సర్పంచ్‌లు, టీడీపీ నాయకులకు మధ్య గొడవలు
x

సర్పంచ్‌లు, టీడీపీ నాయకులకు మధ్య గొడవలు

గ్రామ పంచాయతీల్లో నిధుల వినియోగంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. సర్పంచ్‌లు, టీడీపీ నేతలకు మధ్య గొడవలు వస్తున్నాయి. ఎందుకని?


పంచాయతీల్లో గత ఐదు సంవత్సరాల్లో కనీస అభివృద్ధి పనులు జరగలేదు. అప్పటి అధికార పార్టీ అయిన వైఎస్సార్‌సీపీ మద్దతు దారులైన సర్పంచ్‌లు సైతం పలు సందర్భాల్లో ఆందోళనలు కూడా చేశారు. నాటి ప్రభుత్వ విధానం కారణంగా ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి వచ్చే నిధులు నేరుగా పంచాయతీలకు అందని పరిస్థితులు ఏర్పడ్డాయి. కొందరు సర్పంచ్‌లు ఎస్టిమేషన్‌లు వేయించి అప్రువల్‌ అయిన తరువాత కాంట్రాక్టర్ల చేత పనులు చేయించారు. అయితే కాంట్రాక్టర్‌లకు సకాలంలో బిల్లులు అందించలేక పోయారు. అటు కాంట్రాక్టర్లు, సర్పంచ్‌లు ఆర్థికంగా నానా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. పంచాయతీలో ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితులు కూడా కొన్ని పంచాయతీల్లో ఏర్పడ్డాయి. చిన్న పంచాయతీల్లో సాధారణ నిధులు అనేవి ఉండటం చాలా కష్టం. నేటికీ కొన్ని గ్రామాల్లో ఇంటి పన్ను కూడా స్థానికులు చెల్లించే పరిస్థితులు లేవు. సర్పంచ్‌లు కూడా వారిని వత్తిడి చేసి అడిగిన సందర్భాలు లేవు.

గొడవలు ఎందుకు?
పంచాయతీల్లో ఇప్పటి వరకు చేసిన పనులకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరానికి రెండో విడత ఈ ఏడాది ఆగస్ట్‌లో రూ. 998.62 కోట్ల నిధులు ప్రభుత్వం విడుదల చేసింది. 2024–2025 ఆర్థిక సంవత్సరానికి మొదటి విడతగా మరో రూ. 998.07కోట్లు విడుదల చేస్తోంది. ఈ మొత్తాలతో కనీసం చేయాల్సిన పనులు అమలు చేసేందుకు వీలు ఉంటుంది. అయితే కొందరు సర్పంచ్‌లు గతంలో నిర్వహించిన పనులకు సంబంధించి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపు సగం మందికి పైన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారు. రాయలసీమ, కోస్తా ప్రాంతంలో బిల్లులు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లుల చెల్లింపు విషయంలో గొడవలు మొదలయ్యాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించవద్దని స్థానిక ఎమ్మెల్యేలు సర్పంచ్‌లపై వత్తిడి పెంచారు. దీంతో దిక్కుతోచని స్థితికి సర్పంచ్‌లు వెల్లిపోతున్నారు.
పెండింగ్‌లో సుమారు రూ. 500 కోట్ల బిల్లులు
ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో సర్పంచ్‌లు చేయించిన పనులకు సంబంధించి సుమారు రూ. 500 కోట్ల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ఆర్థిక సంఘం నిధులు వచ్చినందున బిల్లులు చెల్లించేందుకు సర్పంచ్‌లు రెడీ అయ్యారు. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలనుకునే సర్పంచుల్లో ఎక్కువ మంది వైఎస్సార్‌సీపీ బలపరిచిన వారే ఉన్నారు. సర్పంచ్‌లు పార్టీ గుర్తుపై గెలవకపోయినా ఆయా పార్టీలు బలపరిచిన వారే ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలు అడ్డుకట్ట వేస్తుండటంతో సర్పంచ్‌లకు, స్థానిక నాయకులకు పలు చోట్ల గొడవలు జరుగుతున్నాయి. వాగ్వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. కడప జిల్లాలో తగాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలోనూ ఇవే పరిస్థితులు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, సర్పంచ్‌లు ప్రకాశం జిల్లాలో వైఎస్సార్‌సీపీ వారే ఉన్నారు. వారికి అనుకూలు రైన కాంట్రాక్టర్లతో పనులు చేయించారు. బిల్లులు చెల్లించకుంటే తమపై కాంట్రాక్టర్లు కోర్టులకు వెళ్లే అవకాశం ఉందని, ఆ సమస్య రానివ్వకుండా బిల్లులు చెల్లించే పనిలో ఉన్నారని సమాచారం. ప్రస్తుతం వచ్చిన నిధులతో కొత్త పనులకు ఎస్టిమేషన్‌లు వేసి తాము చెప్పిన వారికి నామినేషన్‌ వర్కులు ఇవ్వాలని సర్పంచ్‌లపై ఎమ్మెల్యేలు వత్తిడి పెంచారు. పాత వర్కులకు బిల్లులు చెల్లించాలా? కొత్త పనులకు ప్రతిపాదనలు తయారు చేసి పనులు చేపట్టాలా అర్థం కాని పరిస్థితికి సర్పంచ్‌లు వెళ్లారు.
ఎవరి వాదన వారిది..
సర్పంచ్‌లకు పలు సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల నాయకులు ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. కొత్తగా నిధులు వచ్చినందున కొత్త పనులు చేయాలని కొందరు అంటుంటే, గతంలో పనిచేసిన వారికి బిల్లులు ఇవ్వకుండా కొత్త పనులు ఎలా చేస్తారని కొందరు నాయకులు అంటున్నారు. సర్పంచ్‌ల్లో కూడా నాలుగైదు సంఘాలు ఉన్నాయి. గతంలో చేసిన పనులకు బిల్లులు చెల్లించాలని పంచాయతీ కార్యదర్శులపై సర్పంచ్‌లు వత్తిడి పెంచారు. పాత పనుల నాణ్యత పరిశీలించిన తరువాతనే బిల్లులు ఇవ్వాలని కార్యదర్శులను ఎమ్మెల్యేలు ఆదేశిస్తున్నారు. ఎప్పుడో చేసిన పనులకు ఇప్పుడు నాణ్యత ఎలా చూస్తారని అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు అంటున్నారు. ఏమైనా ఈ వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారి గ్రామాల్లో కొట్లాటలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read More
Next Story