అసైన్డ్ భూములపై మళ్లీ పరిశీలన ఎందుకంటే...
x

అసైన్డ్ భూములపై మళ్లీ పరిశీలన ఎందుకంటే...

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునఃపరిశీలించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన 5,74,908 ఎకరాల అసైన్డ్ భూముల వివరాలను పునఃపరిశీలించాలని అధికారులను సీఎం చంద్రబాబు (Chandrababu) ఆదేశించారు. ఫ్రీ హోల్డ్‌లో ఉంచిన అసైన్డ్ భూములు, 22ఏ, రీ సర్వే, ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, సీసీఎల్ఏ అధికారులు హాజరయ్యారు. గతేడాది జూన్ 15 నుంచి ఈ ఏడాది డిసెంబర్ 1 వరకు 5,28,217 గ్రీవెన్సులు వచ్చాయని, వీటిలో 4,55,189 పరిష్కరించగా, పరిశీలనలో మరో 73 వేల వరకు ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. పాలనా సంస్కరణలతో ఈ ఏడాది జూన్‌ నుంచి ఆటోమ్యుటేషన్ ప్రక్రియ వేగవంతమైందన్నారు.
జూన్ 2024 నుంచి ఇప్పటివరకు 22ఏ జాబితా నుంచి తప్పించాలని కోరుతూ 6,846 దరఖాస్తులు దాఖలయ్యాయన్నారు. ఎక్స్ సర్వీస్‌మెన్, రాజకీయ బాధితులు, స్వాతంత్ర్య సమరయోధులు, 1954 కంటే ముందు అసైన్డ్ భూములు కలిగిన వాళ్ల భూములు 22ఏ నుంచి తొలగించారని తెలిపారు. 6,693 గ్రామాల్లో రీసర్వే పూర్తిచేసి వెబ్ ల్యాండ్ 2.0లో వివరాల నమోదు చేశామన్నారు. రీసర్వేలో ఎలాంటి తప్పులు, పొరపాట్లు జరగకుండా భూమి రికార్డుల అప్‌గ్రెడేషన్ చేస్తున్నామన్నారు. 2.77 కోట్ల కుల ధృవీకరణ పత్రాలు ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.10,169 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు సీఎంకు తెలిపారు.
Read More
Next Story