అనకాపల్లి ప్రచారంలో  సినీ నటుల హవా
x

అనకాపల్లి ప్రచారంలో సినీ నటుల హవా

కొణతాల రామకృష్ణ కోసం సినీ నటులు భారీగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగుతున్నారు. అనకాపల్లిలో గాజు గ్లాసు, కమలం గుర్తుకే ఓటేయాలంటూ ఇంటింటి ప్రచారం


అనకాపల్లి ప్రచారంలో అభ్యర్థి కంటే ఎక్కువగా సినీ నటుటలే కనిపిస్తున్నారు. అలా అని అభ్యర్థి ఏమీ సినీనటుడు కాదు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారూ కాదు. అయినా హైపర్ ఆది, జబర్దస్త్ అప్పారావు నుంచి పృథ్వీరాజ్ వరకూ రోజుకు ఒకరు వచ్చి కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అనకాపల్లి జనసేనకు కేటాయించడం ఇందుకు కారణమైతే అభ్యర్థి కొణతాల రామకృష్ణ పోటీ చేయడం మరో కారణం. అనకాపల్లిలో సినీ నటులకు విపరీతమైన ఆదరణ ఉండడంతో జనసేనకు మద్దతుగా వారు రంగంలోకి దిగారు. కొణతాలకు అల్లుడు అయిన చిన్ని సినీ దర్శకుడు కావడంతో ఆ పరిచయాలు కాస్త ఉపయోగపడుతున్నాయి.

కొణతాలకు మద్దతుగా

అనకాపల్లి స్థానిక గాంధీ నగరంలో గురువారం ఉదయం గడప గడపకు ప్రచారంలో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ, సినీ నటుడు పృథ్వీరాజ్ పాల్గొన్నారు. గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని ప్రచారం ప్రారంభించారు. గాంధీ నగరంలో పుర వీధుల్లో ప్రచారం నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు.. గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయాలని, ఎంపీ అభ్యర్థికి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. వీరికి ఏ వీధిలోకి వెళ్ళినా మహిళలు హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలుకుతూ మా ఓటు మీకే.. జనసేనకే అంటూ భరోసా ఇచ్చారు. వీరికి గాంధీ నగర్ టీడీపీ, జనసేన శ్రేణులు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. సినీ నటుడు పృథ్వీరాజ్‌ని చూడటానికి, సెల్ఫీలు దిగడానికి పిల్లలు, యువకులు, మహిళలు ఉర్రూతలూగారు. రానున్న మన ప్రభుత్వంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే అనకాపల్లిని అభివృద్ధి పథంలో నడిపించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.

సీఎం రమేష్ అయితే చిరంజీవితోనే సందేశం

బీజేపీ నేత సీఎం రమేష్.. అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థిగా ఖరారైన వెంటనే సినీనటుడు చిరంజీవిని కలిసి మద్దతు కోరారు. ఆ తరువాత పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబుతో కలిసి రెండో పర్యాయం చిరంజీవిని కలిసి ఏకంగా వీడియో సందేశం ఇప్పించారు. సీఎం రమేష్ తనకు అత్యంత ఆప్తుడని, ఆయన అనకాపల్లి నుంచి ఎంపిక కావడం అక్కడ ప్రజల అదృష్టం అవుతుందని చిరంజీవి తన సందేశంలో చెప్పారు. ఇలా అనకాపల్లి ఓటర్లకు ఈ అభ్యర్థుల కారణంగా రోజుకో సినీ నటుడు దర్శనమిస్తున్నారు.

Read More
Next Story