హస్తినకు వెళ్లనున్న చంద్రబాబు.. వారితో కీలక భేటీ
x

హస్తినకు వెళ్లనున్న చంద్రబాబు.. వారితో కీలక భేటీ

కేంద్ర బడ్జెట్ సమావేశాలకు ముందు ఆంధ్ర సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు చంద్రబాబు ఎందుకు వెళ్తున్నట్లు? నిధుల కోసమేనా?


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లడానికి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సిద్ధమవుతున్నారు. జూలై 4న ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్లడానికి అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ పర్యటనలో ఆయన పలువురు నేతలతో భేటీ కానున్నారు. ఇప్పటికే వారి అపాయింట్‌మెంట్లు కూడా తీసుకున్నారని సమాచారం. వారిలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో కీలకంగా భేటీ కానున్నారని టీడీపీ వర్గాలు చెప్పాయి. ఈ భేటిలో పలు ముఖ్య అంశాలను చంద్రబాబు లేవనెత్తనున్నట్లు తెలుస్తోంది.

వాటిపైనే స్పెషల్ ఫోకస్

కేంద్రం ఆర్థిక మంత్రితో చేయనున్న చర్చలో త్వరలో ప్రవేశ పెట్టే కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రధేశ్‌కు చేసే కేటాయింపులు, నిధులు, పథకాలపై చంద్రబాబు ముఖ్యంగా చర్చించనున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం తీసుకున్న అప్పులపై చర్చించి వాటి నుంచి తేరుకోవడానికి అమరావతి, పోలవరం నిర్మాణానికి పూర్తి స్థాయి సహకారం అందించాలని కోరాలని కూడా చంద్రబాబు యోచిస్తున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ సీఎంగా తొలిసారి ప్రధాని మోదీని కూడా చంద్రబాబు కలవనున్నారు.

బడ్జెట్‌ కసరత్తుల్లో కేంద్రం

ఇప్పటికే బడ్జెట్ ప్రవేశ్ పెట్టడానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బడ్జెట్‌ను సిద్ధం చేయడంలో కేంద్రం ఆర్థిక వర్గాలు తలమున్కలవుతోంది. ఇందుకోసం శాఖల వారీగా సమీక్షలు, వివిధ రంగాల నిపుణుల ద్వారా బడ్జెట్ కేటాయింపు అంశాలపై చర్యలు జోరుగా సాగుతున్నాయి. రాష్ట్రాలకు చేయాల్సిన కేటాయింపులు, ఇవ్వాల్సిన నిధులు, ప్రాజెక్టులకు ఇవ్వాల్సిన నిధులు వంటి ఇతర అంశాలపై కూడా కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఈ చర్చలు ఒక కొలిక్కి వస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ పరిశీలనకు అంతర్జాతీయ నిపుణుల బృందం రాష్ట్రానికి విచ్చేసి ఉంది. వారి పర్యటన పూర్తయిన రెండు రోజులకు చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ క్రమంలో ఆయన నిపుణుల బృందంతో చర్చలు చేసి.. ప్రాజెక్ట్ స్టేటస్ తెలుసుకుని, దాంతో కేంద్రంతో చర్చలు చేసి నిధులు కోరనున్నారని కూడా తెలుస్తోంది. ప్రాజెక్ట్ విషయంలో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలనే విషయంపై కేంద్ర జలశక్తి అధికారులతో కూడా చంద్రబాబు చర్చించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

Read More
Next Story