టీడీపీ ప్రజా ప్రతినిధులకు క్లాస్‌ పీకిన సీఎం చంద్రబాబు
x

టీడీపీ ప్రజా ప్రతినిధులకు క్లాస్‌ పీకిన సీఎం చంద్రబాబు

టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. లిక్కర్, ఇసుకల్లో తల దూర్చకుండా ఉండాలని దిశానిర్దేశం చేశారు.


తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు సీఎం చంద్రబాబు ఫుల్‌ క్లాస్‌ పీకారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం టీడీపీ ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి దిశా నిర్థేశం చేశారు.

ఎన్డీఏ కూటమి విజయాలు, టీడీపీ సభ్యత్వ నమోదు, పంచాయతీరాజ్‌ వ్యవస్థలు, సూపర్‌ సిక్స్, పల్లె పండుగతో పాటు పలు అంశాలపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా దారిమళ్లించారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఏ అరాచకం చూసినా, దాని వెనుక ఏదో ఒక గంజాయి బ్యాచ్‌ ఉంటోందని, తప్పు చేసిన వాళ్లను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తేలేదని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో ఇసుక, మద్యంపై కొత్త పాలసీలు తీసుకువచ్చామని, ఇసుక, లిక్కర్‌ అంశాల్లోనే కాకుండా ఇతర వ్యాపారాల్లోనూ ఎవరూ జోక్యం చేసుకోవద్దని టీడీపీ ప్రజాప్రతినిధులకు క్లాస్‌ పీకారు.
మాగుంట కుటుంబానికి ఇది వర్తించదని, ఆ కుటుంబం ఎప్పటినుంచో లిక్కర్‌ వ్యాపారంలో ఉందని, ఆ విధంగా కుటుంబ వారసత్వంగా వచ్చే వ్యాపారాలు చేసుకుంటే ఫర్వాలేదని కానీ కొత్తగా లిక్కర్‌ వ్యాపారంలోకి తల దూర్చి ధనార్జనే లక్ష్యంగా ప్రయత్నించవద్దని హెచ్చరించారు. విశ్వసనీయత చాలా ముఖ్యమని, అది పోవడానికి నిమిషం చాలని అన్నారు. దీనిని కాపాడుకోవాలని సూచించారు. టీడీపీ దేశ రాజకీయాల్లో ఎప్పటినుంచో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. టీడీపీ ఏనాడూ అధికారం కోసం అర్రులు చాచలేదన్నారు. దేశం కోసం, ప్రజల కోసం పాటుపడడమే టీడీపీకి తెలుసన్నారు.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు టీడీపీ సమర్థవంతమైన పాత్ర పోషించిందన్నారు. నాడు ఎలాంటి పదవులు తీసుకోకుండానే వాజ్‌ పేయి ప్రభుత్వంలో కొనసాగామన్నారు. పార్టీ కూడా కుటుంబం వంటిదేనని, చిన్న చిన్న సమస్యలు ఉండడం సహజమేనని అన్నారు. పార్టీలో ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో ఉండాలన్నారు. ఇప్పటి పరిస్థితుల్లో కార్యకర్త తప్పు చేసినా ఆ ప్రభావం సీఎంపై పడుతుందన్నారు. దీని వల్ల పార్టీ కూడా నష్టపోతుందన్నారు.
కేవలం డబ్బుతోనే ఎన్నికలు జరుగుతాయని అనుకోవద్దన్నారు. ఎంతో నమ్మకంతోనే ప్రజలు ఓటేశారని, కేంద్రంలో అనుకూల ప్రభుత్వం వచ్చింది కాబట్టే క్రమంగా నిలదొక్కుకుంటున్నామన్నారు. కూటమిలో ఉన్నాం కాబట్టి భాగస్వామ్య పార్టీలను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలన్నారు.
Read More
Next Story