
చంద్రబాబుది ముంచే ప్రభుత్వం
కూటమికి ఓట్లేసినందుకు యువత వారి చెప్పులతో వారే కొట్టుకుంటున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబుది మంచి ప్రభుత్వం కాదని, ముంచే ప్రభుత్వమని మాజీ మంత్రి ఆర్కే రోజా ధ్వజమెత్తారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రా? లేక టీడీపీకి ముఖ్యమంత్రా అని నిలదీశారు. సత్యవేడు సబ్‌జైల్లో ఉన్న తడకుపేట దళితులను పరామర్శించిన అనంతరం రోజా మాట్లాడారు. పోసాని కృష్ణమురళి ఆరేళ్ల క్రితం మాట్లాడిన మాటలకు ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం దారుణమన్నారు. అన్యాయంగా పోసానిపై 111 కేసులు పెట్టి కేసుల్లో ఇరికించారని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలు నాడు ప్రధాని నరేంద్ర మోదీని, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ దారుణంగా మాట్లాడారు. మరి వీళ్ల మీద బీజేపీ ప్రభుత్వం కానీ, ప్రధాని మోదీ కానీ కేసులు పెడితే వీళ్లు బయటకు వస్తారా? అని నిలదీశారు. వీరు చేస్తున్న తప్పులను ఎవరు ప్రశ్నించడ కూడదు, ఒక వేళ ప్రశ్నిస్తే వారిపైన కేసులు పెడుతున్నారు.
పోలీసు వ్యవస్థ కూడా దారణంగా తయారైంది. టీడీపీ కార్యకర్తలు మాదిరిగా పోలీసులు వ్యవహరిస్తున్నారు. నగరిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద హత్యాయత్నం కేసులు పెడుతున్నారు. సీఎం చంద్రబాబుకు ఎదురు మాట్లాడ కూడదనే కారణంతోనే వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ఇది గతంలో ఎన్నడు లేదు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం చేసే అవినీతి బయటకు రాకుండా ఉండేందుకే వైఎస్‌ఆర్‌సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు వ్యహరిస్తున్నట్టుగా గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కానీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వ్యవహరించి ఉంటే ఒక్క టీడీపీ కార్యకర్త కూడా మిగిలే వారు కాదని మండిపడ్డారు.
పార్టీలకు, ప్రాంతాలకు, కులాలకు అతీతంగా జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేశారని అన్నారు. కానీ సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా పాలనా సాగిస్తూ, ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్‌లను కూడా అమలు చేయలేక పోతున్నారని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో కూడా ఇది స్పష్టమైందన్నారు. రెడ్ బుక్ మీద పెట్టిన దృష్టి, సూపర్ సిక్స్ ఎలో బుక్ మీద ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. బడ్జెట్‌లో చెప్పిన దానికి సగానికిపైగా అప్పులు తెచ్చారని, ఈ అప్పులన్నీ ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. కూటమికి ఓట్లేసినందుకు యువత వారి చెప్పులతో వారే కొట్టుకుంటున్నారని మాజీ మంత్రి రోజా అన్నారు. ఉద్యోగస్తులు, మహిళలు, ప్రతి ఒక్కరు బాధపడుతున్నారని ధ్వజమెత్తారు.