
బిరియాని తెచ్చుకున్నారని పిల్లలను చితక బాదారు
కృష్ణా జిల్లా జవహర్ నవోదయ విద్యాలయంలో 26 మంది విద్యార్థులను సిబ్బంది చితకబాదారు.
ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలూరు గ్రామంలోని జవహర్ నవోదయ విద్యాలయం (JNV)లో దారుణం చోటుచేసుకుంది. ఈ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న 26 మంది విద్యార్థులను చావబాదారు. బయట నుంచి బిరియాని తెచ్చుకుని తిన్నందుకు క్రమశిక్షణ చర్యల పేరుతో ఘోరంగా చితకబాదారు. స్కూల్ లైబ్రరీ సిబ్బంది, ప్రిన్సిపాల్ విద్యార్థులను చావబాది, పేరెంట్స్‌ను పిలిచి ఇంటికి పంపేశారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర కోపానికి గురయ్యారు. ప్రభుత్వం రూపొందించిన మెనూ ను సిబ్బంది సరిగ్గా అమలు చేయకపోవడమే కారణమని ఆరోపిస్తూ, మంత్రి, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (DEO)లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, విద్యా అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జరిగింది.
8వ తరగతి 26 మంది విద్యార్థులు బయటి వ్యక్తుల సాయంతో రెండు సార్లు చికెన్ బిరియాని హాస్టల్‌లోకి తెప్పించుకుని తిన్నారు. ఇది గమనించిన స్కూల్ లైబ్రరీ సిబ్బంది విచక్షణారహితంగా విద్యార్థులను చితకబాదారు. దీంతో కొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. అందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటకు చెందిన విద్యార్థి మహీంద్ర హనుమ (8వ తరగతి) కాళ్లపై వాతలు పడి కమిలిపోయేలా కొట్టారు. విద్యార్థులు చేసిన దానిపై ప్రిన్సిపాల్ కూడా సీరియస్ అయ్యారు. విద్యార్థులపై సిబ్బంది దాడిని సమర్థిస్తూ పేరెంట్స్‌ను పిలిచి విద్యార్థులను ఇంటికి పంపేశారు.
అయితే విద్యార్థల తల్లిదండ్రులు మాత్రం దీనిని సీరియస్ గా తీసుకున్నారు. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. స్కూల్ మెనూను సరిగ్గా అమలు చేయకపోవడం వల్లే పిల్లలు బయట నుంచి బిరియాని తెచ్చుకున్నారని ఆరోపించారు. దీనికి మెనూను సక్రమంగా అమలు చేయని స్కూల్ ప్రిన్సిపాల్, సిబ్బందే కారణమని విమర్శించారు పిల్లలపై దాడికి పాల్పడిన లైబ్రరీ సిబ్బంది, ప్రిన్సిపాల్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి అంటూ డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో పేరెంట్స్ ఫిర్యాదు పోలీసులు, విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు, స్థానిక పోలీసులు, DEO, మెడికల్ హెల్త్ అధికారులు స్కూల్ కు చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గాయాలతో బాధపడుతున్న విద్యార్థులను స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్రిన్సిపాల్, లైబ్రరీ సిబ్బందిపై విచారణ జరుపుతామని DEO తెలిపారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వాలు విద్యార్థుల కోసం నిధులు ఇస్తున్నా.. విద్యార్థుల బాగోగులు పట్టించుకోకుండా క్రమశిక్షణ పేరుతో చిత్ర హింసలకు గురి చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్యాప్తు పూర్తి చేసి చర్యలు తీసుకుంటామని విద్యా శాఖ అధికారులు చెప్పారు.

