పెద్దల సభల్లో ఆధిపత్యం కోసమే చంద్రబాబు ఆరాటం?
శాసన సభలోను, పార్లమెంట్‌లోను అధిక సంఖ్యలో సభ్యులు కలిగిన టీడీపీకి పెద్దల సభలో సభ్యులు లేరు. రాజ్య సభలో అయితే అసలు ప్రాతినిధ్యమే లేదు.
పెద్దల సభలైన శాసన మండలి, రాజ్య సభల్లో తన పార్టీ సభ్యుల సంఖ్యను పెంచుకొని జగన్ పార్టీ ఆధిపత్యం లేకుండా చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచించే పనికి ఉపక్రమించారు. అందులో భాగంగా రాజ్య సభ ఎంపీలు, శాసన మండలి ఎమ్మెల్సీలను తన పార్టీలోకి లాక్కునే ప్రయత్నాలకు పదును పెట్టారనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకి పెద్దల సభల్లో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. రాజ్య సభలో ఈ లోటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇన్నేళ్ల చరిత్రలో టీడీపీకి ఇలాంటి విచిత్రమైన పరిస్థితి ఏర్పడ లేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి రాజ్య సభలో టీడీపీ ప్రాతినిధ్యం లేకుండా పోవడం ఇదే తొలి సారి. కనకమేడల రవీంద్రకుమార్ టీడీపీ ఆఖరి రాజ్యసభ ఎంపీ. 2018లో రాజ్య సభలోకి అడుగు పెట్టిన ఆయన పదవీ కాలం ఏప్రిల్ 2, 2024తో ముగిసి పోయింది. అంతకు ముందు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీడీపీ నుంచి రాజ్య సభకు పంపినా తర్వాత వారు బీజేపీలో చేరారు. దాని కంటే ముందు 2014 నుంచి 2020 వరకు తోట సీతారామలక్ష్మి టీడీపీ సభ్యులుగా రాజ్య సభలో ప్రాతినిద్యం వహించారు. సీఎం రమేష్ 2012 నుంచి 2018 వరకు టీడీపీ రాజ్యసభ ఎంపీగాను ఉండగా, ఇదే టైమ్‌లో దేవేందర్ గౌడ్ కూడా టీడీపీ రాజ్య సభ ఎంపీగా ఉన్నారు. అంతకంటే ముందు గుండు సుధారాణి, సుజనా చౌదరి 2010 నుంచి 2016 వరకు రాజ్య సభలో టీడీపీ ఎంపీలుగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో లేక పోయినా రాజ్య సభలో మాత్రం ప్రాతినిద్యం వహించేందుకు అవకాశం లభించింది. విభజన అనంతరం 2024 తర్వాత రాజ్య సభలో ఉనికే లేకుండా పోయింది.
ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులే రాజ్య సభలో ఉన్నారు. 11 మంది ఎంపీలు వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన వారే. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథరెడ్డిలకు ఇటీవలే చోటు లభించింది. 2024 ఏప్రిల్ 2న రాజ్య సభ ఎంపీలుగా అడుగు పెట్టారు. 2030 ఏప్రిల్ వరకు వీరికి పదవీ కాలం ఉంది. అంతకంటే ముందు ఉన్న విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి, బీదా మస్తాన్‌రావు వైఎస్‌ఆర్‌సీపీ రాజ్య సభ ఎంపీలుగా ఉన్నారు. వీరి పదవీ కాలం 2028 ఏప్రిల్ 1తో ముగుస్తుంది. వారి కంటే ముందు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ సత్వానీ రాజ్య సభ ఎంపీలుగా ఉన్నారు. వీరి పదవీ కాలం 2026 జూన్ 21తో ముగుస్తుంది.
ఒక వైపు రాష్ట్రంలో చంద్రబాబు అధికారంలో ఉండటం,రాజ్య సభలో టీడీపీకి అవకాశం లేకుండా పోవడం, ఎన్డీఏ భాగస్వామి అయ్యుండి రాజ్య సభలో స్థానం లేక పోవడం, మరో వైపు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలబెట్టిన వారిలో చంద్రబాబు కీలకంగా మారడం, బీజేపీ తర్వాత అధిక ఎంపీ స్థానాలు కలిగిన ఎన్డీఏ పార్ట్‌నర్‌గా టీడీపీ కీలక స్థానంలో ఉన్నారు. మరో వైపు రాజ్య సభలో టీడీపీకి ప్రాతినిద్యం లేకుండా పోయింది. ఇది సీఎం చంద్రబాబుకు మింగుడు పడినట్టు లేదు. అందుకే ఎలాగైనా రాజ్య సభలో టీడీపీకి ప్రాతినిద్యం పెంచాలనుకున్నట్లు ఉన్నారు. అందుకే వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన రాజ్య సభ సభ్యులను తన పార్టీలోకి తీసుకంటున్నారనే టాక్ కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
అంతేకాకుండా కేంద్రంలో ఇప్పటికే కీలకంగా మారిన టీడీపీ పాత్రను మరింత స్ట్రాంగ్‌గా చేసుకోవాలనుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. లేక పోతే 11 రాజ్య సభ ఎంపీలున్న వైఎస్‌ఆర్‌సీపీ కేంద్రంలోని బీజేపీ పెద్దలు పీఎం మోదీ, అమిత్‌షాలకు దగ్గరయ్యే అవకాశం ఉంది. ఒక వేళ ఇదే జరిగితే చంద్రబాబు పరపతి కేంద్రంలో తగ్గే అవకాశం ఉంది. జగన్‌కు ప్రేయారిటీ పెరిగే చాన్స్ ఉంది. ఆ అవకాశం జగన్‌కు ఇవ్వకూడదని సీఎం చంద్రబాబు ఆలోచనలు చేశారు. అందుకే వారి సంఖ్యను తగ్గించడంతో పాటు టీడీపీ సంఖ్యను పెంచుకోవడంపై దృష్టి సారించారు. అందులో భాగంగా వైఎస్‌ఆర్‌సీపీ రాజ్య సభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావులను తన పార్టీలోకి తీసుకుంటున్నారనే టాక్ ఆ పార్టీ శ్రేణుల్లో కూడా వినిపిస్తోంది.
ఇక శాసన మండలి విషయంలో కూడా ఇదే రకమైన ఎత్తుగడలు వేస్తున్నారు. మండలిలో టీడీపీకి బలం లేదు. కేవలం 8 మంది ఎమ్మెల్సీలే ఉన్నారు. యనమల రామకృష్ణ, పర్చూరి అశోక్ బాబు, దువ్వారపు రామారావు, బెందుల తిరుమల నాయుడు, పంచుమర్తి అనురాధ, వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి టీడీపీ నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు. యనమలకు, అశోక్ బాబుకు, రామారావు, తిరుమల నాయుడుకు 2025 వరకు పదవీ కాలం ఉంది. పంచుమర్తి అనురాధకు 2029, చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, రామగోపాల్‌రెడ్డిలకు కూడా 2029 వరకు పదవీ కాలం ఉంది.
శాసన మండలిలో వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలే ఎక్కువ మంది ఉన్నారు. నామినేటెడ్ నుంచి కానీ, స్థానిక సంస్థల వరకు వారిదే పై చేయి. 38 మంది వరకు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు ఉన్నారు. మండలిలో వీరిని కాదని బల నిరూపణ చేసుకోవడం టీడీపీకి కష్టమే. 2019లో టీడీపీ ఎమ్మెల్సీలు ఎక్కువు మంది ఉన్నప్పుడు బిల్లులు పాస్ చేయించుకునేందుకు నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఎలా సమస్యలు ఎదుర్కొన్నారో, అదే పరస్థితి ఇప్పుడు చంద్రబాబు నాయుడుకు నెలకొంది. ఈ నేపథ్యంలో శాసన మండలిలలో కూడా తమ సభ్యుల సంఖ్య పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలు టీడీపీలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయినే టాక్ జోరుగా సాగుతోంది. అందులో భాగంగానే వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇటీవలే రాజీనామా చేసింది. త్వరలో టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.
Next Story