అమరావతి సెంటిమెంట్ తో భావోద్వేగానికి గురైన సీజేఐ
x

అమరావతి సెంటిమెంట్ తో భావోద్వేగానికి గురైన సీజేఐ

భారత రాజ్యాంగం 75 ఏళ్ల విజయ ప్రస్థానం సందర్భంగా సీజేఐ గవాయ్, సీఎం చంద్రబాబు ప్రసంగించారు.


భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ (ఏపీహెచ్‌సీఏఏ) ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారం (నవంబర్ 16, 2025) ప్రత్యేక సదస్సు నిర్వహించారు. 'ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్' అనే అంశంపై జరిగిన ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రధాన ప్రసంగం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తులు, అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు.

సీజేఐ జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ భారత రాజ్యాంగం గొప్పతనం గురించి మాట్లాడే అవకాశం తనకు రావడం చాలా గొప్ప విషయం. నా స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి. నా న్యాయవాద ప్రస్థానం అక్కడే ప్రారంభమైంది. సీజేఐగా నియమితుడిన తర్వాత తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతికి వచ్చాను, ఇది చాలా సంతోషం. మహారాష్ట్ర అమరావతిని ఇంద్రపురిగా పిలుస్తారు, ఏపీ అమరావతి కూడా ఇంద్రుడు తిరిగిన నేలగా ప్రసిద్ధి. నా చివరి కార్యక్రమం కూడా అమరావతిలో జరుగుతోంది అని భావోద్వేగంగా పేర్కొన్నారు. రాజ్యాంగం పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా రక్షణ కల్పించిందని, కోర్టులు హక్కులను కాపాడాలని సూచించారు. అంబేడ్కర్ రాజ్యాంగ సభకు అప్పగించిన ప్రసంగాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని కోరారు.

సామాజిక, ఆర్థిక సమానత్వం సాధనే లక్ష్యంగా ఆదేశిక సూత్రాలు పొందుపరచారని, పౌరులందరూ సమానంగా ఎదిగే అవకాశాలు కల్పించారని సీజేఐ వివరించారు. మహిళా సాధికారత కోసం సమాన అవకాశాలు రాజ్యాంగంలో ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, ఎస్సీ/ఎస్టీ రిజర్వేషన్లలో క్రీమీలేయర్ ఉండాలనేది తన అభిప్రాయమని చెప్పారు. అంబేడ్కర్ జ్యోతిరావు ఫూలేను గురువుగా భావించేవారని, మహిళలపై అసమానత రూపుమాపేందుకు ఫూలే కృషి చేశారని గుర్తు చేశారు. పని ప్రదేశాల్లో మహిళలపై వివక్ష ఉండకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని, న్యాయ రంగంలో మహిళలు రాణిస్తున్నారని ప్రశంసించారు.

రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కల్పించాలని సీజేఐ పిలుపునిచ్చారు. గిరిజన మహిళ తొలి రాష్ట్రపతి అయ్యారని, చాయ్‌వాలా ప్రధాని అయ్యారని, ఎస్సీలు లోక్‌సభ స్పీకర్లు, సీఎస్‌లు, డీజీపీలు అయ్యారని ఉదాహరించారు. ఏపీ ప్రభుత్వం ప్రజలను హెల్తీ, వెల్తీగా ఉంచే చర్యలు అభినందనీయమని పేర్కొన్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, "బీఆర్ అంబేడ్కర్ అత్యున్నతమైన రాజ్యాంగం రూపొందించారు. చాయ్‌వాలా దేశ ప్రధాని అయ్యారంటే అది మన రాజ్యాంగం వల్లే. ఆర్థిక సంస్కరణలు దేశ దిశను మార్చాయి. 2014లో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న మనం ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నాం. వచ్చే ఏడాది మూడో, 2038 నాటికి రెండో, 2047 నాటికి అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలి" అనేవి ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం గాడి తప్పినప్పుడు న్యాయవ్యవస్థ దాన్ని సరిచేస్తోందని, మీడియాలో మార్పులు వచ్చాయని, సోషల్ మీడియాను వ్యక్తిత్వ హననానికి ఉపయోగించడం దురదృష్టకరమని విమర్శించారు. ఈ సదస్సులో 300 మందికి పైగా న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Read More
Next Story