చంద్రబాబు చిట్ చాట్..ఏమన్నారంటే
x

చంద్రబాబు చిట్ చాట్..ఏమన్నారంటే

పెట్టుబడుల కోసం బాగా కష్టపడుతున్నాడని నారా లోకేష్ ను సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో అనధికారిక చర్చ (చిట్ చాట్)లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సీఐఐ (కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) భాగస్వామ్య సదస్సు (పార్ట్నర్‌షిప్ సమ్మిట్ 2025) గురించి వివరించారు. ఈసారి సదస్సు నిర్మాణాత్మకంగా జరగనుందని, ప్రెజెంటేషన్, ఎగ్జిబిషన్, ఎగ్జిక్యూషన్ ఒప్పందాలు (MoUలు) జరుగుతాయని తెలిపారు. ఈ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని వెల్లడించారు.

పెట్టుబడుల సాధనలో మంత్రి నారా లోకేష్ క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారని సీఎం ప్రశంసించారు. క్వాంటమ్ కంప్యూటర్ సిద్ధమైందని, షిప్‌మెంట్ మాత్రమే మిగిలిందని, గడువులోపు అమరావతికి చేరేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అవినీతి నిర్మూలనకు సమగ్ర చర్యలు చేపడుతున్నామని, పెండింగ్ రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు ఆదేశాలిచ్చామని తెలిపారు. గత వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ నిర్వాకం వల్ల రెవెన్యూ అంశాలు సంక్లిష్టమయ్యాయని విమర్శించారు. 22ఏ నిషేధిత జాబితా భూములపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎమ్మెల్యేలు తప్పనిసరిగా ప్రజాదర్బార్ నిర్వహించాలని ఆదేశించామని, లోకేష్ సూచనలతో ఎమ్మెల్యేల్లో కదలిక వచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నారని చంద్రబాబు కొనియాడారు. ఎక్కడికక్కడ సమస్యలు పరిష్కారమయ్యేలా వ్యవస్థ ఏర్పాటు చేయడమే మా లక్ష్యమని నొక్కిచెప్పారు. అంతకుముందు సీఎం ప్రజల నుంచి వినతులు స్వీకరించి, వాటికి తక్షణ పరిష్కారాలు చూపారు.

సీఐఐ సదస్సు దావోస్ తరహాలో జరగాలని అధికారులకు ఇప్పటికే సీఎం ఆదేశించారు. ఈ సమ్మిట్‌లో రూ.9.8 లక్షల కోట్లకు పైగా 410 ఒప్పందాలు (MoUలు) కుదుర్చుకునే అవకాశం ఉంది. ఇది దేశంలోనే మొదటి 'జీరో వేస్ట్' ఈవెంట్‌గా దీనిని నిర్వహించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, ఇన్నోవేషన్ రంగాల్లో రాష్ట్ర ప్రగతిని ప్రదర్శించనున్నారు. ఇప్పటికే రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో ఉందని, ఇక స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై దృష్టి పెట్టామని చంద్రబాబు గుర్తుచేశారు.

Read More
Next Story