శ్రీశైలం వద్ద చిరుత నుంచి బిడ్డను కాపాడిన తండ్రి!
x

శ్రీశైలం వద్ద చిరుత నుంచి బిడ్డను కాపాడిన తండ్రి!

తల్లి పక్కలో నిద్రపోతున్న బిడ్డను ఓ చిరుత నోట కరుచుకుని ఎత్తుకుని పోయింది. దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెం ఈ ఊహించని ఉత్కంఠకు వేదికైంది.


శ్రీశైలానికి 12 కిలోమీటర్ల దూరంలోని ప్రకాశం జిల్లా దోర్నాల మండలం చిన్నారుట్ల చెంచుగూడెం బుధవారం అర్ధరాత్రి ఊహించని ఘటన జరిగింది. అడవుల్లో నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ ఒక చిరుతపులి గ్రామంలోకి ప్రవేశించి, నిద్రలో ఉన్న 3 ఏళ్ల చిన్నారిపై దాడి చేసింది.
తల్లి లింగేశ్వరి ఒడిలో నిద్రిస్తున్న చిన్నారిని అకస్మాత్తుగా పంజా వేసి పట్టుకున్న చిరుత, అడవి వైపు ఈడ్చుకెళ్తుండగా పక్కనే ఉన్న తండ్రి కుడుముల అంజయ్య తన అసమాన ధైర్యసాహసాలను ప్రదర్శించారు. క్షణం ఆలస్యం చేస్తే కూతుర్ని కోల్పోతానన్న భయంతో గట్టిగా కేకలు వేస్తూ చిరుతను వెంబడించాడు. కర్రలు, రాళ్లు విసురుతూ చిరుతను వెంబడించారు. ఆ తండ్రి ఆగ్రహం, గ్రామస్తుల కేకలు విన్న చిరుతపులి గ్రామ శివారులో చిన్నారిని వదిలేసి పారిపోయింది.
నెత్తుటి గాయాలతో వణికిపోతున్న చిన్నారిని తక్షణమే సున్నిపెంట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు.
70 ఏళ్లుగా చీకటిలోనే జీవితం
సుమారు ఏడు దశాబ్దాలుగా చిన్నారుట్ల చెంచుగూడెంలో నివసిస్తున్న చెంచులు తమకు విద్యుత్ సౌకర్యం కల్పించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐటీడీఏ అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని మండిపడ్డ వారు దోర్నాల–శ్రీశైలం రహదారిపై ఆర్టీసీ బస్సులు, వాహనాలను గంటపాటు ఆపి నిరసన తెలిపారు.
విషయం తెలుసుకున్న అటవీ శాఖ, పోలీసు శాఖ అధికారులు అక్కడికి చేరుకుని చెంచులతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు.
భయం గుప్పెట చెంచుగూడెం గ్రామం
చిరుత పులి గ్రామంలోకి వచ్చి చిన్నారిపై దాడి చేసిన ఘటనతో చెంచుగూడెం అంతా భయాందోళనలో ఉంది. గ్రామ శివారులో రాత్రి పహారా, అడవి అంచుల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెంచులు కోరుతున్నారు.
Read More
Next Story