కారు ప్లేసులో మళ్ళీ సైకిలా ?
x

కారు ప్లేసులో మళ్ళీ సైకిలా ?

చంద్రబాబునాయుడు ఇఫుడు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన కేసీయార్ ఇపుడు అడ్రస్ లేకుండా పోయారు.


రాజకీయాలు చకచకమారిపోతున్నాయి. జాతీయ రాజకీయాలతో పాటు తెలంగాణా, ఆంధ్రాలో కూడా రాజకీయాలు మారిపోతున్నాయి. మూడురోజుల క్రితంవరకు స్తబ్దుగా ఉన్న చంద్రబాబునాయుడు ఇఫుడు రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తున్నారు. మొన్నటి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శించిన కేసీయార్ ఇపుడు అడ్రస్ లేకుండా పోయారు. ఈ నేపధ్యంలోనే తెలంగాణాపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టినట్లు సమాచారం.

మారిన రాజకీయ పరిస్ధితుల నేపధ్యంలో తెలంగాణాలో టీడీపీ పుంజుకునేందుకు చంద్రబాబు అవసరమైన చర్యలు తీసుకోబోతున్నట్లు పార్టీలో ప్రచారం మొదలైంది. ఏపీలో అఖండవిజయం సాధించటంతో పాటు 16 పార్లమెంటు సీట్లలో టీడీపీ గెలవటంతో చంద్రబాబు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. దాంతో దశాబ్దకాలంగా తెలంగాణాలో దాదాపు భూస్ధాపితమైపోయిన పార్టీకి మళ్ళీ జవసత్వాలు కల్పించాలని అనుకుంటున్నారు. ఇంతకాలం కేసీయార్ దెబ్బకు చంద్రబాబు తెలంగాణా గురించి ఆలోచించటం మానేశారు. ఎప్పుడైతే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవటం, కాంగ్రెస్ అధికారంలోకి రావటం, అందులోను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవటంతో చంద్రబాబుకు కాస్త ధైర్యమొచ్చింది. అందుకనే హైదరాబాద్ లో రెగ్యులర్ గా తెలంగాణా నేతలతో భేటీ అవుతున్నారు.

తర్వాత ఏపీలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీతో పాటు పార్లమెంటుస్ధానాల్లో కూడా మంచి మెజారిటీతో గెలవటంతో చంద్రబాబులో ఎక్కడలేని ధైర్యమొచ్చేసింది. అందుకనే తెలంగాణాలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట. ఇపుడు ఎలాగూ ఎన్డీయే కూటమిలోనే ఉన్నారు కాబట్టి బీజేపీ నుండి ఎలాంటి సమస్యాలేదు. అందుకనే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా టీడీపీని బలోపేతం చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే టీడీపీ, రేవంత్, బీజేపీకి కామన్ శతృవు కేసీయార్ ఒక్కళ్ళే. అధికారికంగా బీజేపీతోను అనధికారికంగా రేవంత్ తోను చంద్రబాబు చేతులు కలిపితే బీఆర్ఎస్ ను దెబ్బకొట్టడం చంద్రబాబుకు పెద్ద కష్టమేమీకాదు.

కేసీయార్ కు భయపడే తెలంగాణాలో చాలా ఎన్నికలకు చంద్రబాబు దూరంగా ఉన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకే అనధికారికంగా కాంగ్రెస్ తో చేతులు కలిపారు. అందుకనే ఎన్నికలను సైతం త్యాగంచేశారు. గ్రేటర్ హైదరాబాద్, ఖమ్మం, నిజామాబాద్ లాంటి కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ అభ్యర్ధులకు మద్దతుగా టీడీపీ నేతలు ప్రచారం చేయటమే ఇందుకు నిదర్శనం. త్యాగానికి గుర్తింపుగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి ఎన్డీయే కూటమిలో చేరటంతో తెలంగాణాలో కొంతమంది బీజేపీ అభ్యర్ధులకు మద్దతుగానే టీడీపీ పనిచేసింది. ఖమ్మంలో మాత్రం కాంగ్రెస్ అభ్యర్ధి రామసహాయం రఘురామిరెడ్డి గెలుపుకు తమ్ముళ్ళు పనిచేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీటుకూడా గెలవకపోవటంతో చంద్రబాబుకు ఎక్కడలేని ధైర్యం వచ్చేసింది.

అందుకనే కారుపార్టీ స్ధానాన్ని సైకిల్ తో భర్తీ చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికల్లో టీడీపీని పోటీచేయించాలని ఆలోచిస్తున్నారట. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ లోనే తెలంగాణా నేతలతో ప్రత్యేకంగా భేటీ జరపబోతున్నట్లు ఇప్పటికే సంకేతాలు పంపినట్లు తమ్ముళ్ళు చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా 8 సీట్లలో గెలుపుతో జోష్ మీదుంది కాబట్టి తొందరలోనే బీఆర్ఎస్ ఎంఎల్ఏలను లాగేసుకుంటుంది. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ ఎంఎల్ఏలను ఆత్మప్రభోదం ప్రకారం నడుచుకొమ్మని రేవంత్ రెడ్డి పిలుపిచ్చింది. ఎంఎల్ఏలను లాక్కోవటంలో రేవంత్ టార్గెట్ రీచయితే బీఆర్ఎస్ కోలుకునే అవకాశాలు తక్కువనే చెప్పాలి. ఆపని రేవంత్ చేసిన తర్వాత చంద్రబాబు టీడీపీని బలోపేతం చేసే కార్యక్రమం ధైర్యంగా మొదలుపెడతారేమో చూడాలి.

Read More
Next Story