జగన్ పై చర్యలకు అవకాశం ఉందంటూ చంద్రబాబు రాజకీయం!
సెకి ఒప్పందంలో అరెస్ట్ చేయొచ్చు. లడ్డు వ్యవహారంలోనూ చర్యలు తీసుకోవచ్చు. నాలక్ష్యం కక్ష సాధింపు కాదు అంటారు సీఎం.. మరింకేమిటి అనేది ప్రశ్న.
అన్నింటా రాజకీయమే. గతంలో (పెద్ద మనసు కలిగిన వారు ఉన్నప్పుడు) అధికారం కోసం మాత్రమే రాజకీయాలు చేసే వారు. ఆ తరువాత మరిచి పోయేవారు. పవర్ సాధించిన తరువాత పాలన ఎలా సాగించాలి. ప్రజలను ఎలా మెప్పించాలని ఆలోచించే వారు. ఇప్పుడు అలా కాదు. తినే ఆహారం నుంచి కట్టుకునే బట్టల వరకు మనిషిని నిలువు దోపిడీ చేయడంలోనూ రాజకీయ కోణం ఉంటోంది. అంతే కాదు ఒక మనిషిని చీ కొట్టించాలన్నా, మంచి వాడని పొగడాలన్నా రాజకీయమే. అటువంటి కలియుగ రాజకీయ వ్యవస్థలో ఉన్నాం.
జగన్ గురించి చంద్రబాబు ఏమన్నారంటే...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సరం సందర్భంగా జనవరి ఒకటిన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియావారితో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాటలు పలువురిలో చర్చకు దారితీశాయి. వారం రోజులుగా ఈ మాటలపై చర్చ జరుగుతూనే ఉంది. ఇంతకూ ఆయన ఏమన్నారంటే.. ‘సెకి తో సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకునేందుకు కోట్ల రూపాయల్లో లంచాలు తీసుకున్నట్లు జగన్ పై ఆరోపణలు వచ్చాయి. ఆయనపై చర్యలు తీసుకోవడానికి తనకు ‘లడ్డూ’ లాంటి అవకాశం ఉంది. కక్ష తీర్చుకోవడం, జగన్ ను అరెస్ట్ చేయడమే తన లక్ష్యమైతే అధికారంలోకి రాగానే ఆ పని చేసే వాడిని’ అంటూ మాట్లాడారు. రాజకీయ కక్ష్య సాధింపు తన పద్దతి కాదని, విశ్వసనీయతకు ప్రాణమిస్తానని, వైఎస్సార్ సీపీ నాయకులకు తమకూ ఉన్న తేడా అదేనని అన్నారు. ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలోనే కాకుండా రాజకీయ విశ్లేషకుల్లో కూడా చర్చనియాంశంగా మారాయి.
సెకి తో ఒప్పందం రద్దు చేసుకుంటే జగన్ తో జరిమానా కట్టించలేరా..?
తప్పు చేసినట్లు ఆధారాలు ఉన్నాయి. అలాంటప్పుడు చర్యలు తీసుకుంటే తప్పెలా అవుతుంది. రాజకీయ కక్ష సాధింపు ఎలా అవుతుందనేది పలువురి ప్రశ్న. మాటల్లో మర్మం ఉంది. అందుకే చంద్రబాబు నాయుడు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో వడిదుడుకులను తట్టుకుని ముందుకు సాగారు. రాజకీయాలు సరిగ్గా వంటబట్టని జగన్ బోర్లా పడ్డాడనే చర్చ కూడా జరుగుతోంది. సెకీతో ఒప్పందం రద్దు చేస్తారా? జగన్ పై విచారణకు ఆదేశిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానంగా ఒప్పందం రద్దు చేసుకుంటే జరిమానా కట్టాలి. ఈ దశలో చర్యలు తీసుకోలేము అంటూ సున్నితంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి వేరే అంశంపై మాట్లాడారు. ఒప్పందం రద్దు చేసుకున్నప్పుడు జరిమానా కట్టాల్సి వస్తే ఆ జరిమానా తప్పు చేసిన వారు కదా కడతారు. తప్పు చేసిన వ్యక్తి పేద వాడు కాదు కదా.. అటువంటప్పుడు ఇటువంటి సమాధానం వస్తుందని ప్రశ్నించిన వారు ఊహించలేక పోయారు.
అదానీ సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేయాలి: సీపీఐ
సెకి విద్యుత్ ఒప్పందం వెనుక గత ప్రభుత్వ పెద్దలకు రూ. 1,750 కోట్లు లంచం అందినట్లు అమెరికా దర్యాప్తు సంస్థ విచారణ నివేదికలో ప్రస్తావించింది. అదానీ సంస్థతో ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇన్చార్జ్ చైర్మన్ ఠాకూర్ రామ్ సింగ్ కు ఒక వినతిపత్రం అందించారు. విద్యుత్ చార్జీల పెంపును ఆపివేయాలని కోరారు.
ఒప్పందం రద్దు చేసుకునే సాహసం చేయగలరా?
ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. కూటమి రాష్ట్రంలో అధికారంలో ఉంది. గత ప్రభుత్వంలో అదానీతో ఒప్పందం జరిగింది. అదానీ ప్రధాన మంత్రి మోదీ కి అత్యంత సన్నిహితుడు. అంతర్జాతీయ ఒప్పందాలు కూడా జరిగాయి. అమెరికా కోర్టులో విచారణ జరగబోతోంది. అయినా ప్రధాన మంత్రి స్పందించ లేదు. అలాంటప్పుడు సెకి ఒప్పందంపై ముఖ్యమంత్రి బాబు ఎలా స్పందిస్తారు. ఇదిగో స్పందన ఇలాగే ఉంటుంది. రాజకీయం అంటే ఎక్కడో ఏ విధంగానో ఉండదు. ఈ విధంగానే ఉంటుందనే చర్చ రాజకీయ వర్గాల్లోనే బలంగా జరుగుతోంది. ఎప్పుడైతే ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీ ఉందో అప్పుడే జగన్ పై చర్యలకు తెరపడింది. వైఎస్ జగన్ ఎన్డీఏలో లేకపోయినా ఎన్డీఏ ను ప్రభావితం చేయగలుగు తున్నారన్నది వాస్తమనే చర్చ కూడా ఉంది.
గత ప్రభుత్వ హయాంలో ఎన్డీఏ కు, వైఎస్సార్ సీపీకి విడదీయ రాని సంబంధం ఉన్నందునే రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదాను వదులు కున్నారనే విమర్శ కూడా ఉంది. ప్రత్యేక హోదా అంశం ఇక తెరమరుగైందని చెప్పొచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ఆ విషయమై ప్రస్తావించే అవకాశం కూడా లేదు. గతంలోనే ప్యాకేజీలు ఇస్తే చాలనే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ రాజకీయాలు కాక మరేమంటారనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో బలంగా ఉంది.
ఎఫ్ పిపిసిఏ పేరుతో చార్జీలు ఏమిటి?
ప్రతి సంవత్సరం విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు. ఎఫ్ పిపిసిఏ చార్జెస్ పేరుతో ఏప్రిల్ 2022, ఏప్రిల్ 2023, నవంబరు 2024 నెలనెలా చార్జీలు వందల్లో వసూలు చేస్తున్నారని, పేరుకు మాత్రమే చార్జీలు పెంచడం లేదంటున్నారని విద్యుత్ వినియోగ దారుల ఐక్యవేదిక నాయకులు పలువురు ఏపీఈఆర్సీ చైర్మన్ కు ప్రత్యేకంగా అర్జీ ఇచ్చారు. అవినీతి ఒప్పందం రద్దు చేయాలని కోరారు.
లడ్డులో కల్తీ చేయించిన వారిని ఎందుకు వదలాలి?
ప్రపంచ దేశాల్లో కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డు లో కల్తీ నెయ్యి వాడుతున్నారని సీఎం స్వయంగా వెల్లడించారు. తన వద్ద ఉన్న రిపోర్టును కూడా చదివి వినిపించారు. ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించారు. ఇప్పటికే పలు నెయ్యి ట్యాంకర్లు తనిఖీలు చేశారు. తప్పు జరిగింది గత ప్రభుత్వ హయాంలో.. మాజీ ముఖ్యమంత్రి జగన్ పై చర్యలు తీసుకోవడానికి ఆలస్యం ఎందుకు అనే చర్చ కూడా ఉంది. ఈ వ్యవహారంలో భక్తులు ఎవ్వరూ పెద్దగా స్పందించలేదు. ఆందోళనలు చేయలేదు. బాధ్యులు ఎవరో గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయలేదు. ఇవేమీ లేకుండా చర్యలు అంటే కావాలని సీఎం చంద్రబాబు చేస్తున్నారనే అపవాదు మూట గట్టుకోవాల్సి వస్తుంది. అందుకే రాజకీయం మంటే ఆచీ తూచీ అడుగులు వేయాలి. మాటయితే అన్నారు కానీ అక్కడేమీ లేదని చివరకు తేలితే అప్పుడెలా? అనే ఆలోచనలో కూడా పాలకులు ఉన్నట్లున్నారు. అందుకే అలా మాటలు చెప్పి సర్థుకున్నారనే వాదన కూడా ఉంది.
లడ్డూలో కల్తీ కలిపి సొమ్ము చేసుకున్న నాటి పాలకులపై చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఇప్పటికే డిమాండ్ చేశారు. కల్తీ నెయ్యి వాడటం వల్ల శ్రీవారి భక్తులకు అన్యాయం చేసిన వారవుతారని పేర్కొన్నారు.
బాబు వ్యూహం అనుకున్న సమయానికి తగులుతుంది
‘పిల్ల కాకి కి ఏమి తెలుసు ఉండేలు దెబ్బ’ అనే సామెత ఉంది. చంద్రబాబు నాయుడు ఇంత అనాలోచితంగా వెంటనే జగన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించి ఇన్నేళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న రాజకీయ జీవితాన్ని ఒక్కసారిగా కుప్ప కూల్చుకుంటారా? పిల్ల కాకి దెబ్బ తిన్నది కాబట్టి ఒక్కసారిగా పైకి దూకింది. చంద్రబాబు నాయుడు అలా కాదు, ఈ రోజు వ్యూహం రూపొందిస్తే అది అనున్న సమయానికి తగలాల్సిన వారికి తగులుతుంది. అప్పుడు దిమ్మ తిరుగుతుంది. అందుకే నా 40 ఏళ్ల జీవితంలో ఎంతో మందిని చూశాను. ఎన్నో రాజకీయాలు చేశాను. వీళ్లు నాకో లెక్కా? అంటూ చాలా సార్లు చంద్రబాబు నాయుడు అనటం మనం విన్నాం అంటూ ఊరూ, వాడా చర్చ జరుగుతూనే ఉంది.