
తహసీల్దార్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో అర్జీలా.. చంద్రబాబు ఆగ్రహం
భూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు.
రెవెన్యూ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిపెట్టారు.రెవెన్యూ వ్యవస్థ బాగుపడాలని ఎన్నిసార్లు చెప్పినా తీరు మారడం లేదని అధికారులపై ముఖ్యమంతరి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.శుక్రవారం సచివాలయంలో రెవెన్యూ శాఖపై నిర్వహించిన కీలక సమీక్ష సమావేశంలో చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.భూ సమస్యల పరిష్కారంలో జాప్యం జరుగుతుండటంపై అధికారుల తీరును ఆయన తప్పుబట్టారు.
రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో భూ వివాదాలు, సర్వే సమస్యలు తీవ్రమయ్యాయని గత పాలకుల వైఫల్యాల కారణంగానే ఇలా జరిగిందన్న చంద్రబాబు వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత వుందన్నారు.తహసీల్దార్ కార్యాలయాల్లో వేల సంఖ్యలో అర్జీలు పరిష్కారానికి నోచుకోకుండా పేరుకుపోవడంపై ఆయన మండిపడ్డారు.భూ సమస్యలను వేగంగా పరిష్కరించడం, సేవలను సులభతరం చేయడం అత్యంత కీలకమని,అప్పుడే ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత వస్తుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.మహానాడులో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదిలోగా భూ సమస్యలను పరిష్కరించి తీరుతామని,ఆ దిశగానే అధికారుల కార్యాచరణ వుండాలని తేల్చి చెప్పారు.
ప్రక్షాళన దిశగా ...
ప్రజల సమస్యల పరిష్కారంలో కీలకమైన రెవెన్యూ శాఖలో సమూల ప్రక్షాళన అవసరమని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలుస్తోంది.కేవలం పైపైన మార్పులు కాకుండా, క్షేత్రస్థాయి నుంచి ప్రక్షాళన చేస్తే తప్ప ఫలితాలు రావని చంద్రబాబు భావిస్తున్నారు. మంత్రివర్గ సమావేశంలో కూడా ఇప్పటికే ఈ అంశాన్ని ప్రస్తావించిన చంద్రబాబు ,రెవెన్యూ సమస్యల పరిష్కార విషయంలో చొరవ చూపాలని కూడా మంత్రులకు సూచించారు.రెవెన్యూ సమస్యల పరిష్కార విషయంలో రాజీ పడేది లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. ఈరోజు జరిగిన రెవెన్యూ సమీక్షలో కూడా పలు అంశాలపై చంద్రబాబు స్పందించారు.సిబ్బంది కొరత, పనిభారం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటూనే, రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సాంకేతికత పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.
Next Story