వరద బాధితులకు అండగా ప్రభుత్వ ఉద్యోగులు.. సీఎంకు రూ.125కోట్ల విరాళం..
ఏపీ వరద బాధితులకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమకు తోచినంత సహాయం అందించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీకి విరాళాలు భారీగా వచ్చాయి.
ఏపీ వరద బాధితులకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమకు తోచినంత సహాయం అందించాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆయన పిలుపునిచ్చిన నేపథ్యంలో ఏపీకి విరాళాలు భారీగా వచ్చాయి. వరద బాధితులను ఆదుకోవడం కోసం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులంతా ఏకమయ్యారు. తమ ఒకరోజు వేతనాన్ని వరద బాధితులను ఆదుకోవడానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వారి ఒకరోజు మూలధన వేతనం మొత్తం సుమారు రూ.125 కోట్లు అని ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. ఈ మేరకు ఉద్యోగులు, పెన్షన్షనర్లు, ఉపాధ్యాయ సహా ఇతర అనుబంధ సంఘాల వారు తమ అంగీకార పత్రాన్ని ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో సీఎం చంద్రబాబుకు అందించారు. రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులంతా కలిసి కట్టుగా ముందుకు వచ్చి ఈ విరాళం ప్రకటించడాన్ని సీఎం చంద్రబాబు అభినందించారు. ఇదే ఐకమత్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో కూడా నడిపించాలని కోరారు. ఈరోజు ఉద్యోగులు చేసిన ఈ ఒక్క పని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.
పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగుల విరాళం రూ.14 కోట్లు
రాష్ట్రంలోని వరద బాధితులకు ఆదుకోవడానికి పవన్ కల్యాణ్ నేతృత్వంలోని పంచాయతీరాజ్ శాఖ ఉద్యోగులు కూడా ముందుకొచ్చారు. వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి తమ ఒకరోజు జీతాన్ని అందించనున్నట్లు ప్రకటించారు. మొత్తం శాఖలోని 1.64 లక్షల మంది ఉద్యోగుల ఒకరోజు జీతం రూ.14 కోట్లు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.75 లక్షలు, గ్రామీణ నీటిపారుదల శాఖ ఉద్యోగుల ఒక్క రోజు జీతం రూ.10 లక్షలను సీఎం సహాయనిధికి అందించనున్నట్లు వారు పవన్ కల్యాణ్ అందించిన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరినీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అభినందించారు.
తెలంగాణలో కూడా..
తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా సర్వం కోల్పోయిన కుటుంబాలను ఆదుకోవడానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పలువురు సీఎం సహాయనిధికి విరాళాలు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి అండగా నిలుస్తూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులంతా ఉదారత చాటుకున్నారు. వరద బాధితుల కోసం ఉద్యోగులంతా కలిసి తమ ఒకరోజు మూల వేతనం రూ. 130 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ నాయకులు మహబూబాబాద్ లో ముఖ్యమంత్రిని కలిసి సంతకాలతో కూడిన అంగీకార పత్రాన్ని అందజేశారు.