
ఏపీలో 22 నుంచే దసరా సెలవులు
దసరా సెలవులలో కీలక మార్పు చేస్తూ విద్యామంత్రి లోకేష్ అధికారిక ప్రకటన
ఈ ఏడాది దసరా సెలవుల తేదీలలో మార్పు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ కంటే రెండు రోజుల ముందే, అంటే ఈ నెల 22 నుంచే సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేశారు.దీంతో పాఠశాల విద్యార్థులకు, ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పినట్లయింది.
ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ విషయాన్ని 'ఎక్స్' వేదికగా ఆయన వెల్లడించారు. "పాఠశాలలకు దసరా సెలవులు ఈ నెల 22 నుంచి ఇవ్వాలని ఉపాధ్యాయులు కోరుతున్నారని టీడీపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు నా దృష్టికి తీసుకొచ్చారు. వారి కోరిక మేరకు విద్యా శాఖ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ దసరా పండుగ సెలవులు ఇవ్వాలని నిర్ణయించాం" అని తన ట్వీట్‌లో లోకేష్ పేర్కొన్నారు.
విద్యాశాఖ ముందుగా జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఉన్నాయి. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అదనంగా రెండు రోజులు సెలవులు లభించనున్నాయి. అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.
Next Story