
ఒకే సారి చిరంజీవి, కోట సినీ ప్రయాణం
ప్రముఖ సినీ నటుడు కోటా శ్రీనివాసరావు మృతి పట్ల ఏపీ ప్రముఖుల నివాళులు.
ప్రముఖ నటుడు, మాజీ ఎమ్మెల్యే కోట శ్రీనివాసరావు మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట శ్రీనివాసరావు ఆదివారం ఉదయం తుది శ్వాస విడిచారు.
సీఎం చంద్రబాబు ఏమన్నారంటే..
వైవిద్యభరితమైన పాత్రలతో సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ప్రముఖ నటులు కోట శ్రీనివాసరావు మరణం విచారకరం. సుమారు నాలుగు దశాబ్దాల పాటు సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన కళాసేవ, ఆయన పోషించిన పాత్రలు చిరస్మరణీయం. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఆయన పోషించిన ఎన్నో మధురమైన పాత్రలు పేక్షకుల మదిలో శాశ్వతంగా నిలిచిపోతాయి. ఆయన మృతి తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. 1999లో విజయవాడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఆయన ప్రజాసేవ చేశారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. అంటూ చంద్రబాబు ట్వీటర్ వేదికగా కోటకు సంతాపం తెలిపారు.
వైఎస్ జగన్ ఏమన్నారంటే..
ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు మృతి విచారకరం. విలక్షణమైన పాత్రల్లో నటించి, మెప్పించిన ఆయనను పద్మశ్రీతో పాటు ఎన్నో అవార్డులు వరించాయి. కోట గారి మృతి తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నట్లు జగన్ ట్వీటర్ వేదికగా సంతాపం తెలిపారు.
పవన్ కల్యాణ్ ఏమన్నారంటే..
ప్రముఖ సీనియర్ సినీనటులు, మాజీ ఎమ్మెల్యే, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మరణ వార్త తీవ్ర బాధాకరం. దాదాపు అనేక భారతీయ భాషల్లో 700 చిత్రాలకు పైగా విభిన్న పాత్రల్లో నటించిన బహుముఖ ప్రజ్ఞాశాలి కోట గారు ఇక లేరనే వార్త సినీ రంగానికి తీరని లోటు. ముఖ్యంగా అన్నయ్య చిరంజీవి గారితో కలిసి ప్రాణం ఖరీదు సినిమాతో ఒకేసారి సినీ ప్రయాణం మొదలు పెట్టారు. ఆయనతో కలిసి అర డజనుకుపైగా చిత్రాలలో నటించడం ఎప్పటికీ జ్ఞాపకంగా నిలిచిపోతుంది. ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు.
మంత్రి నారా లోకేష్ ఏమన్నారంటే..
ప్రముఖ నటులు, పద్మశ్రీ కోట శ్రీనివాసరావు మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నాను. నాలుగు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో విలక్షణ పాత్రలు పోషించిన కోట శ్రీనివాసరావు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. తన విలక్షణ నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోశారు. ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ఘనత ఆయనకే దక్కుతుంది. 1999లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన ప్రజాసేవలోనూ మంచి నాయకుడిగా పేరు సంపాదించుకున్నారు. ఆయన మరణం తెలుగు సినీ రంగానికి తీరనిలోటు. వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కోట శ్రీనివాసరావు కుటుంబ సభ్యులకు నా ప్రగాభ సానుభూతిని తెలియజేస్తున్నాను అంటూ లోకేష్ ట్వీటర్ వేదికగా సంతాపం తెలియజేశారు.
Next Story