ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సరికొత్త కార్యక్రమానికి తెరతీశారు. అటు ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు ఇటు పార్టీ కార్యక్రమాలకు ఆయన తగిన సమయం వెచ్చిస్తూ రెండింటిని సమతుల్యం చేస్తూ వస్తున్నారు. ఎన్నడు లేని విధంగా 2024 ఎన్నికల అనంతరం కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తానని మాటిచ్చారు. అందులో భాంగా ప్రతి శనివారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలనికి వెళ్లి టీడీపీ శ్రేణులతో సమావేశం అవుతూ, వారి వినతులను స్వీకరిస్తున్నారు. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగా ’కాఫీ కబుర్లు‘ పేరుతో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయమైన ఎన్టీఆర్ భవన్ లో గురువారం తెలుగు తమ్ముళ్లతో కాఫీ తాగుతూ ఉల్లాసంగా గడిపారు. అక్కడ ఏర్పాటు చేసిన మండల పార్టీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు.
’కాఫీ కబుర్లు‘ కార్యక్రమం
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో సీఎం చంద్రబాబు 'కాఫీ కబుర్లు' అనే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులతో నేరుగా ముచ్చటించి, శిక్షణ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు.
ముఖ్యమంత్రి దిశానిర్దేశం
ప్రజా సేవ, ప్రచారం ముఖ్యం అని సూచించారు. మంచి పనులు చేయడం సగం పని మాత్రమేనని, వాటిని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం కూడా అంతే ముఖ్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ హయాంలోని శిక్షణ శిబిరాలను గుర్తుచేసుకుంటూ, నేటి అధునాతన వాతావరణంలోనూ క్రమశిక్షణ, సమన్వయం, సైద్ధాంతిక స్పష్టత అవసరమని ఉద్ఘాటించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ సన్నద్ధతపై ఆయన ఆరా తీశారు. క్షేత్రస్థాయిలో పార్టీ పట్టు కోల్పోయిన 6,000 పోలింగ్ బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.
త్రిసభ్య కమిటీలతో చర్చించారు. అనంతరం, జిల్లా పార్టీ అధ్యక్షులు, కమిటీల నియామకంపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీల సభ్యులతో ముఖ్యమంత్రి కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల కమిటీల కాలయాపనపై అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో, ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయానికి భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలు, కార్యకర్తల నుంచి సీఎం చంద్రబాబు వినతులు స్వీకరించారు, కొన్ని సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు.