లారీల గ్రామం చిత్రాడ
x
చిత్రాడ గ్రామం

లారీల గ్రామం చిత్రాడ

రవాణా రంగంలో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గ్రామం చిత్రాడ. పిఠాపురం మండలంలో జాతీయ రహదారిని ఆనుకుని ఉంటుంది.


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలో ఉన్న చిత్రాడ గ్రామం లారీ డ్రైవర్లకు ప్రసిద్ధి చెందిన ఒక అద్భుతమైన ఉదాహరణ. జాతీయ రహదారి (NH-216) పై ఉన్న ఈ గ్రామంలో దాదాపు ప్రతి ఇంట్లో ఒకరు లారీ డ్రైవర్, క్లీనర్ లేదా మెకానిక్‌గా పని చేస్తున్నారు. సుమారు 10,000 మంది జనాభా ఉన్న ఈ గ్రామంలో 2,000 కుటుంబాలు ఉండగా, వీరిలో ఎక్కువ మంది రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. గత మూడు దశాబ్దాలుగా ఈ గ్రామం లారీలతో ముడిపడి ఉండటం విశేషం.


గ్రామంలో సుమారు 500 లారీలు ఉన్నాయి. చిన్న వ్యాన్‌ల నుంచి లారీలు, పెద్ద ట్యాంకర్లు, టిప్పర్లు, ఆయిల్ ట్యాంకర్ల వరకు ఇక్కడ ఉన్నాయి. దాదాపు 300 మంది సొంత లారీల యజమానులుగా ఉండగా, మిగిలినవారు ఇతరుల వద్ద డ్రైవర్లు లేదా క్లీనర్లుగా పని చేస్తున్నారు. ప్రతి లారీపై 2 నుంచి 4 గురి వరకు ఉపాధి పొందుతున్నారు. సమీపంలోని కాకినాడ పోర్టు, పరిశ్రమలు, జాతీయ రహదారి సౌకర్యాలు ఇక్కడ లారీ రంగాన్ని అభివృద్ధి చేశాయి. గతంలో వ్యవసాయంపై ఆధారపడిన గ్రామస్థులు పంటలు గిట్టుబాటు కాకపోవడంతో రవాణా వైపు మళ్లారు. ఏడాకుల బీర కాయలకు పుట్టినిల్లుగా చెప్పే ఈ గ్రామంలోని రైతులు ప్రతి ఇంటికీ ఒక ఎడ్ల బండి వాడేవారు. రానురానూ ట్రాక్టర్లు కొనుగోలు చేసి ఉపయోగించడం ప్రారంభించారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం అంతగా గిట్టుబాటు కాని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను చూసి వారు ఏమాత్రం భయపడలేదు. సరికొత్త జీవన మార్గాన్ని ఎంచుకున్నారు. అలా ఇక్కడి వారు రవాణా రంగంలోకి అడుగు పెట్టారు. క్వారీ లారీలు కొనుగోలు చేసి, సరికొత్త వ్యాపారానికి శ్రీకారం చుట్టారు. మొదట ఎడ్ల బండ్లు, ఆ తర్వాత ట్రాక్టర్లు, ఇప్పుడు లారీలు ఇలా ఈ పరిణామం గ్రామ ఆర్థిక వ్యవస్థను మార్చేసింది.


ఆర్థికంగా చూస్తే ఈ వృత్తి గ్రామస్థులకు లాభదాయకంగా మారింది. కూలి పనులు చేసేవారికి అప్పులు ఇవ్వడానికి ఎవరూ ముందుకు రారు. కానీ లారీ ఉంటే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు సులభంగా రుణాలు మంజూరు చేస్తాయి. "లారీ ఉందంటే ఎవరైనా అప్పులు ఇస్తారు. ఇవ్వాళ కాకుంటే రేపైనా తీరుస్తామనే భరోసాతో అప్పు పుడుతుంది" అని గ్రామస్థులు చెబుతున్నారు. ఉన్నత చదువులు చదివిన వారు కూడా డ్రైవింగ్‌ను ఎంచుకుంటున్నారు. ఎందుకంటే కూలి పనుల కంటే ఇది మెరుగైన ఆదాయం ఇస్తుంది.


ఒక లారీ యజమాని పులుగుల శ్రీనివాస్ మాట్లాడుతూ "మా గ్రామంలో చాలా మందికి లారీలున్నాయి. వాటితో మా కుటుంబ పోషణ చూసుకుంటున్నాం. లారీని మా ఇంట్లో ఒక వ్యక్తిగా భావించి జాగ్రత్తగా చూసుకుంటాం" అని అన్నారు. మరో యజమాని పులుగుల అప్పారావు "రవాణా రంగంలో మా గ్రామానికి గుర్తింపు వచ్చింది. లాభం వచ్చినా నష్టం వచ్చినా వాహనాలను నడపడం మానరు" అని చెప్పారు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న ఏపుగంటి వీర రాఘవులు ‘ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్’ ప్రతినిధితో మాట్లాడుతూ ‘మాకు లారీలే సర్వస్వం’ అని చెప్పటం విశేషం. బెంగళూరు, చెన్నై, కోల్ కత్తా వంటి నగరాలకు కూడా ఇక్కడి నుంచి వెళ్లి వస్తుంటామని చెప్పారు. మా లారీలు అన్నింటికీ నేషనల్ పర్మిట్ తీసుకుంటామని, అందువల్ల ఎక్కడికైనా వెళ్లేందుకు వీలు కలుగుతుందన్నారు.

చిత్రాడలోని ఎస్సీ పేటలో 600 ఇళ్ల వరకు ఉన్నాయి. ఈ పేటలో కూడా అందరూ లారీలపై ఆధారపడే జీవిస్తారు. పేట మొత్తంలో ప్రతి ఇంటికీ డ్రైవర్ లేదా క్లీనర్ ఉన్నారు. చిన్నప్పటి నుంచి లారీలే వీరి జీవితంగా మారాయి. ప్రస్తుతం లారీ ఫీల్డ్ లోకి వస్తున్న వారు ఎక్కువ మంది పెద్దగా చదువుకోవడం లేదు. అయితే ఈ గ్రామంలో లిటరసీ రేటు 61 శాతంగా ఉంది.


‘ది ఫెడరల్ ఛానల్’ కు వీడియో వాయిస్ ఇస్తున్న ఒక డ్రైవర్

వీరి మాతృభాష తెలుగు. ఎక్కడికి వెళ్లినా తెలుగు వారు ఉంటే తెలుగులోనే మాట్లాడతారు. కొంత మంది హిందీ కూడా నేర్చుకున్నారు. తరువాత తమిళం కూడా కొద్దిగా వస్తుంది. తమిళంలో మాట్లాడేందుకు పూర్తిగా రాకపోయినా తమిళంలో చెబితే అర్థం చేసుకుంటారు. ఎక్కవగా చెన్నై వంటి నగరాలకు లోడ్ లతో వెళుతున్నందున తమిళంపై పట్టు సాధించారు.


డ్రైవింగ్ కు వెళ్లని రోజుల్లో హైవే పక్కనే ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయం కబుర్లు చెప్పుకునే వేదిక

సామాజికంగా ఈ వృత్తి గ్రామానికి ఒక ప్రత్యేక సంస్కృతిని తెచ్చిపెట్టింది. పండగల సమయంలో లారీలను శుభ్రం చేసి, పూజలు చేసి, అలంకరించి ఊరంతా తిరుగుతారు. ఇది గ్రామంలో కోలాహలాన్ని సృష్టిస్తుంది. అయితే సవాళ్లు కూడా లేకపోలేదు. రోడ్డు ప్రమాదాలు, డ్రైవర్ల ఆరోగ్య సమస్యలు, ఇంధన ధరల పెరుగుదల వంటివి ఎదురవుతున్నాయి. ఉదాహరణకు కాకినాడ జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు ఈ రంగం రిస్క్‌లను గుర్తుచేస్తున్నాయి. అయినప్పటికీ గ్రామస్థులు భయపడకుండా ముందుకు సాగుతున్నారు.


మొత్తంగా చిత్రాడ గ్రామం రవాణా రంగం ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించిన ఒక గ్రామం. వ్యవసాయం నుంచి ఆధునిక రవాణాకు మారిన ఈ ప్రయాణం, ఇతర గ్రామాలకు స్ఫూర్తినిస్తుంది. అయితే భద్రతా చర్యలు, శిక్షణలు మరింత పెంచాల్సిన అవసరం ఉంది. ఈ గ్రామం ప్రత్యేకత లారీలు కేవలం వాహనాలు కాదు, జీవితాలు!

Read More
Next Story