అమరావతిలో చంద్రబాబు సొంత ఇల్లు–జగన్‌ ప్యాలెస్‌ ను మించి కడుతారా?
x

అమరావతిలో చంద్రబాబు సొంత ఇల్లు–జగన్‌ ప్యాలెస్‌ ను మించి కడుతారా?

గుట్టు చప్పుడు కాకుండా ఇప్పటికే భూమిని కొనుగోలు చేశారు. ప్లాన్‌లు కూడా సిద్ధం చేస్తున్నారు. వాస్తు పరిశీలన కూడా పూర్తి అయింది.


ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సొంత గృహాం కట్టుకునేందుకు రంగం సిద్ధమైంది. ఆ మేరకు అమరావతి ప్రాంతంలో భూమిని కూడా కొనుగోలు చేశారు. దాదాపు 25వేల చదరపు గజాల్లో ఇల్లు నిర్మించేందుకు ప్లాన్‌ సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతమైన వెలగపూడిలో భూమి కొనుగోలు చేశారు.

చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలం ల్యాండ్‌ పూలింగ్‌లో రాజధాని నిర్మాణానికి ఇచ్చిన భూమి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైతుల పేరు మీద ఉన్న ‘రిటర్నబుల్‌ ఫ్లాట్‌’ను చంద్రబాబు కొనుగోలు చేశారు. ఎంతకు కొనుగోలు చేశారనేది తెలియాల్సి ఉంది. రాజధానిలో సీడ్‌ యాకెస్‌ రోడ్డు పక్కనే ఉండటంతో పాటు ఈ ఫ్లాట్‌కు నాలుగు వైపులా రోడ్డు ఉండటంతో ఈ స్థలాన్ని చంద్రబాబు ఎంపిక చేసుకున్నారు. అంతేకాకుండా వాస్తు నిపుణులు కూడా దీనిని పరిశీలించి, ఇంటి నిర్మాణానికి అనుకూలంగా ఉందని సీఎం చంద్రబాబుకు వివరించినట్లు తెలిసింది.
దీనికి సమీపంలో ప్రభుత్వ అధికారులు, ఎన్జీవో సముదాయాలు, న్యాయమూర్తుల బంగళాలు, విఐటి యూనివర్శిటీ, తాత్కాలిక హైకోర్టు, అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్సులు ఉన్నాయి. రవాణా మార్గం సులువుగా ఉంటుందని దీనిపై చంద్రబాబు ఆసక్తి కనబరిచారు. అయితే ఈ స్థలం ఇంటి నిర్మాణానికి అనువుగా ఉందా? ఎన్ని ఫ్లోర్‌లు వేయొచ్చు? వంటి పలు అంశాలకు సంబంధించిన సాయిల్‌ టెస్టులు కూడా నిపుణుల ఆధ్వర్యంలో చేపట్టినట్లు తెలిసింది. త్వరలో ఇటింటి నిర్మాణ పనులు ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. 5 ఎకరాలకుపైగా ఉన్న ఈ స్థలంలో కొంత విస్తీర్ణంలో ఇల్లు నిర్మాణం, తక్కిన స్థలంలో సెక్యూరిటీ, వాహనాల పార్కింగ్‌ వంటి అవసరాలతో పాటు ప్రత్యేకమైన గార్డన్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్‌ కుటుంబ అవసరాలు, తన హోదాకు తగ్గట్టుగా ఈ ఇంటి నిర్మాణం చేయనున్నట్లు తెలిసింది. ఆ భూమికి ఇప్పటికే డబ్బులు కూడా చెల్లించినట్లు తెలిసింది.
జగన్‌కు మించి..
చంద్రబాబు సొంత ఇల్లును నిర్మించుకోనున్న నేపథ్యంలో జగన్‌కు మించిన ప్యాలెస్‌ను కడుతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విభజిత ఏపీకి చంద్రబాబు తొలి సీఎం అయినా.. ఆయన కంటే ముందుగా రాజధాని ప్రాంతంలో జగనే ఇల్లు కట్టుకున్నారు. తాడేపల్లిలో పెద్ద ప్యాలెస్‌ను నిర్మించుకున్నారు. అయితే చంద్రబాబు తాజాగా తన సొంత ఇంటిని నిర్మిస్తున్న తరుణంలో జగన్‌ ప్యాలస్‌కు మించిన విలాసవంతమైన భవనాన్ని కట్టుకుంటారా అనేది ఆసక్తిగా మారింది.
ఓటుకు నోటులో ఇరుక్కొని..
రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో తొలి సారి ప్రభుత్వం ఏర్పాటు చేసి, సీఎం అయినా కూడా ఏపీలో సొంత ఇల్లును నిర్మించుకునేందుకు చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపలేదు. హైదరాబాద్‌లో వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఇల్లు నిర్మించుకున్న చంద్రబాబు, అదే సరిపోతుందనే భావనలోనే ఉన్నారు. అయితే ఓటుకు నోటు కేసు ఒక్క సారిగా సీన్‌ మారి పోయింది. ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని, పరువు పోతుందని భావించిన చంద్రబాబు హడావుడిగా ఏపీకి మకాం మార్చారు. తొలుత విజయవాడలోని ప్రస్తుత గవర్నర్‌ బంగళాలో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఉండవల్లికి మార్చారు. ఉండవల్లి కృష్ణా నది ఒడ్డున లింగమనేనికి చెందిన అతిధి గృహంలోకి మారారు. గత పదేళ్లుగా అక్కడే ఉంటున్నారు. ప్రస్తుతం కూడా అందులోనే నివాసం ఉన్నారు.
వరద పోట్లు
అయితే చంద్రబాబుకు ఏపీలో సొంతిల్లు లేదు, హైదరాబాద్‌లోనే ఇల్లు కట్టుకున్నారు, ఏపీ మీద ఆయనకు ఎలాంటి ప్రేమ లేదు వంటి అనేక రకాల విమర్శలు వినిపించాయి. దీనికి తోడు ప్రకాశం బ్యారేజీకి వరదలు వచ్చిన ప్రతీ సారి చంద్రబాబు ఇల్లు ముంపునకు గురవుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది. పాములు, తేళ్లు వంటి విష పురుగులు కూడా వచ్చి చేరుతున్నాయి. దీంతో వరదలు వచ్చిన ప్రతీ సారి ఇలాంటి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇటీవల ఆగస్టులో వచ్చిన వరదల్లో రెండు ఫ్లోర్లు మునిగి పోయాయి. ఆ సమయంలో నానా ఇబ్బందులు పడ్డారు.
మరో వైపు కృష్ణా నది ఒడ్డునే ఈ ఇల్లు ఉండటం, పరివాహక ప్రాంతాన్ని ఆక్రమించి దీనిని కట్టారని, ఇది అక్రమ కట్టడమని, అందువల్ల దీనిని కూల్చి వేయాలని నిర్ణయం తీసుకున్న గత జగన్‌ ప్రభుత్వం ఆ మేరకు నోటీసులు కూడా అంటించారు. అప్పటి నుంచి చంద్రబాబు ఇల్లు అక్రమ కట్టడంగా ముద్రపడింది. ఈ నేపధ్యంలో వీటన్నింటికి చెక్‌ పెడుతూ తన సొంత ఇల్లును కట్టుకొని అక్కడికి మారిపోవాలని నిర్ణయించుకున్నారో, లేక అమరావతిలో తానే స్వయంగా ఇల్లు కట్టుకుంటే ఆ ప్రాంతంలోని భూములకు విలువ పెరుగుతుందని భావించారో కానీ మొత్తమ్మీద వెలగపూడిలో తన సొంత ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధమయ్యారు.
Read More
Next Story