నవంబర్ 12, బుధవారం
బుధవారం ముఖ్యమంత్రి విశాఖ చేరుకున్న అనంతరం భారత్ ఫోర్జ్ వైస్ చైర్మన్ అమిత్ కళ్యాణితో సమావేశం అవుతారు. తర్వాత భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సీఐఐ ప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షిస్తారు.
నవంబర్ 13, గురువారం
గురువారం విశాఖలోని నొవటెల్‌లో ‘పార్టనర్స్ ఇన్ ప్రోగ్రెస్ – ఇండియా – యూరప్ కోపరేషన్ ఫర్ సస్టెయినబుల్ గ్రోత్’ అంశంపై జరిగే ఇండియా–యూరోప్ బిజినెస్ రౌండ్‌టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. గ్రీన్ షిఫ్ట్, సస్టైనబుల్ ఇన్నోవేషన్, యూరోపియన్ పెట్టుబడులపై చర్చలు జరుపుతారు. మధ్యాహ్నం తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ ప్రతినిధులతో ముఖ్య భేటీలు ఉన్నాయి. ఎస్పీపీ పంప్స్ లిమిటెడ్, రెన్యూ పవర్, బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్, మురుగప్ప గ్రూప్, జూల్ గ్రూప్, హీరో ఫ్యూచర్ ఇంజినీర్స్ ప్రతినిధులతో సీఎం సమావేశమై చర్చిస్తారు. సాయంత్రం ‘వైజాగ్ ఎకనమిక్ రీజియన్’ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ‘స్పెషల్ మీటింగ్ ఆఫ్ సీఐఐ నేషనల్ కౌన్సిల్’కు హాజరవుతారు.
నవంబర్ 14, శుక్రవారం
శుక్రవారం 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సును భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ప్రారంభించనున్నారు. ఏపీ పెవిలియన్ ప్రారంభోత్సవంలో కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ కూడా పాల్గొంటారు. యూసుఫ్ అలీ, బాబా కళ్యాణి, కరణ్ అదానీ వంటి విశిష్ట అతిధులు దీనికి హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమం తర్వాత ‘టెక్నాలజీ, ట్రస్ట్, ట్రైడ్’ సెషన్ జరగనుంది. మధ్యాహ్నం జరిగే ‘ఏఐ ఫర్ వికసిత్ భారత్’ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఆర్టిఫీషియల్ ఇంటిజెన్స్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఏ విధంగా దోహద పడుతుందో సీఎం తన ప్రసంగంలో వివరిస్తారు. సింగపూర్ నుంచి విజయవాడకు నేరుగా విమాన సర్వీసులు నడిపేలా రాష్ట్ర ప్రభుత్వం సింగపూర్ ప్రతినిధులతో
ఒప్పందం చేసుకోనుంది. సాయంత్రం రాష్ట్ర ఆర్ధిక శాఖ నిర్వహించే ‘రీఇమేజినింగ్ పబ్లిక్ ఫైనాన్స్ సమ్మిట్’లో సీఎం పాల్గొంటారు. సంజీవ్ గోయింకా గ్రూప్ వైస్ చైర్మన్‌తో సమావేశమై అనంతరం విశాఖలో లులూ నిర్మించే నూతన మాల్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారు. రాత్రికి వివిధ కంపెనీలు ప్రభుత్వ ప్రతినిధులు, ఆహ్వానితుల గౌరవార్ధం ఇచ్చే గాలా డిన్నర్‌లో పాల్గొంటారు.
నవంబర్ 15, శనివారం
సదస్సు రెండో రోజు శనివారం... ఉదయం బ్లూమ్‌బెర్గ్ మీడియా ఇంటరాక్షన్‌లో సీఎం పాల్గొంటారు. తర్వాత రేమండ్, శ్రీసిటీ, ఇండోసోల్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. అలాగే... బహ్రెయిన్, న్యూజిలాండ్, కెనడా, జపాన్ ప్రతినిధులతో భేటీ అవుతారు. మధ్యాహ్నం వరల్డ్ ఎకనమిక్ ఫోరానికి చెందిన ‘సెంటర్ ఫర్ ఫ్రంటయిర్ టెక్నాలజీస్’ను ప్రారంభిస్తారు. అనంతరం గూగుల్ సంస్థ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తారు. సాయంత్రం ఎవోయూల మార్పిడి కార్యక్రమం నిర్వహించనున్నారు. సదస్సు చివరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం నిర్వహిస్తారు. భాగస్వామ్య సదస్సుతో సాధించిన ఫలితాలను వివరిస్తారు.
రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం
సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం ద్వారా రాష్ట్రానికి రూ.10 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వస్తాయని, ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు జరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సదస్సును విజయవంతం చేసేందుకు ఇప్పటికే సింగపూర్, యూఏఈ, యూకే వంటి దేశాల్లో పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రి రోడ్ షోలు, పర్యటనలు నిర్వహించారు. అటు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సహా పలువురు ఇతర మంత్రులు దేశ, విదేశాల్లో పెట్టుబడుల కోసం పలు సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. భాగస్వామ్య సదస్సు ద్వారా పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.