టీడీపీ విస్తరణకు చంద్రబాబు కీలక నిర్ణయం ?
x

టీడీపీ విస్తరణకు చంద్రబాబు కీలక నిర్ణయం ?

ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, కోల్ కత్తా, ముంబయ్, భువనేశ్వర్ లో తెలుగువాళ్ళ సంఖ్య చాలా ఎక్కువుందన్న విషయం అందరికీ తెలిసిందే.


తెలుగుదేశంపార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మంచి దూకుడుమీదుంది. 2024 ఎన్నికల్లో ఓడిపోతే పార్టీ పరిస్ధితి ఏమైపోతుందో అని చంద్రబాబుతో పాటు సీనియర్ తమ్ముళ్ళంతా తెగ టెన్షన్ పడిపోయారు. పార్టీ భవిష్యత్తును మలుపుతిప్పే ఎన్నికలుగా చంద్రబాబు, తమ్ముళ్ళు భావించారు. అలాంటిది వ్యూహాత్మకంగా చంద్రబాబు పావులు కదపటంతో మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి బొక్కబోర్లపడ్డారు. అదికూడా ఏ స్ధాయిలో దెబ్బతిన్నారంటే 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయారు. రాజకీయాలన్నాక ఇలాంటి ఎత్తుపల్లాలు చాలా మామూలే. ఈ విషయం బాగా తెలుసుకాబట్టే దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలన్న పద్దతిలో టీడీపీ బలోపేతానికి చంద్రబాబు కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం.

ఇంతకీ ఆ నిర్ణయం ఏమిటంటే తెలంగాణాతో పాటు దేశంలోని కీలకమైన మెట్రోనగరాల్లో కూడా పార్టీని బలోపేతం చేయాలని. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, కోల్ కత్తా, ముంబయ్, భువనేశ్వర్ లో తెలుగువాళ్ళ సంఖ్య చాలా ఎక్కువుందన్న విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణాలో తొందరలోనే జరగబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీచేయాలని ఇప్పటికే తెలంగాణా తమ్ముళ్ళు చంద్రబాబును గట్టిగా కోరుతున్నారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషనే చాలా కీలకం. ఒకపుడు జీహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా చక్రంతిప్పిన పార్టీ తర్వాత బాగా దెబ్బతినేసింది. అందుకనే ఏపీలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి తెలంగాణా ముఖ్యంగా హైదరాబాద్ నగరంపైన ప్రత్యేక దృష్టిపెట్టారు. నగరంలో పార్టీని బలోపేతం చేసే విషయమై ఇప్పటికే తమ్ముళ్ళతో చాలాసార్లు చంద్రబాబు భేటీ అయ్యారు.

స్ధానికసంస్ధల ఎన్నికల్లో పాల్గొనాలంటే అంతకన్నా ముందు చేయాల్సిన సభ్యత్వ నమోదుపైన దృష్టిపెట్టమని తమ్ముళ్ళని ఆదేశించారు. ఇపుడు తమ్ముళ్ళు అదేపనిపైన ఉన్నారు. సభ్యత్వ నమోదు పూర్తయిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికల విషయమై ప్రత్యేకంగా భేటీ అవ్వాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు.

ఇందులో భాగంగానే తెలగాణాతో పాటు మరికొన్ని మెట్రోనగరాలు ఢిల్లీ, చెన్నై, కోల్ కతా బెంగుళూరు, భువనేశ్వర్, ముంబాయ్ లో కూడా పార్టీని బలోపేతం చేసే విషయమై ఆలోచిస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఢిల్లీ, చెన్నై, బెంగుళూరు, భువనేశ్వర్ నగరాల్లో తెలుగువాళ్ళు లక్షలమంది ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు చంద్రబాబు పై నగరాల్లో పార్టీని బలోపేతంచేసే విషయాన్ని ఆలోచించలేదు. అయితే విచిత్రం ఏమిటంటే అండమాన్ లో పార్టీ యాక్టివ్ గానే ఉంది. ఆమధ్య జరిగిన స్ధానికసంస్ధల ఎన్నికల్లో పోర్ట్ బ్లయ్యర్ మున్సిపల్ ఎన్నికల్లో ఒకరిద్దరు కార్పొరేటర్లుగా టీడీపీ నేతలు గెలిచారు. అప్పట్లో ఆ విషయాన్ని పార్టీ బాగా హైలైట్ కూడా చేసింది. పోర్ట్ బ్లయ్యర్లోనే టీడీపీ యాక్టివ్ గా ఉన్నపుడు మనదేశంలోనే తెలుగువాళ్ళు ఎక్కువగా ఉన్న మెట్రో నగరాల్లో పార్టీని ఎందుకు బలోపేతం చేయకూడదనే చర్చ చంద్రబాబు-లోకేష్-కొందరు ఎంపీల మధ్య జరిగినట్లు సమాచారం.

అందుకనే ఢిల్లీ, భువనేశ్వర్లో తెలుగువాళ్ళతో మాట్లాడి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంచేసే బాధ్యతను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీద నారా లోకేష్ ఉంచినట్లు తెలుస్తోంది. విజయనగరం జిల్లాకు ఒడిస్సాతో దశాబ్దాలుగా బలమైన అనుబంధం ఉందని అందరికీ తెలిసిందే. ఒడిస్సా, విజయనగరం మధ్య వర్తక, వ్యాపార, కుటుంబసంబంధాలు చాలా బలంగా ఉన్నాయి. అందుకనే పై నగరాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అప్పలనాయుడుకు అప్పగించారు. పార్టీ బలోపేతంపై చంద్రబాబు శుక్రవారం సాయంత్రం తమ్ముళ్ళతో సమావేశం నిర్వహించబోతున్నారట. మెట్రో నగరాల్లో సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి చర్యలపై శుక్రవారం జరిగే సమావేశంలో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. వివిధ రాష్ట్రాల్లో పార్టీ శాఖలను ప్రారంభించే విషయంపైన కూడా చర్చ జరిగే అవకాశం ఉందని పార్టీవర్గాల సమాచారం.

తెలంగాణా మినహా మిగిలిన మెట్రో నగరాల్లో జరిగే ఎన్నికల్లో టీడీపీ పోటీచేయకపోయినా గెలుపోటములకు సంబంధించి అక్కడి పార్టీ సభ్యులు, అభిమానులు, మద్దతుదారులకు దిశానిర్దేశం చేసేస్ధాయికి చేరుకోవాలని ఆలోచిస్తున్నారు. ముందు మెట్రోనగరాల్లో సభ్యత్వం ద్వారా పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకుంటే తర్వాత ఆయా రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాన్ని ఆలోచించబోతున్నారు. ఇందుకోసమని ఎంపీల నాయకత్వంలో సీనియర్ తమ్ముళ్ళతో ప్రత్యేకంగా కమిటీలు కూడా వేయబోతున్నట్లు సమాచారం. మరి సాయంత్రం జరగబోయే సమావేశంలో ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Read More
Next Story