ్ముడయ్యాయని గుర్తు చేశారు. వైసీపీ ఈ ప్రాజెక్ట్‌ను నిలిపివేయడంతో కొనుగోలుదారులు వెనక్కువెళ్లిపోయారని అధికారులు వివరించారు. గత ప్రభుత్వ చర్యలతో కలిగిన నష్టాన్ని పూడ్చేలా విధానాలు రూపొందించాలని, ప్రాజెక్ట్‌ను మళ్ళీ పునరుద్దరించాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.

మెట్రో స్పీడ్ పెంచాలి

విశాఖ, విజయవాడలో మెట్రో పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలని చెప్పారు. విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌ను రెండు దఫాల్లో చేపడతామని ఏపీ మెట్రోరైల్ కార్పొరేషన్ ఎండీ రామకృష్ణా రెడ్డి వివరించారు. ఫేజ్-1లో 46 కిలోమీటర్ల పొడవు మెట్రో లైన్‌ను రూ.11,400 కోట్ల వ్యవయంతో నిర్మిస్తామని, రెండో విడత పనులను 30 కిలోమీటర్ల మేరా రూ.5,734 కోట్ల వ్యవయంతో నిర్మిస్తామని వెల్లడించారు. అయితే ఫేజ్-1 మెట్రో రైలు పనులను నాలుగేళ్లలో పూర్తి చేయాలని, అదే విధంగా విజయవాడలో రూ.11 వేల కోట్ల వ్యవయంతో నిర్మించే 38 కిలోమీటర్ల మెట్రో పనుల్లో కూడా వేగం పెంచాలని సూచించారు చంద్రబాబు.

Read More
Next Story