మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) రాజకీయం మహా రసవత్తంగా మారింది. మరికొద్ది రోజుల్లోనే విశాఖ మేయర్ పీఠం వైసీపీ నిలబెట్టుకుంటుందా? లేక కూటమి తన్నుకు పోతుందా? అనేది తేలిపోనుంది. జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసానికి ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విశాఖ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
కొన్నాళ్లుగా విశాఖ మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని కూటమి నేతలు కసరత్తు చేస్తున్నారు. 2021లో అధికారంలో ఉన్న అప్పటి వైసీపీ 59 మంది కార్పొరేటర్లతో ఈ మేయర్ స్థానాన్ని దక్కించుకుంది. మేయర్ పదవిని యాదవ (బీసీ) సామాజికవర్గానికి చెందిన గొలగాని హరివెంకట కుమారికి వైసీపీ పెద్దలు కట్టబెట్టారు. అప్పట్నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి ఢోకా లేకుండా ఆమె ఆ పదవిలో కొనసాగుతూ వచ్చారు. గత ఏడాది కూటమి ప్రభుత్వం పవర్‌లోకి వచ్చాక తమకు బలం లేకపోయినా, అదనంగా సంఖ్యా బలం వచ్చి చేరకపోయినా స్థానిక సంస్థల్లో పాగా వేసేందుకు పావులు కదుపుతూ వస్తోంది. అలా కొన్ని నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలను అడ్డదారుల్లో తమ వారిని అందలమెక్కించింది. ఈ పరంపరలో ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్దదైన విశాఖ నగర పాలక సంస్థ కూడా చేరింది.
ఎన్నో మలుపులు తిరుగుతూ..
నిజానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే జీవీఎంసీ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని కూటమి నేతలు ఉవ్విళ్లూరారు. మేయర్ హరి వెంకట కుమారిని అవిశ్వాసం ద్వారా గద్దె దించాలని ప్లాన్ వేశారు. అయితే నిబంధనల ప్రకారం నాలుగేళ్లు పూర్తయ్యే వరకు అవిశ్వాసం ప్రవేశపెట్టడానికి వీల్లేదని తెలియడంతో వెనక్కి తగ్గారు. అయినప్పటికీ తెరవెనక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అధికారం కోల్పోవడంతో డీలాపడ్డ వైసీపీ కార్పొరేటర్లకు ప్రలోభాల ఎర వేశారు. కూటమి నేతల *ఆఫర్*లకు కొంతమంది వైసీపీ కార్పొరేటర్లు కక్కుర్తి పడ్డారు. ఇలా 17 మంది కార్పొరేటర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరిపోయారు. అప్పటిదాకా వైసీపీకి మద్దతు పలికిన ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా టీడీపీకే జై కొట్టారు. దీంతో కేవలం 29 మంది కార్పొరేటర్లకే పరిమితమైన టీడీపీ సంఖ్యా బలం 48కి పెరిగింది. మరో ఏడుగురు వైసీపీ కార్పొరేటర్లు, ఒక ఇండిపెండెంటు కార్పొరేటరు జనసేన, మరో కార్పొరేటర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. జనసేన నుంచి మొదట్లో ముగ్గురు ఎన్నికయ్యారు. బీజేపీ, సీపీఐ, సీపీఎం నుంచి ఒక్కక్కరు చొప్పున గెలిచారు. దీంతో వైసీపీ నుంచి జంప్ చేసిన వారితో కలిసి జీవీఎంసీ కౌన్సిల్‌లో కూటమి బలం 61కి ఎగబాకింది. వైసీపీ బలం 34కి పడిపోయింది.
బెంగళూరులో వైసీపీ క్యాంప్..
ఒకవైపు వైసీపీ కార్పొరేటర్లు ఒక్కొక్కరుగా కూటమిలో చేరిపోతుండడంతో వైసీపీ ముందు జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఉన్న 34 మందిని చేజార్చుకోకూడదన్న ఉద్దేశంతో కార్పొరేట్లకు బెంగళూరులో క్యాంపు నిర్వహిస్తోంది. ఆ శిబిరానికి 27 మంది కార్పొరేటర్లను తరలించి వారెటూ పారిపోకుండా రేయింబవళ్లు కాపలా కాస్తున్నారు. మేయర్ హరి వెంకట కుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, సతీష్‌లు ఇద్దరితో కలిసి వైసీపీ సభ్యులు పక్కాగా 31 మంది ఉన్నారు. వైసీపీ నుంచి ఎన్నికైన మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమార్తె ప్రియాంక ) 5వ వార్డు కార్పొరేటర్), 12వ వార్డు కార్పొరేటర్ అక్కరమాని రోహిణ, వైసీపీ నేత బెహరా భాస్కరరావు భార్య, కోడలు కూడా వైసీపీ నుంచే కార్పొరేటర్లుగా ఎన్నికయ్యారు. మాజీ మంత్రి ముత్తంశెట్టి వైసీపీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన కుమార్తె వైసీపీకి దూరంగా ఉంటున్నారు. అలాగే భాస్కరరావు భార్య, కోడలూ వైసీపీకి దూరాన్నే పాటిస్తున్నారు. ఇక 12వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అక్కరమాని రోహిణ వ్యక్తిగత కారణాలతో బెంగళూరు క్యాంప్‌నకు వెళ్లలేదని, ఆమె తమ పార్టీలోనే ఉన్నారని వైసీపీ నేతలు చెబుతున్నారు.
ఎవరి లెక్కలు వారివి..
మేయర్‌పై అవిశ్వాసంలో గెలుపోటములపై ఎవరి లెక్కలు వారికున్నాయి. మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే 2/3 వంతు సభ్యులమెజారిటీ అవసరం. జీవీఎంసీ కౌన్సిల్‌లో మొత్తం కార్పొరేటర్ల సంఖ్య 98. అయితే వంశీక్రుష్ణ శ్రీనివాస్ కార్పొరేటర్‌గా గెలిచాక అప్పటి వైసీపీ ప్రభుత్వం ఆయనకు ఎమ్మెల్సీని చేసింది.
అప్పట్నుంచి ఆ స్థానానికి తిరిగి ఎన్నిక నిర్వహించలేదు. అందువల్ల కౌన్సిల్ మొత్తం సభ్యుల సంఖ్య 97. ఇందులో 2/3 వంతు మెజార్టీ ఉంటే అవిశ్వాస తీర్మానం నెగ్గుతుంది. 97 మంది కార్పొరేటర్లతో పాటు జీవీఎంసీ పరిధిలోని ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, నలుగురు ఎమ్మెల్సీలు వెరసి 14 మంది ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు హక్కును కలిగి ఉన్నారు. వీరితో మొత్తం 111 (97+14) మందికి గాను 2/3 వంతు సభ్యులు అంటే 74 మంది అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి కూటమికి 61 మంది కార్పొరేటర్లున్నారు. వీరు కాకుండా 11 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. వీరితో కలుపుకుంటే కూటమి బలం 72 ఉంది. అవిశ్వాసంలో నెగ్గాలంటే కూటమికి మరో ఇద్దరు సభ్యలు అవసరం. వైసీపీకి దూరంగా ఉంటున్న ముగ్గురిలో ఇద్దరు, సీపీఐ సభ్యుడు మరొకరితో పాటు వైసీపీలో అసంత్రుప్తితో ఉన్న మరికొందరు తమకు అనుకూలంగా ఓటేస్తారన్న ధీమాతో కూటమి నేతలున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అవిశ్వాస తీర్మానం అంత ఈజీ కాదంటున్నారు. ప్రస్తుతం తమ పార్టీలో ఉన్న వారంతా తమకే ఓటేస్తారని, పైగా కూటమిలో ఉన్న సభ్యులు కూడా తమకు ఓటేసేవారున్నారని, అందువల్ల మేయర్‌పై అవిశ్వాస తీర్మానం వీగిపోతుందని ధీమాగా ఉన్నారు.
కూటమి కార్పొరేటర్లకు మలేషియా ట్రప్?
మరోవైపు ఇప్పటికే కొద్ది రోజుల నుంచి వైసీపీ నేతలు తమ కార్పొరేటర్లను బెంగళూరు క్యాంపులో ఉంచారు. తాజాగా మేయర్‌పై అవిశ్వాస తీర్మానం తేదీ ఖరారవడంతో కూటమి నేతలు అదే బాట పట్టనున్నారు. తమ కార్పొరేటర్లతో పాటు వైసీపీ నుంచి చేరిన వారిని మలేషియా పంపించి అక్కడ క్యాంపు నిర్వహించాలని యోచిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లోనే వీరిని మలేషియా ట్రిప్‌నకు పంపే ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు.
19 ఉదయం 11 గంటలకు అవిశ్వాసం..
ఇప్పటికే జీవీఎంసీ మేయర్‌పై అవిశ్వాస తీర్మానికి వీలుగా మార్చి 21న జిల్లా కలెక్టర్, జీవీఎంసీ ఇన్‌చార్జి కమిషనర్ అయిన హరేందిరప్రసాద్‌కు కూటమి నేతలు నోటీసు అందజేశారు. అందులో తమకున్న సభ్యుల బలాన్ని తెలియజేశారు. దీంతో ఈనెల 19 ఉదయం 11 గంటలకు జీవీఎంసీ మేయర్ హరి వెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి వీలుగా బల ప్రదర్శనకు కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కలెక్టర్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వైసీపీ, కూటమి నేతలు తమ పార్టీ సభ్యులు చేజారిపోకుండా మరింత అప్రమత్తంగా ఉంటున్నారు.
విశాఖ నగరపాలక సంస్థలో ఒక మేయర్‌పై అవిశ్వాస తీర్మానం చేపట్టనుండడం ఇదే తొలిసారి కావడం విశేషం! విశాఖ మేయర్‌పై విశ్వసమా? అవిశ్వాసమా? అన్నది ఈనెల 19వ తేదీతో తేలిపోనుంది.