ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో అదాని చేసుకున్న విద్యుత్ ఒప్పందాలపై కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలపై ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. అదానీపై చర్యలకు చంద్రబాబు గారికి కచ్చితమైన సమాచారం కావాలట. సమాచారం ఉంటే చర్యలు తీసుకుంటారట. చంద్రబాబు ఈ మాటలు ఈ దశాబ్ధపు అతి పెద్ద జోక్ అని ఎద్దేవా చేశారు. నాడు ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో విద్యుత్ ఒప్పందాలపై కోర్టుకి వెళ్ళారు? అదానీతో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని నాడు ఎందుకు విమర్శలు చేశారు? అదానీ పవర్ ఎక్కువ రేటు వెచ్చించి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయలు భారం పడిందని నాడు ఎందుకు చెప్పారు? తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని అదానీకి దోచి పెడుతున్నారు అని ఎందుకు ఆరోపణలు చేశారు? అంటూ సీఎం చంద్రబాబు మీద ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రతిపక్షంలో ఉండగా అదానీ మీకు శత్రువు. అధికార పక్షంగా అదే అదానీ మీకు మిత్రుడు. గత ప్రభుత్వం సెకీతో చేసుకున్న ఒప్పందంలో అవినీతి జరిగిందని, అదానీ పవర్‌తో చేసుకున్న అగ్రిమెంట్ వెనుక స్వయంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రూ.17వందల కోట్లు ముడుపులు తీసుకున్నారని, అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చింది. అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారు.
ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళముందు కనిపిస్తుంటే, అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి జగన్ నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లే అని ధ్వజమెత్తారు. అధికారం దగ్గర పెట్టుకుని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను చంద్రబాబు మరిచారు. కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ఏసీబీని సైతం రంగంలోకి దించకపోవడం అదానీని కాపాడుతున్నారు అనే దానికి నిదర్శనం. అదానీపై చర్యలకు సీఎం చంద్రబాబు భయపడుతున్నారు అనేది నిజం. మోడీ డైరెక్షన్లో విషయాన్ని పక్కదారి పట్టించారు అనేది వాస్తవం అని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అదానీతో మీకు కూడా రహస్య అజెండా లేకపోతే, రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీకు ముఖ్యం అనుకుంటే, లక్ష కోట్ల రూపాయలు భారం పడే అదానీ విద్యుత్ ఒప్పందాలను వెంటనే రద్దు చేయండి. అదానీ వ్యవహారంపై వెంటనే ఏసీబీని రంగంలోకి దించండి. నిజానిజాలు ఏంటో నిగ్గు తేల్చండని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.