మాజీ మంత్రి జోగి రమేశ్ పై నాలుగో సారి సీఐడీ విచారణ
x
సీఐడీ విచారణ అనంతరం బయటకు వస్తున్న జోగి రమేష్

మాజీ మంత్రి జోగి రమేశ్ పై నాలుగో సారి సీఐడీ విచారణ

చంద్రబాబు ఇంటిపై దాడి కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతోంది. సీఐడీ పోలీసులు తమదైన శైలిలో విచారణ సాగిస్తున్నారు.


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై 2021లో జరిగిన దాడి కేసులో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నాయకుడు జోగి రమేష్‌తో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదైంది. ఈ కేసు రాజకీయ సంచలనాలకు కారణమైంది. జగన్ పై నేటి స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఎన్నికలకు ముందు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జోగి రమేశ్ ఆందోళన చేశారు. దాని ఫలితం ఆయనను పోలీసులు విచారిస్తున్నారు.

కేసులో నిందితుల సంఖ్య

ఈ కేసులో జోగి రమేష్‌, దేవినేని అవినాష్ సహా పలువురు నిందితులుగా ఉన్నారు. ఇప్పటి వరకు పది మందిని పోలీసులు విచారించారు. సుమారు 20 మంది పైన నిందితులుగా ఉన్నారు. అక్టోబర్ 2024లో జోగి రమేష్ అనుచరులైన రాము, అనిల్ కుమార్, చిన్ని, సుబ్బారావు, మధుబాబు, మాధవరావు మంగళగిరి డీఎస్పీ కార్యాలయంలో లొంగిపోయారు.

సీఐడీకి కేసు అప్పగింత

ఈ దాడి ఘటన 2021లో జరిగినప్పటికీ, తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో మొదట నమోదైన కేసును కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లో సీఐడీకి బదిలీ చేసింది. జోగి రమేష్‌ను సీఐడీ పోలీసులు ఇప్పటివరకు నాలుగు సార్లు విచారించారు. 2024 ఆగస్టు 21న ఒకసారి విచారణ జరిగింది. అయితే ఆయన సహకరించలేదని డీఎస్పీ మురళీకృష్ణ తెలిపారు. అక్టోబర్ 2, 2024న మరోసారి రెండు గంటల పాటు 27 ప్రశ్నలతో విచారణ జరిగింది. ఏప్రిల్ 10, 2025న మరోసారి విచారణకు హాజరయ్యారు. ఏప్రిల్ 11, 2025న మరోసారి విచారణకు రావాలని నోటీసు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్ హైకోర్టు మంజూరు చేసింది. దీంతో జోగి రమేశ్ ను పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు. విచారణల పేరుతో స్టేషన్ కు తిప్పుతున్నారు.

రాజకీయ కుట్రలో భాగంగా తనను పదేపదే పోలీసులు విచారణకు పిలుస్తున్నారని జోగి రమేశ్ ఆరోపించారు. మాజీ మంత్రి అయిన నన్నే ముప్పు తిప్పలు పెడుతున్నారంటే ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. కోర్టులో ఒక పక్క విచారణ జరుగుతుండగా పోలీసులు అత్యుత్సాహంతో మరో పక్క స్టేషన్ కు పిలిపించి విచారించడం ఏమిటని ఆయన ఎదురు దాడికి దిగారు.

కేసు నేపథ్యం..

ప్రస్తుత స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో ఆయన ఇంటి వద్ద పార్టీ నాయకులతో మాట్లాడుతూ వైఎస్ జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో జోగి రమేశ్, ఆయన అనుచరులు నిరసన తెలిపేందుకు వెళ్లారు. అక్కడ తెలుగుదేశం, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య గొడవ జరిగి కేసులకు దారి తీసింది.

Read More
Next Story