బ్యాంకర్లకు చంద్రబాబు క్లాస్
x

బ్యాంకర్లకు చంద్రబాబు క్లాస్

రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు.. తీరు మారాలంటూ సూచనలు


బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు కొత్త ఆవిష్కరణల దిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు , పలు కీలక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వ్యవసాయం, ప్రాథమిక రంగాలు, ఎంఎస్ఎంఈ, ఎస్ హెచ్ జీ రంగాలు, రుణ వితరణ లక్ష్యాలు, గ్రామీణ ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలపై అధికారులతో చర్చించారు.

వన్ ఫ్యామిలీ- వన్ ఎంట్రపెన్యూర్ కార్యక్రమం, 175 నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు అంశంలో బ్యాంకుల సహకారంపై చంద్రబాబు చర్చలు జరిపారు. 231 ఎస్ఎల్ బీసీలో తీసుకున్న నిర్ణయాలపై యాక్షన్ టేకెన్ రిపోర్టుపై సమీక్ష చేశారు.రైతులు, ప్రజలు, ప్రభుత్వ ఆకాంక్షలకు అనుగుణంగా ఎస్ఎల్ బీసీ సమావేశాల నిర్ణయాలు ఉండాలని సూచించారు. రోటీన్ సమావేశాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఇండికేటర్లు కూడా రోటీన్‌గా మారుతున్నాయని చెప్పారు.

బ్యాంకర్ల తీరు మారాలి
మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా బ్యాంకర్లు తమ తీరు మార్చుకోవాల్సి ఉందన్నారు చంద్రబాబు. జీఎస్టీలో సంస్కరణల్ని కేంద్రం తీసుకువచ్చిందని. నెక్స్ట్ జనరేషన్ సంస్కరణలు వచ్చేస్తున్నాయని.బ్యాంకులు, పబ్లిక్ పాలసీలు ఎప్పుడూ ప్రజల్ని నియంత్రించకూడదని తెలిపారు. తదుపరి సంస్కరణల దిశగా ప్రోత్సహించాలన్నారు.ఖరీఫ్‌లో ఇప్పటికే సగం సమయం గడిచిపోయిందని, ఈ పాటికే రైతులకు రుణాలు, ఇన్ పుట్ ఇవ్వాల్సి ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సీజన్ ఆఖరులో రుణాలు ఇవ్వటం వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
పేదలు- ధనికుల మధ్య అంతరం తగ్గాలి
పేదలు- ధనికుల మధ్య అంతరాలు తగ్గేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని బ్యాంకర్లకు చంద్రబాబు సూచించారు. ఆర్ధికశాస్త్రం చదివిన విద్యార్ధిగా, ప్రజాప్రతినిధిగా పేదల గురించి తాను ఆలోచన చేస్తున్నట్లు ఆయన తెలిపారు.అమెరికా, చైనా లాంటి దేశాలకు సవాలు విసిరేలా మన ఆర్ధిక వ్యవస్థ తయారు అవుతోందని అన్నారు.2047 నాటికి బలమైన ఆర్ధిక వ్యవస్థగా భారత్ తయారవుతుందన్నారు. ఈ దశలో దేశంలో సంపద సృష్టి, ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు సమిష్టిగా పనిచేయాలని ముఖ్యమంత్రి కోరారు.ఈ క్రమంలోనే ఫాల్స్ లెండింగ్ చేయాలని ఎవరూ సిఫార్సు చేయరని, ఉత్పాదకత లేని రుణాలు కూడా మంచివి కావని వ్యాఖ్యానించారు. ఓ దశలో సంపద సృష్టి కోసం, పరిశ్రమల కోసం దావోస్ లాంటి ప్రాంతాల్లో తాను విస్తృతంగా తిరిగానని కూడా చెప్పుకొచ్చారు.
Read More
Next Story