‘పౌరుల స్పందనలే సమాజ మార్పుకు నాంది’
x

‘పౌరుల స్పందనలే సమాజ మార్పుకు నాంది’

సమాజంలో మార్పు అనేది యువత స్పందనతోనే ప్రారంభమవుతుందని పౌర చైతన్య వేదిక మేధావులు అభిప్రాయపడ్డారు. యువత తప్పకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు.


పౌర చైతన్య వేదిక (పీసీవీ) ఆధ్వర్యంలో తిరుపతిలో మేధావులు, విద్యావేత్తలు, ప్రముఖులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పౌర చైతన్య వేదిక అధ్యక్షుడు వాకా ప్రసాద్ అధ్యక్షత వహించగా, సీనియర్ జర్నలిస్టు, పౌర చైతన్య వేదిక అధ్యక్షులు రాఘవ శర్మ, పౌర చైతన్య వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ ఎస్.గోవిందరాజులు హాజరై ప్రసంగించారు.

జిల్లా అధ్యక్షులు - వాకా ప్రసాద్

ఈ సమావేశంలో వక్తలు ప్రసంగిస్తూ ప్రజలకు అత్యంత అవసరమైన నాణ్యమైన విద్యను, వైద్యాన్ని అందించే బాధ్యతలను ప్రభుత్వాలు విడనాడి, పక్కకు తప్పు కుంటున్నాయనీ దీన్ని యువత ప్రశ్నించాలని కోరారు. కేంద్ర బీజేపీ తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలు పౌర హక్కులను హరించి, పోలీస్ రాజ్యాన్ని నెలకొల్పే పథకంలో భాగమని వారు విమర్శించారు. ఎన్నికల్లో ఒక పార్టీకి మరొక పార్టీ ప్రత్యామ్నాయమని భావించడం, ప్రభుత్వాలను మార్చడం ఆనవాయితీ కాగా, ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనకు ప్రత్యామ్నాయం పౌర చైతన్యమని వారు అభిప్రాయపడ్డారు. ఈ చైతన్యంతో యువత ముందుకు వచ్చి సమాజం మార్పుకు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు.

జిల్లా కార్యదర్శి - ఏ.ఎన్.పరమేశ్వర రావు

ఈ సమావేశంలో పౌర చైతన్య వేదిక నూతన కార్యదర్శిగా ఎన్నికైన ఏ.ఎన్.పరమేశ్వర రావు మాట్లాడుతూ.. తిరుపతి నగర స్థానిక సమస్యలపై పౌర చైతన్య వేదిక స్పందిస్తుందని తెలియజేశారు. నగరంలో డ్రగ్స్ సరఫరా ముఖ్యంగా గంజాయి సరఫరా యువతను, విద్యార్థులను టార్గెట్‌గా చేసుకుని జరుగుతోందని, మాదక ద్రవ్యాలకు బానిసలై యువత పక్కదారి పడుతున్నారని, మాదక ద్రవ్యాల నిర్మూలనకు పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వేదిక అధ్యక్షులుగా తిరిగి ఎన్నికైన వాకా ప్రసాద్ మాట్లాడుతూ.. నేటి తరం సామాజిక స్పృహ లేని పౌరులుగా తయరవుతున్నారని, దీన్ని అడ్డుకోవడానికి పౌర చైతన్య వేదిక కృషి చేస్తుందని తెలిపారు. మానవతా దృక్పథంతో రోగులను ఆదుకునేందుకు రక్త దానం వంటి సేవా కార్యక్రమాలకు యువత ముందుకు రావాలని కోరారు.

ఈ సందర్భంగా పౌర చైతన్య వేదిక నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షుడిగా ఎ.రాఘవశర్మ, అధ్యక్షుడిగా వాకా ప్రసాద్, జిల్లా కార్యదర్శిగా ఏ.ఎన్.పరమేశ్వర రావు, ఉపాధ్యక్షులుగా తమటం రామచంద్రారెడ్డి, J.రమేష్ బాబు, ముషీర్ అహ్మద్, రిటైర్డ్ ప్రొఫెసర్ కాటూరి శారద, కార్యవర్గ సభ్యులుగా జి.ప్రతాప్ సింగ్, జి.షరీఫ్, ప్రొఫెసర్ పి.సి.వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ఏ.హరీష్, సభ్యులుగా సెల్వరాజ్, గోపి ప్రసాద్, ఎల్.ఎన్.లక్ష్మీ, జ్ఞాన ప్రసూన, శ్రీనివాస్, బుట్టా రామచంద్రుడు, ఎం.నాగరాజు మొత్తంగా 18 మందితో కూడిన వేదిక ఏర్పడింది.

Read More
Next Story